మెగా 157 టైటిల్‌... అనిల్‌ కన్ఫ్యూజన్‌లో ఉన్నాడా?

మెగాస్టార్‌ చిరంజీవి ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మెగా 157;

Update: 2025-07-12 21:30 GMT

మెగాస్టార్‌ చిరంజీవి ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మెగా 157. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ చకచక జరుగుతోంది. వచ్చే నెలలో చిరంజీవి పుట్టిన రోజు ఉంది. ఆ సమయంలో ఖచ్చితంగా టీజర్‌ను వదలాలి అని అనిల్ రావిపూడి భావిస్తున్నాడు. అప్పటి వరకు టైటిల్‌ విషయంలో ఒక స్పష్టతను ఇవ్వాలని భావిస్తున్నాడట. అందులో భాగంగానే రెండు మూడు టైటిల్స్‌ను మెల్ల మెల్లగా లీక్‌ చేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన మనసులో ఉన్న టైటిల్స్‌ను సోషల్‌ మీడియా ద్వారా జనాల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

చిరంజీవి - అనిల్‌ రావిపూడి కాంబో మూవీ ప్రారంభం అయిన సమయంలో చేసిన హడావుడి, ఎక్కువ సార్లు రఫ్ఫాడిద్దాం అంటూ చెప్పడంతో సినిమాకు టైటిల్‌గా రఫ్ఫాడిద్దాం అనే టైటిల్‌ను ఖరారు చేశారు అనే వార్తలు వచ్చాయి. దర్శకుడు అనిల్‌ రావిపూడికి ఆ టైటిల్‌ విషయమై నెగటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ వచ్చినట్లు సమాచారం అందుతోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ ఈ మాస్‌ టైటిల్‌పై ఆసక్తి చూపడం లేదని ఆయన గుర్తించినట్లుగా ఉన్నాడు. అందుకే అనిల్‌ రావిపూడి ఇటీవల కొత్త టైటిల్‌ను మెల్లగా జనాల్లోకి పంపించాడని, అదే 'మన శంకర వరప్రసాద్‌'గా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చిరంజీవి అసలు పేరు మీద సినిమా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయానికి అనిల్‌ వచ్చాడు అంటున్నారు. ఈ రెండు టైటిల్ ల విషయంలో అనిల్ కాస్త గందరగోళానికి గురి అవుతున్నాడని సమాచారం.

సోషల్‌ మీడియాలో 'మన శంకర వరప్రసాద్‌' టైటిల్‌ గురించి చర్చ మొదలైంది. చిరంజీవి అసలు పేరుతో సినిమా రావడం మంచి పరిణామం అంటూ కొందరు కామెంట్స్ చేస్తే, కొందరు మాత్రం టైటిల్‌ పట్టేసే విధంగా లేదని కొందరు అంటున్నారు. సంక్రాంతికి వస్తున్నాం, భగవంత్‌ కేసరి, సరిలేరు నీకెవ్వరు వంటి క్యాచీ టైటిల్‌గా మన శంకర వర ప్రసాద్ లేదు అని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విషయం ఏంటంటే ఇంతకు ముందు చెప్పుకున్న ఆ హిట్ మూవీ టైటిల్స్ ను కూడా మొదట చాలామంది వ్యతిరేకించారు. కానీ దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రం చాలా కాన్ఫిడెన్స్‌తో టైటిల్‌లను ఖరారు చేయడం జరిగింది.

అనిల్ రావిపూడి టైటిల్స్ ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. అతడు సినిమా స్క్రిప్ట్‌ రాసుకునే సమయంలో టైటిల్స్‌ రెండు మూడు అనుకుంటాడట. అందులో ఒకటి ఇప్పటికే ఈ సినిమాకు ఫైనల్‌ అయ్యి ఉంటుంది, అది చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా రివీల్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్‌ హిట్‌ను అందుకున్న దర్శకుడు అనిల్‌ రావిపూడికి విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. అందుకే ఈ సినిమాకు గాను అనిల్‌ రావిపూడి రికార్డ్‌ స్థాయిలో పారితోషికం తీసుకున్నాడనే వార్తలు వస్తున్నాయి. 2026 సంక్రాంతికి వచ్చే విధంగా చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబో విడుదల కాబోతుంది. వచ్చే నెలలో సినిమా టైటిల్‌ విషయంలో మరింత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News