ఇప్పటికీ ఆ కేసును ఎదుర్కొంటున్నాను.. చిన్మయి ఆవేదన!
ప్రముఖ గాయని కం డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయికి వెటరన్ లిరిసిస్ట్ వైరముత్తుతో ఉన్న వైరం గురించి తెలిసిందే.;
ప్రముఖ గాయని కం డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయికి వెటరన్ లిరిసిస్ట్ వైరముత్తుతో ఉన్న వైరం గురించి తెలిసిందే. వైరముత్తు తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ చిన్మయి మీటూ ఉద్యమ సమయంలో బహిరంగంగా ఆరోపించడం సంచలనం సృష్టించింది. తనతో పాటు ఇంకా చాలామంది మహిళలతో వైరముత్తు అసభ్యంగా ప్రవర్తించాడని, వేదింపులకు పాల్పడ్డాడని కూడా ఆరోపించింది. అయితే అంత పెద్ద సీనియర్ లిరిస్టుపై ఆరోపించడంతో ఇండస్ట్రీ చిన్మయిని నిషేధించింది. కోలీవుడ్‌లో పాడే అవకాశాలు ఇవ్వలేదు. పరిశ్రమను వదిలి వెళ్లేంత కుట్ర తనపై జరిగిందని చిన్మయి పదే పదే ఆరోపించింది.
ఇదంతా అందరికీ తెలిసిన పాత కథే అయినా, ప్రతిసారీ ముగిసిపోయిన కథల్ని కెలుకుతూ మీడియా అడిగే ప్రశ్నలకు చిన్మయి సమాధానం ఇవ్వలేని పరిస్థితి తలెత్తుతోందట. తాజాగా మరోసారి వైరముత్తు గురించి చిన్మయిని ఒక విలేకరి ప్రశ్నించాడు. ఆడు జీవితం, అయోతి చిత్రాలు జాతీయ అవార్డులకు ఎంపిక కాకపోవడంపై వైరముత్తు ఘాటైన వ్యాఖ్యలు చేయడం పెద్ద వివాదానికి దారి తీసింది. ఆ తర్వాత మీడియా దీనిపై కథనాలు వేస్తూ, చాలా రచ్చ చేసింది. వైరముత్తుకు శత్రువు అయిన చిన్మయిని కలిసిన తమిళ మీడియా పదే పదే ఈ వివాదం గురించి చిన్మయిని ప్రశ్నించింది. అయితే దీనికి చిన్మయి ఇచ్చిన సమాధానం ఆశ్చర్యపరిచింది.
మీడియా కావాలనే తనను రెచ్చగొడుతోందని, అనవసరంగా తనను వివాదంలోకి లాగుతోందని చిన్మయి ఆవేదన చెందారు. అతడి గురించి తనను ఇలా అగడం అర్థం లేనిదని కూడా వ్యాఖ్యానించారు. పదే పదే అతడి విషయంలో ప్రశ్నించి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని కూడా అన్నారు. ఇప్పటికీ తాను నిషేధానికి సంబంధించిన కేసును ఎదుర్కొంటున్నానని, ఇలాంటి సమయంలో వైరముత్తుపై ఒపీనియన్ కోరడం సరైనది కాదని కూడా చిన్మయి వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ఈ సమాధానం ఇంటర్నెట్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది. మీటూ ఉద్యమంలో వైరముత్తుపై ఆరోపించాక ఈ వివాదంపై పోలీసులు విచారించారు. అదే సమయంలో ఇండస్ట్రీ నుంచి నిషేధానికి గురవ్వగా చిన్మయికి తెలుగు చిత్రపరిశ్రమ అవకాశాలు కల్పించింది. స్నేహితురాలైన సమంత సహా తన భర్త రాహుల్ రవీంద్రన్ తనకు ఆ కష్టసమయంలో అండగా నిలిచారు.