చెన్నై లవ్ స్టోరీ సక్సెస్.. గ్రాండ్ పార్టీ ఇచ్చిన బడా నిర్మాణ సంస్థ!

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియా రంగంలోకి దిగారు.

Update: 2026-07-27 06:17 GMT

బేబీ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న సాయి రాజేష్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇప్పుడు నిర్మాతగా, రచయితగా మారి కథను అందిస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ'. వాస్తవానికి ఈ సినిమాలో బేబీ హీరో, హీరోయిన్ వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ జంటగా నటించాల్సి ఉంది. కానీ సినిమా కథ ఆలస్యం కావడం వల్లే వారు ఈ సినిమా నుండి తప్పుకున్నారు. ప్రస్తుతం ఈ జంట ఎపిక్ సినిమాతో సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియా రంగంలోకి దిగారు. అలా వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన చెన్నై లవ్ స్టోరీస్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ థియేటర్లు దర్శనం ఇస్తుండడంతో.. నిర్మాతలకు లాభాలు పక్కా అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే 10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు పోస్టర్స్ కూడా వెలిశాయి. ఈ చిత్రానికి సాయి రాజేష్ కథను అందించగా.. సీనియర్ స్క్రీన్ ప్లే రైటర్ రవి నంబూరి తొలిసారి దర్శకత్వం వహించారు.

మాస్ మూవీ మేకర్స్ , అమృత ప్రొడక్షన్స్ బ్యానర్ల పై ఎస్ కే ఎన్, సాయి రాజేష్ సంయుక్తంగా నిర్మించారు. రొమాంటిక్ లవ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఒకవైపు ఆడియన్స్ ను నవ్విస్తూనే.. మరొకవైపు ఎమోషనల్ అంశాలతో కట్టిపడేసింది. సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో చిత్రబృందం సినిమా సక్సెస్ ఈవెంట్ నిర్వహించి, ఆడియన్స్ను థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా మరొకవైపు చెన్నై లవ్ స్టోరీ సినిమా గ్రాండ్ గా సక్సెస్ అయిన నేపథ్యంలో గ్రాండ్ పార్టీని ఇచ్చింది బడా నిర్మాణ సంస్థ.

వారు ఎవరో కాదు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పేరు మోసిన నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్. ఈ సంస్థ నిర్మాతలు రవి ఎర్నేని , వై రవిశంకర్ చెన్నై లవ్ స్టోరీ సినిమా సక్సెస్ అందుకున్నందుకుగాను గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో చెన్నై లవ్ స్టోరీ చిత్ర బృందం, హీరో , హీరోయిన్, దర్శకులతోపాటు పలువురు పాల్గొన్నారు . ఇకపోతే ఈ చిత్రంలో సిరి హనుమంతు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

మైత్రి మూవీ మేకర్స్ విషయానికొస్తే.. ఇటీవలే ఉస్తాద్ భగత్ సింగ్, పెద్ది సినిమాలను నిర్మించగా.. ఇప్పుడు హార్రర్ మూవీ 418 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కీర్తన నాడ గౌడ దర్శకత్వంలో మైత్రి మూవీ నిర్మిస్తున్న తొలి హారర్ సినిమా ఇది. జూలై 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది .ఇప్పటివరకు ఎన్నో చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన మైత్రి మూవీ మేకర్స్.. ఇప్పుడు తొలిసారి జానర్ మార్చి హారర్ బ్యాక్ డ్రాప్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ 418 సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News