షాకింగ్: దళపతికే దిక్కులేదు.. అంతా భద్రతా వైఫల్యం!
కోలీవుడ్ అగ్ర నటుడు, దళపతి విజయ్ సినిమాలు వదిలేసి పూర్తిస్థాయి రాజకీయాల్లో ప్రవేశిస్తున్న సంగతి తెలిసిందే.;
కోలీవుడ్ అగ్ర నటుడు, దళపతి విజయ్ సినిమాలు వదిలేసి పూర్తిస్థాయి రాజకీయాల్లో ప్రవేశిస్తున్న సంగతి తెలిసిందే. అతడు సొంత రాజకీయ పార్టీని స్థాపించి ప్రజల్లోకి బలంగా వెళుతున్నాడు. రానున్న ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాడు. నటుడిగా కెరీర్ పీక్స్ లో ఉండగా అతడి నిర్ణయం అభిమానులకు షాకిచ్చింది. ఈ సమయంలో అతడు సినీరంగం విడిచిపెట్టి వెళుతుండటంతో అభిమానుల్లో తీవ్ర భావోద్వేగం నెలకొంది.
విజయ్ నటిస్తున్న చిట్ట చివరి సినిమా `జననాయగన్` ఆడియో వేడుక సాక్షిగా, అతడు తుది వీడ్కోలులో ఎంతో ఎమోషనల్ గా కనిపించాడు. చెన్నై లేదా స్థానికంగా ఎక్కడ వేడుక నిర్వహించినా తొక్కిసలాటకు ఇతర ప్రమాదాలకు ఆస్కారం ఉన్నందున `జననాయగన్` ఆడియోని దేశం కాని దేశం (మలేషియా)లో వేలాది ఫ్యాన్స్ సమక్షంలో నిర్వహించారు. ఈ భారీ కార్యక్రమం కోసం దళపతి ఫ్యాన్స్ చాలా మంది మలేషియాకు వెళ్లారు. దాదాపు 80 వేల మంది ఫ్యాన్స్ హాజరయ్యారని తమిళ మీడియా పేర్కొంది. ఆడియో కార్యక్రమంలో ఫ్యాన్స్ కు పూనకాలు పుట్టుకొచ్చాయి. దళపతి నటనాకెరీర్ కి వీడ్కోలు పలికే స్పీచ్ ముగిశాక, చాలా మంది ఉద్వేగానికి గురయ్యారు. కొందరు ఏడ్చేసారు. కర్ఛీఫ్ లు తడిసిపోయాయి.
అదంతా ఒకెత్తు అనుకుంటే, మలేషియాలో ప్రచార కార్యక్రమం ముగిసిన తర్వాత దళపతి నేరుగా అక్కడి నుంచి చెన్నై విమానాశ్రయంలో అడుగుపెట్టారు. ఇక్కడ సీన్ మరింత భయానకంగా మారింది. విజయ్ ఫ్యాన్స్ చాలా సేపు అతడి రాక కోసం గుంపులు గుంపులుగా ఎదురు చూసారు. విజయ్ చెన్నై విమానాశ్రయానికి చేరుకోగానే ఎదురు చూస్తున్న అభిమానులంతా అతడిని కలిసేందుకు మీదికి ఉరికారు. దీంతో విజయ్ వద్ద ఉన్న భద్రతా సిబ్బంది ఏమీ చేయలేని దుస్థితి నెలకొంది. విమానాశ్రయ సిబ్బంది, విజయ్ వ్యక్తి గత సిబ్బంది ఉన్నా, అతడు కనీసం తన కార్ వద్దకు కూడా జాగ్రత్తగా వెళ్లలేకపోయారు. వాహనం వేచి ఉన్న స్థలం వరకూ చుట్టూ సెక్యూరిటీ అదుపు చేస్తున్నా అభిమానులు ఆగలేదు. అక్కడికి తోసుకుంటూ దూసుకువచ్చారు. ఒకానొక దశలో విజయ్ ని కూడా తోసేసారు. అదుపు చేయలేక భద్రతా సిబ్బంది ఆల్మోస్ట్ చేతులెత్తేశారు. తన కార్ కి అత్యంత సమీపంగా వచ్చేప్పుడు అభిమానుల తోపులాటలో కింద జారి పడ్డారు. ఆ తర్వాత తమాయించుకుని లేచి తన కార్ లో కూచున్నారు. ఆ సమయంలో భద్రతాసిబ్బంది పూర్తిగా విఫలమవ్వడం చూపరులకు ఆగ్రహం కలిగిస్తోంది. అంత పెద్ద స్టార్, రాజకీయ నాయకుడికి ఫ్యాన్స్ నుంచి ఉండే ఒత్తిడి గురించి ముందే తెలిసి కూడా జాగ్రత్తలు తీసుకోకపోవడం ఆశ్చర్యపరిచింది.
చెన్నై విమానాశ్రయంలో విజయ్ కి నిజంగా సవాల్ ఎదురైంది. అంత పెద్ద స్టార్ ఒక్క క్షణంలో అదుపు తప్పి కింద పడ్డారు. దానిని అభిమానులే కాదు చూపరులు జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. మలేషియా లాంటి చోట్ల ఎలాంటి అపశ్రుతి లేకుండా అతిపెద్ద కార్యక్రమాన్ని నిర్వహించి చెన్నైలో అడుగుపెట్టాక, ఇక్కడ అతడు అంత అసౌకర్యంగా ప్రమాదానికి గురవ్వడం నిజంగా ఆక్షేపణీయం.
అదృష్టవశాత్తూ విజయ్ కి ఎలాంటి గాయాలు అవ్వలేదు.. కానీ భద్రతా ఏర్పాట్లలో డొల్లతనం బయటపడటం పెద్ద ఎత్తున చర్చగా మారింది. అతడేమీ సమంత, నిధి అగర్వాల్ కాదు.. ఊకవేస్తే రాలనంత మంది అభిమానులు నిరంతరం అతడి చుట్టూ మూగుతారు. ఈ విషయం ముందే తెలిసీ చెన్నై కి చెందిన అత్యున్నత పోలీస్ శాఖ- ఎయిర్‌పోర్ట్ అథారిటీ జాగ్రత్తలు తీసుకోకపోవడం ఆశ్చర్యపరిచింది. ఈ ఘటన మరో ముఖ్యమైన సందేశాన్ని కూడా ఇచ్చింది. పబ్లిక్ లోకి వచ్చినప్పుడు ఆడా మగా విభేధం లేదు. హీరోయినా లేక హీరోనా? అనేది అభిమానులు చూడరు. అందమైన హీరోయిన్ ని ఒకలా, అభిమాన హీరోని ఇంకొకలా అభిమానులు పబ్లిక్ ఈవెంట్లలో ట్రీట్ చేయరని నిరూపణ అయింది.