ఐతే అనుకోకుండా సాహసం మళ్లీ వచ్చేనా..?

దర్శకుడిగా చంద్రశేఖర్‌ యేలేటి ఐతేతో ఒక ప్రయోగాన్ని చేశాడు. ఆ సినిమాతో ఏకంగా జాతీయ అవార్డ్‌ను సొంతం చేసుకున్నాడు.;

Update: 2026-03-12 06:06 GMT

ఈతరం సినీ ప్రేక్షకులకు దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి గురించి తెలియక పోవచ్చు. కానీ కాస్త ముందు తరం ప్రేక్షకులకు ఆయన తీసిన సినిమాలు చాలా స్పెషల్‌గా నిలిచాయి అనడంలో సందేహం లేదు. ఈయన దర్శకుడిగా మొదటి సినిమా చేసి దాదాపు 23 ఏళ్లు అయింది. ఇప్పటి వరకు ఆయన నుంచి వచ్చిన సినిమాలు ఏడు మాత్రమే. ఏడు సినిమాల్లో అయిదు సినిమాలు చాలా స్పెషల్‌గా ఉంటాయి. అవి కమర్షియల్‌గా ఎంత విజయాన్ని సొంతం చేసుకున్నాయి, ఎన్ని కోట్ల వసూళ్లు నమోదు చేశాయి అనే విషయాన్ని పక్కన పెడితే, ప్రేక్షకులను ఎంత వరకు అలరించాయి, ఎంత వరకు గుర్తుండి పోతాయి అంటే తెలుగు సినిమా చరిత్రలో ఉత్తమమైన సినిమాల జాబితాలో నిలుస్తాయి అనడంలో సందేహం లేదు. దర్శకుడిగా చంద్రశేఖర్‌ యేలేటి ఐతేతో ఒక ప్రయోగాన్ని చేశాడు. ఆ సినిమాతో ఏకంగా జాతీయ అవార్డ్‌ను సొంతం చేసుకున్నాడు.

ఐతే మూవీకి జాతీయ అవార్డ్‌...

ఉత్తమ తెలుగు సినిమాగా జాతీయ అవార్డ్‌ను సొంతం చేసుకున్న ఐతే సినిమా తర్వాత ఆయన నుంచి వచ్చిన మూవీ అనుకోకుండా ఒక రోజు. విభిన్నమైన ఆ కాన్సెప్ట్‌ ఇప్పటికీ ఎంతో మంది ఫిల్మ్‌ మేకర్స్‌కి ఇన్సిపిరేషన్‌ అనడంలో సందేహం లేదు. ఒక్కడున్నాడు, ప్రయాణం, సాహసం సినిమాలు కూడా మనసుకు హత్తుకుంటాయి. ఇలాంటి విభిన్నమైన ఆకట్టుకునే ప్రయోగాత్మక సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి పలు నంది అవార్డ్‌లను సైతం అందుకున్న దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి కమర్షియల్‌గా మాత్రం హిట్‌ కొట్టడంలో విఫలం అయ్యాడు. ముఖ్యంగా ఆయన చివరి రెండు సినిమాలు మనమంతా, చెక్‌ సినిమాలు తీవ్రంగా నిరాశ పరిచాయి. దాంతో ఆయన సినిమాలకు దూరంగా ఉన్నాడు. కొన్ని సినిమాల చర్చల్లో పాల్గొంటున్నారనే సమాచారం ఉంది, కానీ ఆయన సినిమా చేస్తాడనే వార్తలు ఇన్నాళ్లు రాలేదు.

చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో...

ఎట్టకేలకు చంద్రశేఖర్‌ యేలేటి కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఆయన ప్రతిభపై నమ్మకం ఉన్న ఒక నిర్మాత వెళ్లి స్వయంగా అడ్వాన్స్ ఇచ్చి తన బ్యానర్‌లో ఒక సినిమాను చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగిందట. దాంతో ఆ నిర్మాత కోసం దర్శకుడు కథను రెడీ చేసే పని మొదలు పెట్టాడని తెలుస్తోంది. చంద్రశేఖర్‌ యేలేటి ఇప్పటికే తమిళ హీరో ప్రదీప్‌ రంగనాథ్‌ తో సినిమాకు చర్చలు జరుపుతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్తలపై ఎలాంటి క్లారిటీ లేదు. కానీ సినిమా మాత్రం పక్కాగా ఉంటుందని, అది ఏ హీరోతో అనే విషయంలో త్వరలోనే క్లారిటీ వస్తుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆయన దర్శకత్వంలో సినిమా అంటే కచ్చితంగా యంగ్‌ హీరోలు క్యూ కట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

సాహసం, ప్రయాణం వంటి సినిమాలు..

ఈ మధ్య కాలంలో కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ సినిమాలకు మంచి స్పందన లభిస్తోంది. థియేట్రికల్‌ రిలీజ్‌ సమయంలో, ఓటీటీ స్ట్రీమింగ్‌ సమయంలోనూ కాన్సెప్ట్‌ సినిమాలకు మంచి ఆధరణ లభించడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే ఈ సమయంలో చంద్రశేఖర్‌ యేలేటి వంటి సెన్స్‌బుల్‌ కాన్సెప్ట్‌ సినిమాలు తీసే దర్శకుడి నుంచి సినిమా వస్తే తప్పకుండా బ్లాక్ బస్టర్‌ హిట్‌ కావడం ఖాయం అనే నమ్మకంతో సదరు నిర్మాత ఉన్నాడట. అందుకే కాస్త ఎక్కువ అడ్వాన్స్ ఇచ్చి మరీ చంద్రశేఖర్‌ యేలేటితో సినిమాను మొదలు పెట్టించాడని, త్వరలోనే సినిమా పట్టాలెక్కడం, వచ్చే ఏడాదిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం చకచక జరగడం ఖాయంగా టాక్‌ వినిపిస్తోంది.

సెకండ్‌ ఇన్నింగ్స్‌లో అయిన దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి పెద్ద కమర్షియల్‌ విజయాలు సొంతం చేసుకుని, స్టార్‌ హీరోలతో సినిమాలు చేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఎంత వరకు సాధ్యం, మళ్లీ ఐతే, అనుకోకుండా ఒక రోజు, సాహసం, ప్రయాణం వంటి సినిమాలు వచ్చేనా అనేది కాలమే నిర్ణయించాలి.

Tags:    

Similar News