టెలిగ్రామ్ లో 'పైరసీ'.. చెక్ పెట్టేందుకు సర్కార్ రెడీ
కొత్త సినిమా థియేటర్లలోకి రావడం లేట్ కావచ్చు.. కానీ పైరసీ కాపీ మాత్రం ఆన్లైన్ లో వెంటనే వచ్చేస్తుంది.
కొత్త సినిమా థియేటర్లలోకి రావడం లేట్ కావచ్చు.. కానీ పైరసీ కాపీ మాత్రం ఆన్లైన్ లో వెంటనే వచ్చేస్తుంది. ఒకప్పుడు పైరసీ వెబ్ సైట్లకే పరిమితమైన ఆ సమస్య ఇప్పుడు మెసేజింగ్ యాప్ లకూ విస్తరించింది. ముఖ్యంగా టెలిగ్రామ్ లో సినిమాలు, ఓటీటీ కంటెంట్ పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతోందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పైరసీకి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. తాజాగా టెలిగ్రామ్ కు నోటీసులు జారీ చేసింది.
టెలిగ్రామ్ లో జరుగుతున్న కాపీరైట్ ఉల్లంఘనలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్ తో పాటు ఇతర ఆడియో విజువల్ కంటెంట్ స్ప్రెడ్ ను కంట్రోల్ చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారనే విషయంపై 15 రోజుల్లోగా రిపోర్ట్ సమర్పించాలని సూచించింది. అయితే ఇక్కడే అసలు విషయం ఉంది. ఇప్పటివరకు పైరసీ కంటెంట్ పై ఫిర్యాదులు వస్తే సంబంధిత ఛానెల్స్ ను తొలగించే విధానాన్ని టెలిగ్రామ్ ఫాలో అవుతోంది
కానీ ఇకపై ఆ విధానం సరిపోదని కేంద్రం స్పష్టం చేసింది. ఒక్కో ఛానెల్ ను గుర్తించి ఫిర్యాదు చేసే వరకు వేచి ఉండకుండా.. పైరసీ కంటెంట్ ను గుర్తించే సిస్టం ఏర్పాటు చేయాలని సూచించింది. అంటే టెలిగ్రామ్ లోని ఛానెల్స్, గ్రూప్స్, బాట్స్ ద్వారా చట్టవిరుద్ధంగా సినిమాలు, ఓటీటీ కంటెంట్ షేర్ అవుతుంటే.. వాటిని గుర్తించి తొలగించే బాధ్యత ప్లాట్ ఫామ్ తీసుకోవాలన్నది కేంద్రం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. కేవలం ఫిర్యాదు వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడం ద్వారా బాధ్యత పూర్తయినట్లు కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
పైరసీ కంటెంట్ ను షేర్ చేస్తున్న ఛానెల్స్ తోపాటు గ్రూప్స్, బాట్స్, అడ్మిన్స్, సంబంధిత అకౌంట్లపై చర్యలు తీసుకోవాలని సూచించింది. పైరసీని ఒక్కో ఛానెల్ సమస్యగా కాకుండా.. మొత్తాన్ని కంట్రోల్ చేసే సిస్టం తీసుకురావాలని కేంద్రం కోరుతోంది. మరోవైపు నిర్మాతలు, ఓటీటీ ప్లాట్ ఫామ్స్, దర్యాప్తు సంస్థల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఎలాంటి వ్యవస్థను ఏర్పాటు చేశారో తెలియజేయాలని ఆదేశించింది.
ఫిర్యాదులపై ఎంత సమయంలో స్పందిస్తున్నారు? వాటిని పరిష్కరించేందుకు ఎలాంటి టీమ్ ను ఉపయోగిస్తున్నారు? అనే వివరాలను రిపోర్టులో పొందుపరచాలని సూచించినట్లు సమాచారం. చట్టం టెలిగ్రామ్ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని కేంద్రం గుర్తు చేసింది. అంతేకాదు పైరసీ, కాపీరైట్ ఉల్లంఘనలు కొన్ని సందర్భాల్లో క్రిమినల్ నేరాల పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది. ఇప్పటికే 3 వేలకుపైగా పైరసీ ఛానెల్స్ పై చర్యలు తీసుకున్నప్పటికీ.. ఇంకా కంటెంట్ సర్క్యులేట్ అవుతుండటంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఈసారి కేవలం వార్నింగ్స్ తో సరిపెట్టకుండా.. తీసుకున్న చర్యలపై 15 రోజుల్లోగా యాక్షన్ టేకన్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది. పైరసీ కారణంగా ఇండస్ట్రీలో చాలా మంది ఆర్థికంగా నష్టపోతున్నారు. భారీ ఖర్చుతో రూపొందించిన కంటెంట్ గంటల వ్యవధిలోనే ఫ్రీగా ఆన్లైన్ లోకి రావడం పరిశ్రమకు పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో పైరసీని అరికట్టే బాధ్యతను ప్లాట్ ఫామ్ లపై కూడా పెట్టేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది.