జైలులో బంధీగా ఉన్న సోద‌రుడి గురించి న‌టి ఆవేద‌న‌!

బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన సోదరుడు, రిటైర్డ్ మేజర్ విక్రాంత్ కుమార్ జైట్లీని అర‌బిక్ దేశం యుఎఇలో నిర్బంధంలో ఉంచిన సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-11-10 11:30 GMT

బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన సోదరుడు, రిటైర్డ్ మేజర్ విక్రాంత్ కుమార్ జైట్లీని అర‌బిక్ దేశం యుఎఇలో నిర్బంధంలో ఉంచిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంపై చట్టపరమైన సహాయం అందించాలని అధికారులను ఆదేశించిన తర్వాత ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సెలీనా జైట్లీ ప్రశంసించారు. ఈ తీర్పు అనంత‌రం జైట్లీ భావోద్వేగంతో కూడుకున్న నోట్ లో ఇలా పేర్కొన్నారు.

తాను త‌న సోద‌రుడి దుస్థితిని త‌ల‌చుకుని ఏడ్వ‌ని రోజు లేద‌ని సెలీనా జైట్లీ ఈ నోట్ లో రాసారు. సోదరుడు మేజర్ (రిటైర్డ్) విక్రాంత్ కుమార్ జైట్లీతో క‌లిసి ఉన్న ఓ ఫోటోని తన ఇన్‌స్టాలో షేర్ చేసారు. త‌న సోద‌రుడి గురించి భావోద్వేగ నోట్ రాసిన సెలీనా జైట్లీ త‌న సోద‌రుడిని విడిపించేందుకు ఏ ఒక్క అవ‌కాశాన్ని తాను వ‌దులుకోన‌ని అన్నారు. నీకోసం రాయిలా నిల‌బ‌డ‌తాన‌ని నీకు తెలుసు.. నీకోసం ఏడ‌వ‌కుండా ఒక్క రాత్రి కూడా నిదుర‌పోలేద‌ని నీకు తెలుసు. నీకోసం అన్నీ వ‌దులుకుంటాన‌ని నీకు తెలుసు. మ‌న మ‌ధ్య ఎవ‌రూ రాలేర‌ని నీకు తెలుసు.. నేను ఏదీ వ‌ద‌ల‌ను.. నా భాయ్ నీకోసం ఎదురు చూస్తున్నాను...దేవుడు ద‌య చూపిస్తాడు! అని సెలీనా జైట్లీ భావోద్వేగంతో కూడుకున్న నోట్ రాసారు.

సెలీనా ఆవేద‌న‌ను అర్థం చేసుకున్న నెటిజ‌నులు త‌న‌కు మ‌ద్ధ‌తు ప‌లికారు. మీ సోద‌రుడు త్వ‌ర‌గా ఇంటికి చేరుకుంటార‌ని వ్యాఖ్యానిస్తున్నారు. సెలీనా సోద‌రుడు భార‌త‌సైన్యం పారా స్పెష‌ల్ ఫోర్సెస్ లో అనుభ‌జ్ఞుడు. ఏడాది కాలంగా యుఏఇలో నిర్భంధానికి గుర‌య్యాడు. భార‌త సైన్యంలో అత‌డి సాహ‌సానికి `శౌర్య` ప్ర‌శంస ద‌క్కింది. అయితే త‌న సోద‌రుడు చాలా కాలంగా భార‌త‌దేశ సైన్యానికి సేవ‌లందిస్తున్నా, అధికారులు అత‌డి సంక్షేమం విష‌యంలో, చ‌ట్ట‌ప‌ర‌మైన విష‌యాల‌లో స్పష్టమైన సమాచారాన్ని అందించలేకపోయారని సెలీనా జైట్లీ గ‌తంలో ఆవేద‌న వ్య‌క్తం చేసారు.

గత వారం ఢిల్లీ హైకోర్టు మాజీ సైనిక అధికారికి న్యాయ సహాయం అందించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు తీర్పును సెలీనా `ఆశా కిరణం`గా పేర్కొన్నారు. తన‌ సోద‌రుడు, రిటైర్డ్ మేజ‌ర్ విక్రాంత్ కుమార్ జైట్లీకి సంబంధించిన రిట్ పిటిష‌న్ ని కోర్టులో విచారించినందున న్యాయ‌వ్య‌వ‌స్థ‌కు సెలీనా ధ‌న్య‌వాదాలు తెలిపారు. 14 నెల‌ల పోరాటం అనంత‌రం చీక‌టి సొరంగం చివ‌రి అంచుకు చేరుకుంటున్నామ‌ని త‌నలోని ఆవేద‌న‌ను బ‌హిర్గ‌తం చేసారు.

మీరు మాకోసం పోరాడారు భాయ్.. మేం మీ వెన‌క నిల‌బ‌డాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. ఏడాది కాలంగా స‌మాధానాల కోసం వెతుకుతున్నాను. ఇప్పుడు మీకోసం పోరాడాల‌ని, సుర‌క్షితంగా తిరిగి తీసుకురావాల‌ని మ‌న‌ గౌర‌వ‌నీయ ప్ర‌భుత్వాన్ని ప్రార్థిస్తూనే ఉన్నాను... నేను న‌మ్మే ఏకైక సంస్థ భార‌త ప్ర‌భుత్వం. అత‌డు కుటుంబం నుంచి నాలుగోత‌రం సైనికుడు. కొడుకు, మ‌న‌వ‌డు, మునిమ‌న‌వ‌డు.. అంద‌రూ సైనికులే. వారి కోసం ప్ర‌భుత్వం ఏదైనా చేస్తుంద‌ని తెలుసున‌ని భావోద్వేగ పోస్ట్ చేసారు జైట్లీ.

Tags:    

Similar News