ట్రెండీ స్టోరి: సెలబ్రిటీలకు ఈ వేధింపులు తగునా?
ముఖ్యంగా అప్పటికే పెళ్లయి భర్త, పిల్లలు ఉన్న కథానాయికల విషయంలో అభిమానుల వింత ప్రవర్తన ప్రతిసారీ ఆశ్చర్యపరుస్తుంది.;
విడవమంటే పాముకు కోపం.. కరవమంటే కప్పకు కోపం! చొరవ ఇచ్చారు అంటే చంకనెక్కేస్తారు అభిమానులు. అందుకే సెలబ్రిటీలు అంటీ ముట్టనట్టు వ్యవహరించాల్సి ఉంటుంది. సెల్ఫీల పేరుతో మీద చెయ్యేసే దురభిమానులకు కొదవేమీ లేదు. అవకాశం దొరకాలే కానీ, హద్దులు దాటిపోతారు. అందుకే చాలా మంది సెలబ్రిటీలు తమ గోప్యత కోసం చాలా ఆవేదన చెందుతున్నారు. అనవసరంగా మీది మీదికి వచ్చి పడే వీరాభిమానులు లేకపోయినా ఫర్వాలేదు కానీ! అనుకునే పరిస్థితి ఉంది. పబ్లిక్‌లో ఏమీ అనలేని దుస్థితి. సెల్ఫీలు, ఫోటోల కూడా దూసుకొచ్చే వీరాభిమానులను కాదనలేరు. వదిలేస్తే ఫలానా సెలబ్రిటీకి హెడ్ వెయిట్ అంటూ తిట్టేస్తారు గనుక సెలబ్రిటీలు ఇలాంటి పరిస్థితుల్లో మౌనాన్ని ఆశ్రయించాల్సి వస్తోంది.
ముఖ్యంగా అప్పటికే పెళ్లయి భర్త, పిల్లలు ఉన్న కథానాయికల విషయంలో అభిమానుల వింత ప్రవర్తన ప్రతిసారీ ఆశ్చర్యపరుస్తుంది. ముఖ్యంగా పిల్లల గోప్యతకు భంగం కలిగేలా సభ్యత లేని ప్రవర్తన జుగుప్స కలిగిస్తుందని చాలా మంది గతంలో వాపోయారు. అందుకే చాలా మంది సెలబ్రిటీలు తమ పిల్లలు పెరిగి పెద్దవాళ్లయ్యే వరకూ మీడియాకు దూరంగా దాచాలని ప్రయత్నిస్తున్నారు. చాలా మంది స్టార్ కిడ్స్ ముఖాలను నాలుగైదేళ్లు వచ్చే వరకూ కూడా పబ్లిక్ గుర్తించలేని పరిస్థితి ఉంది. దీనికి కారణం మీడియాలకు దూరంగా తమ పిల్లలను ఉంచాలని భావించడమే.
కొన్నేళ్ల క్రితం ఓ మీడియా సమావేశంలో కుమార్తె ఆరాధ్యపై కెమెరా ఫ్లాష్ ల దాడిని తట్టుకోలేకపోయిన ఐశ్వర్యారాయ్ కన్నీటిపర్యంతం అయ్యారు. ఆ క్షణం స్టిల్ ఫోటోగ్రాఫర్లను వారించాలని ఐష్ చాలా ప్రయత్నించినా వారు విడిచిపెట్టలేదు. చిన్నారి ఆరాధ్యపై అపరిమితంగా ఫ్లాష్ లు మెరిపిస్తూనే ఉన్నారు. ఆ సన్నివేశం నిజంగా హృదయాలను ద్రవింపజేసింది. నిజానికి అలాంటి మూర్ఖత్వాన్ని ఎవరూ కోరుకోరు.
ఆలియా భట్ అయినా దీపిక పదుకొనే అయినా తమ కిడ్ గోప్యత కోసం ప్రయత్నించడం సహజం. వారు తమ పిల్లలు కొంత ఎదిగిన తర్వాత మాత్రమే మీడియాకు స్వేచ్ఛనివ్వాలని భావిస్తే అది తప్పు కాదు. అందుకే ఇటీవలి కాలం వరకూ వారు తమ ఎదుగుతున్న కిడ్ విషయంలో గోప్యతను పాటించేందుకు ఇష్టపడ్డారు. ఇప్పుడు ఆలియా- రణబీర్ దంపతుల కుమార్తె రాహా బుడి బుడి అడుగుల వయసుకు వచ్చేసింది. కెమెరాలకు కూడా ఫోజులిచ్చేస్తోంది. అందుకే ఈ దీపావళి రోజున రాహా కపూర్ ముఖారవిందాన్ని స్పష్ఠంగా ప్రదర్శించారు. అలాగే దీపికపదుకొనే- రణవీర్ సింగ్ దంపతులు ఇప్పటివరకూ తమ కుమార్తె దువా సింగ్ ముఖాన్ని ఆవిష్కరించే ఫోటోగ్రాఫ్ లను చూపించలేదు. ఇప్పుడు దువా ముఖంతో పాటు పూర్తి రూపాన్ని బయటపెట్టారు.
ఇద్దరు క్యూట్ కిడ్స్ ఎంతో అందంగా కనిపించారు. దీపావళి పండగను పురస్కరించుకుని సాంప్రదాయ దుస్తుల్లో ఎంతో ముచ్చటగొలిపారు. అయితే ఆ ఇద్దరిలో ఎవరు ఎక్కువ అందగత్తె? అంటూ ఒక సెక్షన్ దురభిమానులు బెట్టింగులకు దిగడం, పోటీపడడం జుగుప్స కలిగించింది. ఇంకా లోకం కన్నెరగని చిన్నారుల విషయంలో ఇలాంటి కాంపిటీషన్లు అవసరమా? ఇది హద్దు దాటడం కాదా? వారు అందంగా ఉన్నారు.. చక్కగా ఉన్నారు. అంతవరకూ ఓకే కానీ, ఆ ఇద్దరినీ పోల్చి చూడాలనుకోవడం అతిగా అనిపించడం లేదా?