ఏడాది నుంచి ఏం చేస్తున్నావ్ బ్రో..!

96 సినిమాను తెలుగులో జానుగా రీమేక్‌ చేశారు. తెలుగు రీమేక్‌కి ఆయనే దర్శకత్వం వహించాడు.;

Update: 2025-05-26 06:34 GMT

ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులు ఉంటారు, వారిలో కొద్ది మంది మాత్రమే మనసుకు హత్తుకునే సినిమాలు చేస్తారు, వారు ఎప్పుడెప్పుడు సినిమాలు చేస్తారా అని ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి దర్శకుల్లో తమిళ దర్శకుడు సి ప్రేమ్‌ కుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. సినిమాటోగ్రాఫర్‌గా సుదీర్ఘ కాలం సినిమాలు చేస్తూ వచ్చిన ప్రేమ్‌ కుమార్‌ దర్శకుడిగా 2018లో '96' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియన్‌ సినిమా చరిత్రలో నిలిచి పోయే విధంగా '96' క్లాసిక్ హిట్‌గా నిలిచింది. 96 పలు భాషల్లో రీమేక్‌ అయ్యి అన్ని చోట్ల హిట్‌గా నిలిచింది.

96 సినిమాను తెలుగులో జానుగా రీమేక్‌ చేశారు. తెలుగు రీమేక్‌కి ఆయనే దర్శకత్వం వహించాడు. 96, జాను తర్వాత చాలా గ్యాప్‌ తీసుకుని మెయియఝగన్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కార్తీ, అరవింద్‌ స్వామి ముఖ్య పాత్రల్లో నటించిన ఆ సినిమా అన్ని భాషల ప్రేక్షకులను మెప్పించింది. ఇతర భాషల్లో కమర్షియల్‌గా విజయాన్ని సొంతం చేసుకోలేక పోయినా మనసుకు నచ్చిన మూవీగా అందరి హృదయాల్లోనూ నిలిచి పోయింది. సున్నితమైన భావోద్వేగాలను అద్భుతంగా చూపించడంలో దర్శకుడు ప్రేమ్‌ కుమార్‌ గొప్ప నిపుణుడు అంటూ ఈ రెండు సినిమాలతో నిరూపితం అయిందని ఆయన్ను అభిమానించే వారు అంటూ ఉంటారు.

మెయియఝగన్‌ సినిమా తెలుగులో సత్యం సుందరంగా డబ్‌ చేశారు. తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి స్పందన దక్కించుకుంది. ఓటీటీలో ఈ సినిమాకు వచ్చిన స్పందన చూసి అంతా షాక్ అయ్యారు. ఇప్పటికీ 96, మెయియఝగన్‌ సినిమాలు సోషల్‌ మీడియాలో షార్ట్‌ వీడియోలుగా, డైలాగ్స్ రూపంలో వైరల్‌ అవుతూనే ఉంటాయి. మెయియఝగన్ సినిమా వచ్చి ఏడాది కాబోతుంది. అయినా ఇప్పటి వరకు దర్శకుడు ప్రేమ్‌ కుమార్‌ తదుపరి సినిమా విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. ఆ మధ్య తమిళ్‌ స్టార్‌ హీరో విక్రమ్‌తో ఒక సినిమాను ప్రేమ్‌ కుమార్‌ చేయబోతున్నాడు అనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఆ విషయం కూడా ఎలాంటి అప్డేట్‌ లేదు.

దర్శకుడిగా ప్రేమ్‌ కుమార్ మొదటి సినిమా 2018లో వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం రెండు సినిమాలను మాత్రమే ఈ దర్శకుడు చేశాడు. మధ్యలో జాను వచ్చినా అది 96 రీమేక్ కావడంతో టెక్నికల్‌గా ఈయన మూడు సినిమాలకు దర్శకత్వం వహించినట్లు లెక్కలు ఉన్నా అసలు ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు కేవలం రెండు. ఆ రెండు సినిమాలకు ఇన్నాళ్ల సమయం తీసుకోవడం విడ్డూరంగా ఉందంటూ ఆయన ఫ్యాన్స్ స్వయంగా కామెంట్స్ చేస్తున్నారు. సినిమాకు సినిమాకు ఇంత గ్యాప్‌ తీసుకుని ఏం చేస్తావు బ్రో అంటూ మీడియా వారు ఆయన్ను కలిసిన సమయంలో అడుగుతూ ఉంటారు. స్క్రిప్ట్‌ వర్క్‌ కోసం కాస్త ఎక్కువ సమయం తీసుకునే ప్రేమ్‌ కుమార్ తదుపరి సినిమాను విక్రమ్‌తో చేస్తే కచ్చితంగా మంచి ఔట్ పుట్‌ వస్తుందని ప్రతి ఒక్కరూ విశ్వాసంతో ఉన్నారు.

Tags:    

Similar News