బుచ్చిబాబు 'పెద్ది'.. అవుట్ పుట్ తో అందరికీ షాక్ ఇవ్వనున్నారా?
మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు బుచ్చిబాబు సనా.. ఇప్పుడు తన రెండో ప్రాజెక్ట్ తో మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు.;
మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు బుచ్చిబాబు సనా.. ఇప్పుడు తన రెండో ప్రాజెక్ట్ తో మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఉప్పెన తర్వాత ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం పెద్ది, టాలీవుడ్ లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటిగా మారింది. ముఖ్యంగా ఆ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తుండటంతో అంచనాలు అమాంతం పెరిగాయి.
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఆ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. అలాగే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనుండగా, విలక్షణ నటుడు జగపతి బాబు డిఫరెంట్ లుక్ లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్సెస్, పాటలు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.
ముఖ్యంగా చరణ్ లుక్స్, మేకింగ్ స్టైల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. దీంతో పెద్ది కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఆ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ విషయంలో మాత్రం అనిశ్చితి నెలకొంది. మొదటగా మార్చి 27న విడుదల చేస్తామని ప్రకటించిన మేకర్స్, ఆ తర్వాత ఏప్రిల్ 30కి వాయిదా వేశారు.
కానీ తాజా సమాచారం ప్రకారం ఆ తేదీకి కూడా సినిమా విడుదల కావడం కష్టమేనని తెలుస్తోంది. దీంతో కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో అన్నదానిపై క్లారిటీ లేకపోవడం అభిమానుల్లో కొంత నిరాశను కలిగిస్తోంది. అదే సమయంలో బుచ్చిబాబు సనాకు పెద్ది ప్రాజెక్ట్ చాలా కీలకంగా మారింది. ఒక్క సినిమా అనుభవంతోనే ఇంత భారీ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేయడం చిన్న విషయం కాదు.
అయితే తనకు వచ్చిన ఆ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుని, అగ్ర దర్శకుల సరసన నిలబడాలనే లక్ష్యంతో ఆయన పని చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా లేట్ అవుతున్నా, క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని వినికిడి. అందుకే పెద్ది ఆలస్యమైనా, అవుట్ పుట్ మాత్రం అదిరిపోయేలా ఉంటుందని, బుచ్చిబాబు తన వర్క్ తో షాక్ ఇవ్వనున్నారని టాక్.
ఏదేమైనా రిలీజ్ డేట్ పై క్లారిటీ రాకపోయినా, సినిమాపై ఉన్న బజ్ మాత్రం తగ్గడం లేదు. అభిమానులు నిరాశపడుతున్నా కూడా.. సినిమా కోసం అంతే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. దీంతో సరైన సమయంలో విడుదలైతే పెద్ది టాలీవుడ్ లో భారీ హిట్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. మరి పెద్ది మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. బుచ్చిబాబుకు ఎలాంటి హిట్ దక్కుతుందో వేచి చూడాలి.