సాహితీ ప్రపంచంలో బుకర్ సమరం!

ప్రపంచ సాహితీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బుకర్ ప్రైజ్ పోటీ తీవ్ర ఉత్కంఠభరితంగా మారింది.

Update: 2026-09-23 12:30 GMT

ప్రపంచ సాహితీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బుకర్ ప్రైజ్ పోటీ తీవ్ర ఉత్కంఠభరితంగా మారింది. గతంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్న ప్రముఖ రచయితలు మార్లన్ జేమ్స్, డౌగ్లస్ స్టువర్ట్ ఇద్దరూ ఈ ఏడాది బుకర్ ప్రైజ్ షార్ట్‌లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు. జడ్జిల బృందం ప్రకటించిన ఆరుగురు ఫైనలిస్టుల జాబితాలో ఇరువురు నిలిచారు. ఇద్ద‌రిలో ఎవరో ఒకరు ఈసారి విజేతగా నిలిస్తే బుకర్ ప్రైజ్‌ను రెండుసార్లు గెలుచుకున్న ఐదో రచయితగా చరిత్ర సృష్టిస్తారు.

మాజీ విజేత మార్లన్ జేమ్స్ 2015లో `ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ సెవెన్ కిల్లింగ్స్` నవలకు గాను బుకర్ ప్రైజ్ సాధించారు. ప్రస్తుతం ఆయన రాసిన `ది డిసప్పియరర్స్` నవల ఈ రేసులో ఉంది. అలాగే 2020లో `షగ్గీ బైన్` నవలకు ఈ పురస్కారం పొందిన డౌగ్లస్ స్టువర్ట్ తాజాగా `జాన్ ఆఫ్ జాన్` కథతో షార్ట్‌లిస్ట్‌లో నిలిచారు. ఒకవేళ వీరు ఈసారి విజయం సాధిస్తే.. ఇప్పటివరకు రెండుసార్లు బుకర్ సాధించిన జె.ఎమ్. కోయెట్జీ, పీటర్ కారీ, హిలరీ మాంటెల్, మార్గరెట్ అట్వుడ్‌ల సరసన నిలుస్తారు.

మొత్తం163 నామినేషన్ల నుంచి జులైలో 13 నవలలతో సెమీఫైనల్ జాబితాను రూపొందించగా, అందులోంచి అత్యుత్తమ ఆరు నవలలను ఆఖరి రేసులోకి ఎంపిక చేశారు. ఆంగ్ల భాషలో రాయబడి బ్రిటన్ లేదా ఐర్లాండ్‌లో ప్రచురితమైన సుదీర్ఘ నవలలకు ఈ పురస్కారాన్ని అందజేస్తారు. ఈ విడత ఎంపిక చేసిన నవలలు హాస్యం, ఉత్కంఠ, భయం, ఆశలు , బలమైన భావోద్వేగాల సమాహారంగా ఉన్నాయని జడ్జిల బృందం తెలిపింది. ఈ అవార్డు విజేతకు 50,000 పౌండ్ల (సుమారు రూ. 55 లక్షలకు పైగా) నగదు బహుమతి లభిస్తుంది.

ఈ షార్ట్‌లిస్ట్‌లో ఇతర ప్రముఖ రచయితలు కూడా గట్టి పోటీనిస్తున్నారు. పులిట్జర్ పురస్కార గ్రహీత ఎలిజబెత్ స్ట్రౌట్ రాసిన `ది థింగ్స్ వి నెవర్ సే`, బ్రిటీష్ రచయిత్రి రెబెక్కా పెర్రీ రాసిన `మే వి ఫీడ్ ది కింగ్`, ల్యూక్ కేనర్డ్ నవల `బ్లాక్ బ్యాగ్'లు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. వీటితో పాటు 81 ఏళ్ల వయోవృద్ధ రచయిత ఎమ్. జాన్ హ్యారిసన్ రాసిన `ది ఎండ్ ఆఫ్ ఎవిరీథింగ్` నవల కూడా ఎంపికైంది. ఒకవేళ హ్యారిసన్ విజేతగా నిలిస్తే బుకర్ ప్రైజ్ పొందిన అత్యంత వృద్ధుడిగా నూతన రికార్డు నెలకొల్పుతారు.

ఈసారి ఎంపిక ప్రక్రియ ఎంతో ఉత్కంఠభరితంగా సాగిందని జడ్జిల బృందం అధ్యక్షురాలు, ప్రముఖ చరిత్రకారిణి మేరీ బియర్డ్ వెల్లడించారు. ఈ నవలలను పదేపదే చదవడం వల్ల అవి తమకు పాత మిత్రులైపోయాయని, కొన్ని పుస్తకాలను షార్ట్‌లిస్ట్ నుంచి తప్పించడం ఎంతో బాధ కలిగించిందని పేర్కొన్నారు. ఈ నవలలు పాఠకుల్లో సరికొత్త ఆలోచనలను, ఆసక్తికరమైన చర్చలను రేకెత్తిస్తాయని, ప్రతి పుస్తకంలోనూ విభిన్నమైన శైలి, వైవిధ్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని కొనియాడారు.

1969లో ప్రారంభమైన బుకర్ ప్రైజ్ ప్రపంచ సాహితీ రంగంలో రచయితల కెరీర్‌ను మలుపు తిప్పే అత్యున్నత పురస్కారంగా గుర్తింపు పొందింది. గత ఏడాది హంగేరియన్-బ్రిటిష్ రచయిత డేవిడ్ స్జాలాయ్ రాసిన `ఫ్లెష్` నవలకు ఈ పురస్కారం దక్కింది. అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ఆసక్తి రేపుతున్న బుకర్ ప్రైజ్ విజేత ఎవరవుతారనేది సాహితీ ప్రియుల్లో ఉత్కంఠ‌గా మారింది.

Tags:    

Similar News