హీరోయిన్ రిచా చద్దా కెరీర్ బ్రేక్ వెనుక అసలు నిజం!
బాలీవుడ్ నటి రిచా చద్దా వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.
బాలీవుడ్ నటి రిచా చద్దా వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన `హీరామండి` సిరీస్ తో అలరించిన భామ ఆ తర్వాత కొంతకాలంగా నటనకు దూరంగా కెమెరా వెనుక పరిమితమయ్యారు. అయితే ఎందుకు? వెండితెరకు తాత్కాలికంగా విరామం ఇవ్వాల్సి వచ్చిందనే అంశంపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రిచా రివీల్ చేసారు. ప్రసవ సమయంలో ఎదురైన తీవ్రమైన శారీరక సమస్యల వల్లే నటనకు దూరంగా ఉండాల్సి వచ్చిందని వెల్లడించారు.
నటుడు అలీ ఫజల్‌ను వివాహం చేసుకున్న రిచా చద్దా 2024 జులై లో పండంటి ఆడపాపకు జన్మనిచ్చారు. ఈ సంతోషకరమైన క్షణాల వెనుక తాను ఎంతో కష్టమైన శారీరక ప్రయాణాన్ని సాగించానని తెలిపారు. సహజ ప్రసవం జరిగిన సమయంలో అత్యధికంగా రక్తస్రావం జరిగిందని..దీంతో శరీరం తీవ్రంగా బలహీనపడిందని పేర్కొన్నారు. ప్రసవానంతరం సంభవించిన రక్తం నష్టం తో చాలా కాలం పాటు బ్రైన్ ఫాగ్ (మానసిక మందగమనం), తీవ్రమైన శక్తిహీనతతో బాధపడ్డానని.. ఆరోగ్యపరంగా కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని తెలిపారు.
ఒకవైపు మాతృత్వపు బాధ్యతలు, మరోవైపు తీవ్రమైన శారీరక క్షీణత, ఒత్తిడి కూడా విరామానికి కారణమైందన్నారు. తాను - అలీ ఫజల్ సంయుక్తంగా నిర్మించిన `గర్ల్స్ విల్ బి గర్ల్స్` చిత్రం విడుదల సన్నాహాలు, విభిన్న డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లతో ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి పనులన్నీ ప్రసవం జరిగిన కొన్ని నెలల వ్యవధిలోనే జరిగాయన్నారు. ఈ మల్టీ టాస్కింగ్ బాధ్యతలతో శరీరంపై తీవ్ర ప్రభావం పడిందని, శారీరకంగా , మానసికంగా విశ్రాంతి తీసుకోవడం అత్యవసరంగా మారిందన్నారు.
వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటూ విటమిన్లు, పోషకాహారంతో శరీరాన్ని మళ్లీ పునర్నిర్మించుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చానన్నారు. ఆ సమయాన్ని విశ్రాంతికే పరిమితం చేయకుండా కుమార్తె పెంపకాన్ని దగ్గరుండి చూసుకుంటూనే వెనుక ఉండి సృజనాత్మక పనులను పూర్తి చేశారు. మాతృత్వపు అనుభవాల నేపథ్యంలో `ముసాఫిరి` అనే నాన్-ఫిక్షన్ సిరీస్‌ను క్రియేట్ చేసి, స్క్రిప్ట్ రాసి, హోస్ట్ చేయడం వరకు అన్ని బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు.
మాతృత్వంలోకి అడుగుపెట్టిన తర్వాత ప్రపంచాన్ని చూసే తన దృక్పథం పూర్తిగా మారిపోయిందని రిచా వ్యాఖ్యానించారు. నేటి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరగడం, వాతావరణ మార్పులు (క్లైమేట్ చేంజ్) వంటి సవాళ్ల మధ్య కుమార్తె ఎలాంటి ప్రపంచంలో ఎదుగుతుందో అనే ఆలోచనలు మనసులో రేకెత్తాయని పేర్కొన్నారు. పిల్లలకు భయం లేని స్వేచ్ఛా జీవితాన్ని, స్వతంత్ర ఆలోచనా ధోరణిని అలవాటు చేయడం ఎంత ముఖ్యమో తల్లిగా తాను తెలుసుకున్నానన్నారు.
ప్రస్తుతం శారీరకంగా, మానసికంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న రిచా చద్దా మళ్లీ కెమెరా ముందుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఓటీటీ ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు త్వరలోనే ఓ కొత్త సినిమా షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. నటనలో మరింత మెరుగైన, సవాలుతో కూడిన పాత్రలను ఎంచుకుంటూ కొత్త ఉత్సాహంతో ప్రేక్షకుల ముందుకు రానున్నానని తెలిపారు.