అఫైర్ రూమర్స్ వేళ గణనాథుడి సన్నిధిలో గోవిందా!

బాలీవుడ్ నటుడు గోవిందా ముంబైలోని ప్రసిద్ధ లాల్‌బాగ్చా రాజా గణపతి మండపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Update: 2026-09-23 12:06 GMT

బాలీవుడ్ నటుడు గోవిందా ముంబైలోని ప్రసిద్ధ లాల్‌బాగ్చా రాజా గణపతి మండపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేష్ చతుర్థి వేడుకల్లో భాగంగా బప్పా ఆశీస్సులు పొందేందుకు వచ్చిన ఆయన చివరి హారతి వేడుకలో కూడా పాల్గొన్నారు. అయితే ఈ పర్యటనలో గోవింద‌ భార్య సునీతా అహుజాతో కాకుండా, తన రాబోయే చిత్రం `రూపా` కో-స్టార్ కోమల్ రాణి స్వర్ణకార్‌తో కలిసి రావడం చర్చనీయాంశంగా మారింది.

గోవిందా రాకకు కొన్ని గంటల ముందే సునీతా అహుజా ఒంటరిగా లాల్‌బాగ్చా రాజాను దర్శించుకుని పూజలు చేశారు. మధ్యాహ్నం సునీత ఒంటరిగా వచ్చి వెళ్లగా ఆ తర్వాత సాయంత్రం వేళ గోవిందా సహ నటి కోమల్ రాణితో కలిసి రావడం భక్తులను, మీడియా ప్రతినిధులను ఆశ్చర్యపరిచింది. భార్యాభర్తలిద్దరూ ఒకే రోజు వేర్వేరు సమయాల్లో దర్శనానికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ దర్శన సమయానికి గోవిందా సాంప్రదాయ తెల్లని కుర్తా-పైజామా ధరించగా, కోమల్ రాణి ఎరుపు, పసుపు రంగుల చీరలో సాంప్రదాయ ఆభరణాలతో కనిపించారు. పండల్‌కు చేరుకోగానే గణపతి బప్పా మోరియా అని నినాదాలు చేస్తూ అభిమానులకు అభివాదం చేశారు. పూజారి వారికి తిలకం దిద్ది పూజలు నిర్వహించగా, ఆ రోజు చివరి ఆరతిలో ఇద్దరూ పాల్గొని భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు.

గోవిందా-సునీతల వైవాహిక జీవితంలో విభేదాలు న‌డుస్తోన్న స‌మ‌యంలో? ఈ పర్యటన జరగడం విశేషం. ఇటీవల సునీతా అహుజా ఓ ఇంటర్వ్యూలో తమ కుమార్తె వయసున్న కోమల్ రాణితో గోవిందాకు సంబంధం ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. దాదాపు 39 ఏళ్ల సుదీర్ఘ దాంపత్య బంధంలో అలజడులు రేగుతున్నాయనే పుకార్లకు ఈ వివాదం మరింత బలాన్ని చేకూర్చింది.

అయితే ఈ ఆరోపణలపై గోవిందా తీవ్రంగా స్పందించారు. తనపై వస్తున్న అఫైర్ వార్తలను ఖండిస్తూ తన భార్య సునీత పాడ్‌కాస్ట్‌లు, మీడియా వేదికగా ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయవద్దని పరిమితుల్లో ఉండాలని సూచించారు. కోమల్ రాణి కేవలం తన రీ-ఎంట్రీ చిత్రం `రూపా`లో నటిస్తున్న సహ నటి మాత్రమేనని వారి మధ్య ఎలాంటి ఇతర అనుబంధం లేదన్నారు.

ఈ నేప‌థ్యంలో లాల్‌బాగ్చా రాజా మండపంలో గోవిందా, కోమల్ రాణి కలిసి పూజలు చేసిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వ్యక్తిగత జీవితంలో వివాదాలు నడుస్తున్నప్పటికీ గోవిందా `రూపా` సినిమాతో కమ్‌బ్యాక్ కోసం సిద్ధమవుతున్నారు. ఈ పర్యటన బాలీవుడ్ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ ఆసక్తికరమైన చర్చకు దారితీసింది.

Tags:    

Similar News