ఆ హీరోతో అంతా న‌ష్ట‌మే..కానీ నిర్మాత‌లు అత‌ని వెంటే!

ప్లాప్ అవుతున్నా? అత‌డికి బాలీవుడ్ లో అవ‌కాశాలు మాత్రం త‌గ్గ‌లేద‌న్న‌ది అంతే వాస్త‌వం. ప్ర‌స్తుతం 2024 క్యాలెండర్ చూసినా ఏ హీరో లేనంత బిజీగా అక్ష‌య్ కుమార్ క‌నిపిస్తున్నాడు.

Update: 2024-04-27 07:31 GMT

కిలాడీ అక్ష‌య్ కుమార్ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి ఫ‌లితాలు సాధిస్తున్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు. 'ఓమైగాడ్-2' కి ముందు వ‌రుస‌గా ఏడు సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఆ తర్వాత మ‌రో రెండు చిత్రాలు కూడా అదే రికార్డును న‌మోదు చేసాయి. వ‌రుస‌గా ఇన్ని ప‌రాజ‌యాలు అక్ష‌య్ కెరీర్ లో ఇంత‌వ‌రకూ చోటు చేసుకోలేదు. దీంతో తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. చివ‌రికి ఒకానొక ద‌శ‌లో త‌నపై వ‌స్తోన్న విమ‌ర్శ‌ల‌పై అక్ష‌య్ వాపోయిన వైనం మీడియాలో వైర‌ల్ అయింది.

 

సినిమాలు ఎందుకు ప్లాప్ అవుతున్నాయో త‌న‌కే అర్దం కాలేదని.. కావాల‌ని ఏ హీరో అయినా ప్లాప్ కంటెంట్ ని ఎంచుకుంటాడా? అని కిలాడీ స్పందించిన వైనం అభిమానుల్ని ఎంతో క‌ల‌వ‌ర పెట్టింది. అయినా వాటితో సంబంధం లేకుండా స‌క్సెస్ కోసం అక్ష‌య్ వ‌రుస‌గా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ప్లాప్ అవుతున్నా? అత‌డికి బాలీవుడ్ లో అవ‌కాశాలు మాత్రం త‌గ్గ‌లేద‌న్న‌ది అంతే వాస్త‌వం. ప్ర‌స్తుతం 2024 క్యాలెండర్ చూసినా ఏ హీరో లేనంత బిజీగా అక్ష‌య్ కుమార్ క‌నిపిస్తున్నాడు.

ఆయ‌నిప్పుడు హీరోగా ఏడెనిమిది సినిమాలు చేస్తున్నాడు. మంచు విష్ణు పాన్ ఇండియా చిత్రం 'క‌న్న‌ప్ప‌'లోనూ న‌టిస్తున్నాడు. అవ‌న్నీ ఆన్ సెట్స్ లోనే ఉన్నాయి. మ‌రి ఇన్ని వైఫ‌ల్యాలున్నా? అక్ష‌య్ కుమార్ కి అవ‌కాశాలు ఎలా సాధ్య‌మ‌వుతున్నాయి? అన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ద‌ర్శ‌క‌-నిర్మాతలంతా అత‌ని వైఫ‌ల్యాల‌తో సంబంధం లేకుండా అత‌నితోనే సినిమాలు చేస్తామ‌ని ముందుకెళ్ల‌డం చూస్తుంటే షాక్ అవ్వాల్సిందే.

సాధార‌ణంగా వ‌రుస‌గా రెండు...మూడు ప్లాప్ లు ఎదురైతే హీరో మార్కెట్ డౌన్ అవుతుంది. కానీ ప‌ది ప్లాప్ లు ఎదురైనా అక్ష‌య్ మార్కెట్ మాత్రం అలాగే కొన‌సాగుతుంది. ఓపెనింగ్స్ తో సంబంధం లేకుండా...ఫైన‌ల్ వ‌సూళ్ల‌తో లెక్క లేకుండా ద‌ర్శ‌క‌-నిర్మాత‌లంతా ముందుగా అక్ష‌య్ ఇంటి త‌లుపే త‌ట్ట‌డం విశేషం. బాలీవుడ్ లో ఇలా ఏ హీరోకి సాధ్యం కాలేద‌నే చెప్పాలి. మ‌రి ఆ సీక్రెట్ ఏంటో కిలాడీకే తెలియాలి.

Tags:    

Similar News