కాలుష్యంపై అవగాహన.. టాలీవుడ్ తారలు పూనుకోవాలి!
| ఎర్త్‌షాట్ ప్రైజ్ 2026 వేడుకలో సోనమ్ కపూర్ సహా పలువురు బాలీవుడ్ తారలు నగరాల్లో పెరుగుతున్న కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, చెట్ల నరికివేత, విచ్చలవిడి నిర్మాణాలను అరికట్టడం వంటి చర్యలు అవసరమని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు టాలీవుడ్ సహా దక్షిణాది తారలు కూడా గొంతెత్తాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఓవైపు ఎల్.నినో కారణంగా భూతాపం పెరుగుతోంది. అకాల వర్షాలు లేదా అసాధారణమైన వేడి వాతావరణం ఊపిరాడనివ్వడం లేదు. ప్రజలు కరువు కష్టాలతో తీవ్ర భయానక పరిస్థితులను ఎదుర్కొంటారనే ముందస్తు అంచనాలు వెలువడ్డాయి. అమెజాన్ అడవులు సహా భారీగా వేలాది ఎకరాలలో అడవులు తగలబడిన పర్యవసానం మంచు పర్వతాలు కరిగిపోయి సరస్సులు నగరాలపై పడి ఎలాంటి విధ్వంశాలకు పాల్పడుతున్నాయో చూస్తునే ఉంది మానవాళి.
ఇలాంటి పరిస్థితుల్లో పర్యావరణ కాలుష్యాన్ని నివారించకపోతే పెను ముప్పు పొంచి ఉందనే సంచలన రిపోర్టులు అందుతున్నాయి. ఎక్కడికక్కడ నగరాల్లో పేరుకుపోయిన కాలుష్యంపైనా తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. దిల్లీ, ముంబై, హైదరాబాద్ సహా చాలా చోట్ల కాలుష్యం కోరలు చాచి భయపెడుతోంది.
ఇలాంటి సమయంలో నగరాలు పర్యావరణ కాలుష్య ముప్పు నుంచి బయటపడాలంటే.. ఏం చేయాలో స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ సహా పలువురు హిందీ తారల గ్రేట్ ఇనిషియేషన్ చర్చనీయాంశంగా మారింది. మరికాస్త వివరాల్లోకి వెళితే ..ప్రిన్స్ విలియం స్థాపించిన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పర్యావరణ అవార్డుల వేడుక `ఎర్త్‌షాట్ ప్రైజ్ 2026` ముంబైలో తొలిసారిగా ఘనంగా జరిగింది. ప్రకృతి పరిరక్షణ.. స్వచ్ఛమైన గాలి.. సముద్రాల పునరుద్ధరణ.. వ్యర్థ రహిత ప్రపంచం.. వాతావరణ మార్పుల నియంత్రణ అనే ఐదు విభాగాల్లో ఒక్కో విజేతకు 1 మిలియన్ పౌండ్ల బహుమతి అందించే ఈ వేడుకకు సోనమ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీలలో పెరుగుతున్న కాలుష్యంపై వారంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ మాట్లాడుతూ.. ముంబై, ఢిల్లీ నగరాల్లో పెరుగుతున్న కాలుష్య స్థాయిలను చూస్తుంటే ఎంతో భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న ఇలాంటి కార్యక్రమాలకు తన పూర్తి మద్దతు ఉంటుందని ఆమె తెలిపారు. ప్రస్తుత పరిస్థితులు చాలా భయానకంగా ఉన్నాయి. నా పిల్లల వైపు చూసినప్పుడల్లా.. వారికి మనం ఎలాంటి భవిష్యత్తును అందిస్తున్నామో తలచుకుంటే వణుకు పుడుతోంది. ముంబై అయినా.. ఢిల్లీ అయినా కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది.. ఈ సమస్యను ప్రతి ఒక్కరూ సీరియస్‌గా తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది! అని సోనమ్ పేర్కొన్నారు.
ఇక ఆస్కార్ విజేత గునీత్ మోంగా.. నటి నిమ్రత్ కౌర్ కూడా వాతావరణ మార్పులపై కీలక సూచనలు చేశారు. వాతావరణ మార్పు అనేది ఒక వాస్తవ సమస్య అని పేర్కొన్న గునీత్ మోంగా..తాను ప్లాస్టిక్ బాటిల్స్ వాడనని.. కేవలం మెటల్ లేదా గ్లాస్ బాటిల్స్ మాత్రమే రీయూజ్ చేస్తానని చెప్పారు. తాను ఆస్కార్ వేడుకకు ధరించిన చీరను కూడా మళ్లీ రీపర్పస్ చేసి వాడుతున్నానని.. పర్యావరణ పరిరక్షణ మన ఇంటి నుంచే మొదలవ్వాలని పిలుపునిచ్చారు. అలాగే.. పర్యావరణాన్ని కాపాడుకోవడం ఎవరి బాధ్యతో కాదని, మన పరిసరాల్లో చెత్త వేయకుండా.. నీటిని కలుషితం చేయకుండా ప్రతి పౌరుడు వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని నిమ్రత్ కౌర్ కోరారు.
ఈ వేడుకలో నటి సయానీ గుప్తా మాట్లాడుతూ ముంబైలో సాగుతున్న విచ్చలవిడి నిర్మాణాలు..చెట్ల నరికివేత.. మడ అడవుల విధ్వంసంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రిన్స్ విలియం చేపట్టిన ఈ అవార్డుల కార్యక్రమం అభినందనీయమే అయినా దేశంలో క్షేత్రస్థాయిలో మరిన్ని కఠిన చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. ``ముంబై ఒక సిమెంట్ కుప్పలా మారిపోయింది. మనం అసలు శ్వాస తీసుకోలేకపోతున్నాం.. కేవలం సిమెంట్ పీలుస్తున్నాం.. సిమెంట్ తింటున్నాం. డబ్బుపై ఉన్న అత్యాశతో చెట్లు, అడవులను నాశనం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం పిచ్చితనం.. దీనికి తక్షణమే అడ్డుకట్ట వేయాలి`` అని సయానీ ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఇది కేవలం ముంబై, దిల్లీలకే పరిమితమైన సమస్య కాదు. ప్రతి నగరాన్ని కాలుష్యం కోరలు చాచి మింగేస్తోంది. హైదరాబాద్ నుంచి ఉత్తరాంధ్ర వరకూ రసాయన కర్మాగారాల కాలుష్యం నుంచి వాయు, జల కాలుష్యాలు వెంటాడుతున్నాయి. వాతావరణంలో ఆక్సిజన్ శాతం దారుణంగా పడిపోతోందని సర్వేలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్ సహా దక్షిణాది సినీపరిశ్రమల తారలు కూడా పర్యావరణాన్ని కాపాడుకోవడానికి గొంతెత్తాల్సిన సమయం ఆసన్నమైంది.