ఈ సిద్దార్థ్ వివాదాలు హద్దు మీరుతున్నాయి ..!
బాలీవుడ్‌లో పీఆర్ వ్యవస్థ ఎక్కువ అయింది. చిన్న స్టార్స్ నుంచి పెద్ద స్టార్స్ వరకు ఏదో ఒక రకంగా పీఆర్ చేయించుకోవడం కామన్ అయింది.;
బాలీవుడ్‌లో పీఆర్ వ్యవస్థ ఎక్కువ అయింది. చిన్న స్టార్స్ నుంచి పెద్ద స్టార్స్ వరకు ఏదో ఒక రకంగా పీఆర్ చేయించుకోవడం కామన్ అయింది. ఒకప్పుడు కేవలం సినిమాలకు మాత్రమే పీఆర్ చేసే వారు. కానీ ఇప్పుడు వ్యక్తిగత పీఆర్ ఎక్కువ అయింది. ఒక హీరో లేదా హీరోయిన్ గురించి పబ్లిసిటీ చేస్తూ వారికి పాజిటివ్‌గా ప్రచారం చేస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ కొందరు పనిగట్టుకుని మరొకరిని తగ్గించడం, విమర్శించడం చేస్తున్నారు. ఒక హీరోయిన్ పీఆర్ టీం మరో హీరోయిన్‌ను టార్గెట్ చేయడం, ఆమెకు రావాల్సిన ఆఫర్లను తగ్గించడం వంటివి చేస్తున్నారు. ఇటీవల ఈ విషయం గురించి బాలీవుడ్‌లో ప్రముఖంగా చర్చ జరిగింది. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ పేర్లు చెప్పకుండా ఒక హీరోయిన్ పీఆర్ టీం మరో హీరోయిన్‌ను డీ గ్రేట్ చేస్తుందని ఆరోపించిన విషయం తెల్సిందే.
ఇంటర్వ్యూల్లో వివాదాస్పద ప్రశ్నలు
సెలబ్రిటీలను విమర్శించడం ద్వారా పాపులారిటీని దక్కించుకోవాలి అనుకునే వారు ఈ మధ్య కాలంలో ఎక్కువ అయ్యారు. ఒకప్పుడు సెలబ్రిటీ ఇంటర్వ్యూలు అంటే చాలా సింపుల్‌గా ఉండేవి, వారి వ్యక్తిగత జీవితం, వారు చేస్తున్న సినిమాలు, చేసిన సినిమాలు, చేయబోతున్న సినిమాల గురించి మాత్రమే ప్రశ్నలు అడిగేవారు. కానీ ఆ ఇంటర్వ్యూలో వివాదాస్పదం కావాలనే ఉద్దేశంతో తమ ముందున్న సెలబ్రిటీని మరో సెలబ్రిటీ గురించి ప్రశ్నలు సంధించడం ద్వారా ఏదో ఒక సమయంలో దొరికి పోతున్నారు. కొందరు ఇతర సెలబ్రిటీల గురించి స్పందించేందుకు సున్నితంగా తిరస్కరిస్తూ ఉంటే కొందరు మాత్రం పొరపాటున ఏదో ఒక కామెంట్ చేయడంతో దొరికి పోతూ వివాదాస్పదం అవుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటివి తెలుగు ఇంటర్వ్యూలు, పాడ్ కాస్ట్‌ల్లోనూ ఎక్కువగా కనిపిస్తున్న విషయం తెల్సిందే.
రాజీవ్ రాయ్‌తో సిద్దార్థ్ కన్నన్ పాడ్ కాస్ట్
బాలీవుడ్ సెలబ్రిటీలతో ఎక్కువ పాడ్ కాస్ట్‌లు చేస్తూ పాపులర్ అయిన సిద్దార్థ్ కన్నన్ ఈ మధ్య కాలంలో ప్రతీది వివాదాస్పదం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రతి పాడ్ కాస్ట్ వైరల్ కావాలనే ఉద్దేశంతో ఏదో ఒక వివాదాస్పద అంశాన్ని ఎంపిక చేసుకుంటున్నాడు. బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, ఆలియా భట్ వంటి స్టార్స్‌తో పాడ్ కాస్ట్ చేసిన సిద్దార్థ్ కన్నన్ బాలీవుడ్‌లో మోస్ట్ పాపులర్ పాడ్ కాస్ట్ హోస్ట్‌గా పేరు సొంతం చేసుకున్నాడు. అందుకే ఆయన పాడ్ కాస్ట్‌లకు మంచి స్పందన దక్కుతుంది. అయితే ఆయన మరింత పాపులారిటీ కోసం వివాదాస్పద అంశాలను తీసుకు వస్తున్నాడు. ఇటీవల ఈయన ప్రముఖ సీనియర్ ఫిల్మ్ మేకర్ రాజీవ్ రాయ్ తో పాడ్ కాస్ట్ చేశాడు. ఆ పాడ్ కాస్ట్ ఏకంగా పావు తక్కువ మూడు గంటల పాటు సాగింది. యూట్యూబ్‌లో ప్రస్తుతం ఈ పాడ్ కాస్ట్ వీడియో బైట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.
అక్షయ్ కుమార్ పై విమర్శలు
ఈ పాడ్ కాస్ట్‌లో అక్షయ్ కుమార్‌ను కార్నర్ చేసే విధంగా సిద్దార్థ్ కన్నన్ ప్రయత్నించాడు. అక్షయ్ కుమార్ 1990, 2000 సమయంలో సహ నటుల సన్నివేశాలను ట్రిమ్ చేయమని అడిగేవాడని, ఇతర నటీనటులకు ఎక్కువ ప్రాముఖ్యత ఉండకూడదని ఎడిట్ చేయించేవాడని అంటారు. అందులో ఎంత వరకు నిజం ఉందని అక్షయ్ కుమార్‌తో మోహ్రా వంటి సూపర్ హిట్ సినిమాను తీసిన రాజీవ్ రాయ్‌ను ప్రశ్నించాడు. అందుకు రాజీవ్ రాయ్ స్పందిస్తూ అక్షయ్ కుమార్ గురించి జరుగుతున్న ఆ ప్రచారం నిజం కాదని చెప్పుకొచ్చాడు. ఆ విషయంలో అక్షయ్ కుమార్ వైపు రాజీవ్ రాయ్ నిలబడ్డాడు. అదే సమయంలో అక్షయ్ కుమార్ పారితోషికం విషయంలో రాజీవ్ రాయ్ విమర్శలు చేసే విధంగా సిద్దార్థ్ కన్నన్ ప్రశ్నలు వేశాడు.
మొత్తానికి సిద్దార్థ్ కన్నన్ తన ప్రతి పాడ్ కాస్ట్ కి హైప్ తీసుకు రావడం కోసం వివాదాస్పద విషయాలను లాగేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. అందులో భాగంగానే అక్షయ్ కుమార్ విషయాన్ని ప్రస్థావించాడు అంటూ సోషల్ మీడియాలో కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు అభిప్రాయాలు, ఉద్దేశాలు ఉన్న హోస్ట్‌లకు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని కొందరు అంటున్నారు. కావాలని వివాదాలను క్రియేట్ చేసే ఇలాంటి వ్యక్తి ఇండస్ట్రీకి మంచిది కాదంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ పాడ్ కాస్ట్ హోస్ట్ సిద్దార్థ్ కన్నన్ వీడియోలు హద్దు మీరుతున్నాయని ఇండస్ట్రీలో పలువురు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. మరి ఇప్పటికి అయినా ఈ హోస్ట్ తన హద్దుల్లో ఉంటాడా అనేది చూడాలి.