ఖాన్‌ల త్రయానికి ధీటుగా ఎవరొస్తారు?
అయితే ఖాన్‌లకు ధీటుగా రాణించే సత్తా ఉన్న స్టార్లు టాలీవుడ్ నుంచి ఉన్నారా? సుదీర్ఘ కాలం ఖాన్‌ల రేంజులో స్థిరమైన నమ్మకమైన మార్కెట్ ని అందించగలరా?;
దశాబ్ధాలుగా ఖాన్‌లు తమ ఉనికిని చాటుకుంటూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ముగ్గురు ఖాన్ లు షష్ఠిపూర్తి దశను అధిగమించారు. 60 ప్లస్ వయసులోను ఇంకా ఖాన్‌లు మునుపటిలానే హవా సాగిస్తారా? వృద్ధాప్యంలో ఖాన్‌ల హవా సాధ్యమయ్యే పనేనా? అన్న సందేహాలు చాలా మందికి ఉన్నాయి. విపరీతమైన పోటీతత్వం ఉండే గ్లామర్ రంగంలో ఖాన్‌లకు ధీటుగా రాణించే ఇతర హీరోలు ఎవరున్నారు? అంటూ ఆరాలు తీస్తున్నారు.
హిందీ చిత్రసీమ నుంచి రణబీర్-రణవీర్- విక్కీకౌశల్ లాంటి స్టార్లు ఆ స్థానాన్ని భర్తీ చేయగలరా? అంటూ విశ్లేషిస్తున్నారు. అయితే ఖాన్‌లకు ఉన్నంత మ్యాసివ్ ఫాలోయింగ్, సుదీర్ఘ కాలం మనుగడ, స్థిరత్వం వీళ్లకు ఉంటుందా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. ఖాన్‌లు ఇప్పటికీ పోటీలో ఉన్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నారు. వారు కెరీర్ ని విరమించలేదు. అందువల్ల పోటీలో ఎందరు ఉన్నా ఖాన్‌లతో పోటీపడుతూ హవా సాగించలేరు అని కూడా కొందరు నెటిజనులు అభిప్రాయపడుతున్నారు.
విక్కీ కౌశల్, రణ్ వీర్ లాంటి స్టార్లు ఒక వేవ్ మాత్రమే. కథల ఎంపికలో ఖాన్‌లకు ఉన్నంత స్పాన్ వీళ్లకు లేదు. వారందరికీ ఒక పరిధి ఉంటుంది. అంతకుమించి ఎత్తుకు ఎగరలేరు.. అంటూ నెటిజనుల్లో ఒక సెక్షన్ వాదిస్తోంది. దేశభక్తి, తీవ్రవాదం కథలు, లేదా హారర్ కామెడీలు, రొమాంటిక్ కామెడీలతో ఈ హీరోలంతా నెట్టుకొస్తున్నారు. కానీ అన్ని జానర్ల కథలతోను ప్రయోగాలు చేసిన ఖాన్‌లు సుదీర్ఘ కాలం సక్సెస్ ని ఆస్వాధిస్తున్నారు.
అయితే ఖాన్‌లకు ధీటుగా రాణించే సత్తా ఉన్న స్టార్లు టాలీవుడ్ నుంచి ఉన్నారా? సుదీర్ఘ కాలం ఖాన్‌ల రేంజులో స్థిరమైన నమ్మకమైన మార్కెట్ ని అందించగలరా? అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇటీవలి కాలంలో బాక్సాఫీస్ ట్రెండ్ ని పరిశీలిస్తే, ఖాన్‌లకు ధీటుగా రాణించే సత్తా తెలుగు స్టార్లకు ఉంది అని నిరూపణ అవుతోంది. ఖాన్‌లను మించి పాన్ ఇండియాలో దూసుకుపోయే సత్తా సౌత్ లో తెలుగు స్టార్లకు కచ్ఛితంగా ఉంది. ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ లాంటి స్టార్లు బాలీవుడ్ లోను ఆదరణ పొందుతున్నారు. తదుపరి పాన్ ఇండియా రేస్ లో దూసుకుపోయే సత్తా తెగువ ఈ హీరోలకు ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద 500-1000 కోట్ల మధ్య వసూళ్లను అందించగల స్టార్లుగా వారికి గుర్తింపు ఉంది. అందువల్ల ఖాన్‌ల త్రయానికి ధీటుగా మరో త్రయం టాలీవుడ్ నుంచి గుర్తింపు తెచ్చుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
నిజానికి ఖాన్‌ల త్రయం పాన్ ఇండియాలో చాలా చోట్ల వసూళ్లను తేగలిగినా సౌత్ లో ఇప్పటికీ స్థిరమైన మార్కెట్ ని సంపాదించుకోలేకపోయారు. వారి బ్లాక్ బస్టర్ సినిమాలకు బాహుబలి తరహా ఆదరణ దేశమంతటా లేనే లేదు. రకరకాల కోణాల్లో విశ్లేషిస్తే బాలీవుడ్ స్టార్లను అధిగమించే సత్తా టాలీవుడ్ స్టార్లకు ఉందని నిరూపణ అవుతోంది. అయితే ఖాన్‌ల తరహాలో టాలీవుడ్ స్టార్లు మరో రెండు దశాబ్ధాలు పైగా స్థిరంగా రాణించినప్పుడు మాత్రమే ఖాన్‌లకు ఆల్టర్నేట్ అని చెప్పగలం. విదేశీ మార్కెట్లోను అసాధారణంగా రాణించాల్సి ఉంటుంది. అడపాదడపా రాణిస్తే సరిపోదు. ప్రతిసారీ వేవ్ సృష్టించాలి. ఒకవేళ మధ్యలో చతికిలబడిపోతే అది స్థిరమైన విజయంగా భావించలేము. ఖాన్‌లను ఎప్పటికీ భర్తీ చేయలేకపోతే, అది కచ్ఛితంగా సౌత్ ట్యాలెంట్ వైఫల్యంగా భావించాల్సి ఉంటుంది. లేదా ప్రజలు హీరోల నుంచి ఇంకేదో కోరుకుంటున్నారని కూడా అంచనా వేయాలి.