స్టార్ హీరోల బాడీ గార్స్డ్ జీతాలు ఎలా ఉంటాయంటే?
అయితే ఇందులో ఎంత నిజముందనే విషయంపై షారుఖ్ ఖాన్ మాజీ సెక్యూరిటీ చీఫ్ యాసీన్ ఖాన్ తాజాగా బయటపెట్టారు.;
బాలీవుడ్ అగ్ర హీరోలు సల్మాన్ ఖాన్ - షారుఖ్ ఖాన్-అబీర్ ఖాన్ చుట్టూ ఎప్పుడూ భారీ భద్రతా వలయం ఉంటుంది. వారి బాడీగార్డ్స్ షేరా, రవి సింగ్ వంటి వారు కూడా సెలబ్రిటీలుగా మారిపోయారు. వీరిద్దరూ ఏడాదికి కోట్ల నుండి 2.7 కోట్ల వరకు జీతం తీసుకుంటారని సోషల్ మీడియాలో ఏళ్ల తరబడి ఒక ప్రచారం సాగుతోంది. అయితే ఇందులో ఎంత నిజముందనే విషయంపై షారుఖ్ ఖాన్ మాజీ సెక్యూరిటీ చీఫ్ యాసీన్ ఖాన్ తాజాగా బయటపెట్టారు.
బాడీగార్డ్స్ సంపాదన గురించి వస్తోన్న వార్తలు అతిశయోక్తి మాత్రమేనని యాసీన్ ఖాన్ కొట్టిపారేశారు. నెలకు 15 నుండి 20 లక్షల జీతం ఏ బాడీగార్డ్‌కు ఉండదని స్పష్టం చేశారు. ఒకవేళ ఆ బాడీగార్డ్స్ సొంతంగా సెక్యూరిటీ ఏజెన్సీలు నడుపుతుంటే (ఉదాహరణకు సల్మాన్ బాడీగార్డ్ షేరాకు 'టైగర్ సెక్యూరిటీ' అనే సంస్థ ఉంది) వారి మొత్తం ఆదాయం కోట్లలో ఉండొచ్చు. కానీ కేవలం ఒక వ్యక్తి వద్ద బాడీగార్డ్‌గా పనిచేస్తూ అంత మొత్తం జీతం పొందడం అసాధ్యమని వివరించారు. సాధారణంగా పెద్ద స్టార్ల వద్ద పనిచేసే సెక్యూరిటీ సిబ్బందికి పద్ధతి ప్రకారం నెలవారీ వేతనం అందుతుందని తెలిపారు. అనుభవం , వారి హోదాను బట్టి నెలకు సుమారు 1 లక్ష వరకు ఉండొచ్చని, అంతకు మించి కోట్లలో జీతాలు ఉండవన్నారు.
సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారం వల్ల ఈ వృత్తిపై అనవసరమైన అంచనాలు పెరుగుతున్నాయన్నారు. ఇది వాస్తవ పరిస్థితులకు చాలా దూరంగా ఉందని యాసీన్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. హీరోలు షూటింగ్స్‌లో ఉన్నప్పుడు లేదా బహిరంగ వేడుకలకు వెళ్ళినప్పుడు ఆయా సినిమాల నిర్మాతలు భద్రతా సిబ్బంది కోసం అదనపు నిధులు కేటాయిస్తుంటారని వెల్లడించారు. ఒకప్పుడు బాడీగార్డ్‌లకు షూటింగ్ సమయాల్లో విడిగా జీతాలు ఉండేవి కాదని తాను స్వయంగా గౌరీ ఖాన్ వంటి వారితో చర్చించి పరిస్థితిలో మార్పు తెచ్చానని గుర్తు చేసుకున్నారు.
ఇలాంటి ప్రత్యేక ఒప్పందాల వల్ల కొంత అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉన్నప్పటికీ, అది ప్రచారంలో ఉన్నంత భారీ స్థాయిలో ఉండదన్నారు. బయటి ప్రపంచానికి బాడీగార్డ్స్ జీవితం ఎంతో విలాసవంతంగా, స్టార్ హీరోల పక్కనే తిరుగుతూ గ్లామరస్‌గా కనిపించొచ్చు. కానీ నిరంతరం అప్రమత్తంగా ఉండటం, గంటల తరబడి నిలబడి ఉండటం ,వారి వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయడం వంటి ఎన్నో సవాళ్లు ఈ వృత్తిలో ఉంటాయని యాసీన్ పేర్కొన్నారు. హీరోల పక్కన కనిపిస్తున్నంత మాత్రాన కోట్లాది రూపాయల సంపాదన ఉంటుందనుకోవడం పొరపాటేనని తేల్చి చెప్పారు.
సెలబ్రిటీల వ్యక్తిగత సిబ్బంది గురించి వచ్చే వార్తలను గుడ్డిగా నమ్మకూడదని యాసీన్ ఖాన్ సూచించారు. ఏ వృత్తిలోనైనా కష్టపడితే గుర్తింపు వస్తుంది కానీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే అంకెలన్నీ నిజం కావని ఆయన మాటల ద్వారా అర్థమవుతోంది. స్టార్ హీరోల భద్రత అనేది బాధ్యతతో కూడిన పని మాత్రమే కాదు. అది ఒక క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అని వివరించారు. ఈ వివరణతో బాడీగార్డ్స్ జీతాలపై జరుగుతోన్న సుదీర్ఘ చర్చకు తెర పడినట్లు అయింది.