స్త్రీల పై మరో భోజ్‌పురి నటుడి అసభ్యకర వ్యాఖ్యలు
సోషల్ మీడియా- డిజిటల్ యుగంలో వేదికలపై మాట్లాడేప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. పొరపాటున మాట జారినా, దాని పర్యవసానం చాలా సీరియస్ గా మారుతోంది.;
సోషల్ మీడియా- డిజిటల్ యుగంలో వేదికలపై మాట్లాడేప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. పొరపాటున మాట జారినా, దాని పర్యవసానం చాలా సీరియస్ గా మారుతోంది. అయినదానికి కానిదానికి ఒక్కోసారి అల్లరి పాలు కావాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతోంది. ముఖ్యంగా సెలబ్రిటీలు బహిరంగ వేదికలపై ఇష్టానుసారం మాట్లాడేస్తానంటే కుదరదు. సోషల్ మీడియా నిశితంగా ప్రతిదీ గమనిస్తోంది. నెటిజనుల నుంచి వేగంగా ప్రతిస్పందనలు కూడా వచ్చేస్తున్నాయి. చాలా తిట్లు తినాల్సిన పరిస్థితి సెలబ్రిటీలకు ఎదురవుతోంది. ఒక్కోసారి చట్టపరమైన చర్యలు కూడా తప్పడం లేదు.
ఇంతకుముందు ప్రముఖ భోజ్ పురి నటుడు పవన్ సింగ్ లక్నోలోని ఒక బహిరంగ వేదికపై సహనటితో అసభ్యంగా ప్రవర్తించిన వీడియో వైరల్ అయింది. అంజలి రాఘవ్ అనే నటి నడుమును గిల్లుతూ విచిత్ర పోకడలకు పోయిన అతడిని నెటిజనులు తూర్పారబట్టారు. అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఫిర్యాదులు అందాయి. ఇలాంటి వివాద సమయంలో మరో ప్రముఖ భోజ్ పురి నటుడు కేసరి లాల్ యాదవ్ కూడా ఇదే తరహా వివాదంలోకి వచ్చాడు.
అతడు తన సహనటి గురించి అనుచితంగా మాట్లాడుతూ, కౌగిలించుకుంటున్న వీడియో వైరల్ గా మారుతోంది. ఇది త్రోబ్యాక్ వీడియోనే అయినా ప్రస్తుత పవన్ సింగ్ వివాదంతో ముడిపెడుతూ వీడియోని వైరల్ చేస్తున్నారు.
ఈ వీడియోలో కేసరి యాదవ్ తన సరసన ఉన్న నటితో సరసాలాడుతూ తన అందం, ఎత్తు గురించి కామెంట్ చేసాడు. తనను కౌగిలించుకోమని కూడా అడిగాడు. సదరు నటి బిగ్గరగా నవ్వేస్తూ అతడిని కౌగిలించుకుంది. ఆ సమయంలో అతడు మాట్లాడుతూ జీవితం అంటే ఇలాగే ఉండాలి... నేను ఎక్కడ కావాలంటే అక్కడ గాళ్స్‌ని తాకుతాను అని వ్యాఖ్యానించాడు. ఈ త్రోబ్యాక్ వీడియోను షేర్ చేస్తూ అతడి చౌకబారు ప్రవర్తనను నెటిజనులు తిట్టిపోస్తున్నారు. భోజ్ పురి స్టార్లు నటీమణులతో ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తారో ఈ యాక్ట్ సూచిస్తోందని కూడా నెటిజనులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా యుగంలో ఇంకా గతించిన పాత రోజులను అనుకరిస్తే కుదరదు. ఇప్పుడు మారాల్సిన సమయం వచ్చింది.