టీజర్ టాక్: భారతీయుడు ఈజ్ బ్యాక్
సమాజానికి శక్తివంతమైన , ప్రభావవంతమైన సందేశాన్ని అందించే లక్ష్యంతో శంకర్ మరోసారి తనదైన శైలి కథాంశాన్ని ఎంపిక చేసుకున్నారని తాజాగా రిలీజైన టీజర్ గ్లింప్స్ చెబుతోంది.
1996 బ్లాక్ బస్టర్ మూవీ భారతీయుడు సీక్వెల్ భారతీయుడు 2 (ఇండియన్ 2) పేరుతో విడుదల కానుంది. 2.0 తర్వాత శంకర్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ చిత్రమిది. ఇండియన్ 2 భారీ అంచనాలు ఉన్న పాన్ ఇండియా చిత్రం. ఇది కేవలం తమిళ భాషకు మాత్రమే చెందినది కాదు. అంతగా దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న సినిమా అనడంలో సందేహం లేదు. లైకా ప్రొడక్షన్స్- రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ మరోసారి సేనాపతిగా భారతీయుడుగా తిరిగి వస్తున్నారు.
సమాజానికి శక్తివంతమైన , ప్రభావవంతమైన సందేశాన్ని అందించే లక్ష్యంతో శంకర్ మరోసారి తనదైన శైలి కథాంశాన్ని ఎంపిక చేసుకున్నారని తాజాగా రిలీజైన టీజర్ గ్లింప్స్ చెబుతోంది. భారతీయులు మారరు. అవినీతి మారదు. కానీ దానిని అంతం చేసేందుకు మళ్లీ భారతీయుడు వచ్చాడు! ఈసారి సేనాపతి కత్తి పోట్లు ఇంకా బలంగా పడబోతున్నాయని తాజా టీజర్ చెబుతోంది. ఎప్పటిలానే ఈ సినిమాలో కూడా శంకర్ చాలా సరళంగా అందరికీ అర్థమయ్యేలా సన్నివేశాలను మలిచారు. ఇందులో కమల్ హాసన్ పాత్రతో పాటు హీరో సిద్ధార్థ్ పాత్ర.. శివకార్తికేయన్ పాత్ర.. సముదిరకని పాత్రలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.
ఈ చిత్రానికి సంబంధించిన పరిచయ టీజర్ ఇప్పటికే వైరల్ గా మారింది. కానీ ఇది గ్రిప్పింగ్ టీజర్ కాదు. భారతీయుడు 2క్లైమాక్స్ లో చనిపోయాడనుకున్న సేనాపతి తిరిగి వస్తాడు. మళ్లీ వస్తాను అని ఫోన్ చేస్తున్న ఆ సీన్ ని తిరిగి ఈ టీజర్ కి జోడించారు. అలాగే సంఘంలోని అవినీతి ముఖాల్ని కలిపేందుకు ప్రయత్నించారు తప్ప దీనిని గ్రిప్పింగ్ థ్రిల్లింగ్ టీజర్ గా మలచలేదనే అనిపిస్తుంది. ఇందులో నటిస్తున్న స్టార్లు అందరినీ ఒకసారి అలా స్క్రోల్ చేసి వదిలేసారు. అయితే ఇది కేవలం శాంపిల్ మాత్రమే. శంకర్ స్థాయి టీజర్ ఇది కానేకాదు. మునుముందు ఇంతకుమించి అలరించే అద్బుతమైన టీజర్, ట్రైలర్లను రిలీజ్ చేస్తారనే అభిమానులు ఆశిస్తున్నారు.
ఇది స్టార్లకు ఇంట్రోలాంటిది:
సూపర్ స్టార్ రజనీకాంత్, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్, శాండల్‌వుడ్ స్టార్ కిచ్చా సుదీప్, పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి సహా భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని దిగ్గజాలు వివిధ భాషల్లో టీజర్‌ను సంయుక్తంగా విడుదల చేశారు. ఈ టీజర్ కి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. తాజా టీజర్ కేవలం ఇంట్రోలాంటిది. ఇది గ్రిప్పింగ్ నేరేషన్ తో తీర్చిదిద్దిన టీజర్ కానే కాదన్న చర్చా సాగుతోంది.
దేశంలో అన్యాయం పెరిగిపోతున్న నేపథ్యంలో కమల్ హాసన్ భారతీయుడు తిరిగి రావాలని భారతదేశ ప్రజలు కోరుకుంటున్నారనే అంగీకరించాలి. దాదాపు రెండు నిమిషాల టీజర్ లో ప్రభుత్వ అధికారులు అవినీతి వ్యవహారాలకు చరమగీతం పాడేందుకు భారతీయుడు వచ్చాడు అనే సందేశాన్ని ఇచ్చారు. సంపన్న రాజకీయ నాయకులు పెళ్లి వేడుకల సమయంలో కూడా ఆడంబరమైన సంపదను ప్రదర్శించడం ఈ టీజర్ లో చూపించారు. కమల్ హాసన్ నాటకీయ ప్రవేశంతో టీజర్ క్లైమాక్స్ దశకు చేరుకుంది. అతను తన పేరును వీరశేఖర్ సేనాపతిగా సంతకం చేస్తూ "నమస్తే ఇండియా, భారతీయుడు ఈజ్ బ్యాక్" అని ప్రకటించడం ఉత్కంఠను కలిగించింది.
సిద్ధార్థ్ అమాయకుడిగా సామాన్యుడి పాత్రలో కనిపిస్తుండగా, బాబీ సింహా అంకితభావంతో కూడిన పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించాడు. దివంగత నటుడు వివేక్‌ను సినిమాలో చూపించేందుకు శంకర్ తెలివిగా ఒక మార్గాన్ని కనుగొన్నాడు. అతడి ఇమేజ్ ఇలా కనిపించి వెళుతుంది. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ జర్నలిస్ట్ పాత్రను పోషించారు. రకుల్ ప్రీత్ సింగ్ చేసిన అతిధి పాత్ర సినిమా మొత్తం ఉత్సాహాన్ని పెంచుతుంది. పీయూష్ మిశ్రా, గుల్షన్ గ్రోవర్, బ్రహ్మానందం, దివంగత నటులు మనోబాల, వివేక్, నెడుముడి వేణు కూడా తెరపై కనిపిస్తారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రవి వర్మన్ తన కళాత్మక సినిమాటోగ్రఫీ అస్సెట్ కానుంది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు.
రజనీకాంత్ థాంక్స్:
ప్రస్తుతానికి మేకర్స్ ఇంకా అధికారిక విడుదల తేదీని ప్రకటించలేదు. భారతీయుడు 2 టీజర్ ని ఆవిష్కరించిన రజనీకాంత్ సహా ప్రముఖ హీరోలందరికీ కమల్ హాసన్ ఈ సందర్భంగా ఎక్స్ (ట్విట్టర్) ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.