బెల్లంకొండ సురేష్ పై కేసు నమోదు.. ఏం జరిగిందంటే?
ఆ సమయంలో వాగ్వాదం, దాడి ప్రయత్నం జరిగినట్లు సమాచారం. ఏదేమైనా శివప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.;
టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్ గురించి అందరికీ తెలిసిందే. తాజాగా ఆయన వార్తల్లో నిలిచారు. హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో సురేష్ పై కేసు నమోదు అయింది. తన ఇంటిని ఆక్రమించారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అసలేం జరిగిందంటే?
ఫిల్మ్ నగర్ రోడ్ నెం.7లో ఉన్న తన ఇంటిని సురేష్ ఆక్రమించారని శివప్రసాద్ అనే వ్యక్తి ఆరోపించారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఇటీవల ఫిర్యాదు చేశారు. తాను కొంత కాలంగా బంధువుల వద్ద ఉంటున్నానని ఫిర్యాదులో తెలిపారు. ఆ సమయంలో బెల్లంకొండ అనుచరులు.. ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించారని పేర్కొన్నారు.
ఆ సమయంలో తన ఇంట్లో సామాగ్రిని ధ్వంసం చేశారని, గోడలకు కూడా నష్టం కలిగించారని ఫిర్యాదుదారుడు ఆరోపించారు. ఇంటికి వచ్చి అక్కడ పరిస్థితి చూసి షాక్ కు గురయ్యామని తెలిపారు. అయితే శివప్రసాద్ తోపాటు ఆయనకు సంబంధించిన పలువురు.. సురేష్ ఇంటికి వెళ్లి జరిగిన విషయంపై మాట్లాడే ప్రయత్నం చేశారట.
ఆ సమయంలో వాగ్వాదం, దాడి ప్రయత్నం జరిగినట్లు సమాచారం. ఏదేమైనా శివప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దర్యాప్తు కూడా ప్రారంభించారు. ఇప్పుడు ఆ విషయం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారగా.. ఇప్పటి వరకు బెల్లంకొండ సురేష్ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.
ఇక బెల్లంకొండ సురేష్ విషయానికొస్తే.. టాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించి ప్రముఖ నిర్మాతల్లో ఒకరిగా పేరు సొంతం చేసుకున్నారు. ఆది, నా ఆటోగ్రాఫ్, కందిరీగ, బాడీగార్డ్, లక్ష్మీ నరసింహ, చెన్నకేశవరెడ్డి, రభస, అల్లుడు శ్రీను వంటి పలు చిత్రాలు నిర్మించారు. కమర్షియల్ హిట్స్ అందుకుని సత్తా చాటారు.
కానీ కొంతకాలంగా బెల్లంకొండ సురేష్ సినిమా నిర్మాణంలో చురుగ్గా లేరు. ప్రొడక్షన్ కు దూరంగా ఉన్నారు. కానీ భారీ చిత్రాల నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మంచి నెట్ వర్క్ మాత్రం ఉంది. సినిమాలపై పట్టు ఉన్న నిర్మాతగా ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం ఆయన ఇద్దరు కుమారులు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, బెల్లంకొండ గణేష్ హీరోలుగా కొనసాగుతున్నారు.