తేజ సజ్జాకు ఐకాన్ ఎలివేషన్స్

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా గురించి అందరికీ తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్టింగ్ కెరీర్ ను స్టార్ట్ చేసి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు.;

Update: 2025-10-19 05:43 GMT

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా గురించి అందరికీ తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్టింగ్ కెరీర్ ను స్టార్ట్ చేసి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. తన నటనతో ఎంతో మంది ఆడియన్స్ ను మెప్పించారు. చూడాలని ఉంది నుంచి బాస్ వరకు అనేక చిత్రాల్లో యాక్ట్ చేసి.. బేబీ మూవీతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.

అదే సమయంలో జాంబిరెడ్డి మూవీతో హీరోగా మారిన తేజ సజ్జా.. హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఆ చిత్రంతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్న తేజ.. హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ లో కూడా లీడ్ రోల్ లో సందడి చేయనున్నారు.

రీసెంట్ గా మిరాయ్ మూవీతో పాన్ ఇండియా లెవెల్ లో మరో విజయాన్ని తేజ అందుకున్న విషయం తెలిసిందే. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఆ సినిమాతో అందరినీ అలరించారు. దీంతో ఒక్కసారిగా తేజ సజ్జా హాట్ టాపిక్ గా మారారు. అందరి దృష్టి.. తేజ కొత్త సినిమాలపై పడిందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

అయితే ఒక్కో సినిమాను ఆచితూచి ఎంచుకుని వరుస విజయాలు అందుకుంటూ వస్తున్నారు తేజ సజ్జా. హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కో అడుగు చాలా జాగ్రత్తగా వేస్తూ వెళ్తున్నారని చెప్పాలి. నిజానికి.. చైల్డ్ ఆర్టిస్టులుగా కెరీర్ స్టార్ట్ చేసి హీరోలు అయిన వారిలో చాలామంది నిలబడలేకపోయారు.

కానీ తేజ మాత్రం ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తూ.. మంచి సినిమాలతో దూసుకుపోతున్నారు. జాంబీ రెడ్డి, బేబి, హనుమాన్, ఇలా తేజ మూవీస్ అన్నీ సూపర్ హిట్ అవ్వడంతో క్రేజ్ భారీగా పెరిగిపోయింది. దీంతో అతి తక్కువ సమయంలో స్టార్ హీరోలను మించి పోయేలా ఉన్నారు అనడంలో డౌట్ అక్కర్లేదు.

అయితే ఇప్పుడు తేజ సజ్జా మరో అల్లు అర్జున్ కానున్నారని నిర్మాత, నటుడు బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్య.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హైదరాబాద్‌ లో టాలీవుడ్ ప్రముఖుల కోసం నిర్వహించిన దీపావళి వేడుకకు వచ్చిన తేజ సజ్జాను రిసీవ్ చేసుకున్న బండ్ల గణేష్.. రాసిపెట్టుకోండి తేజ భారత సినీ ఇండస్ట్రీలో మరో అల్లు అర్జున్ కాకపోతే నన్ను అడగండి అంటూ ప్రశంసలతో ముంచెత్తారు.

బండ్ల గణేశ్ అలా అనగానే.. హర్షధ్వానాలు, చప్పట్లు రావడం విశేషం. పుష్ప సిరీస్ చిత్రాలతో అల్లు అర్జున్ ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో ఓ రేంజ్ లో ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు బండ్ల గణేష్ అన్నట్లు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంతటి క్రేజ్ తేజకు కూడా రావాలని నెటిజన్లు, సినీ ప్రియులు కోరుకుంటున్నారు. మరేం జరుగుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News