భగవంత్ కేసరి @ 3 ఏళ్లు.. తెలియని విషయాలెన్నో!

నటసింహ నందమూరి బాలకృష్ణ.. అటు ఓటమెరుగని దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తొలిసారి చేసిన చిత్రం భగవంత్ కేసరి.

Update: 2026-10-19 05:05 GMT

నటసింహ నందమూరి బాలకృష్ణ.. అటు ఓటమెరుగని దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తొలిసారి చేసిన చిత్రం భగవంత్ కేసరి. 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించారు. ప్రముఖ యంగ్ బ్యూటీ శ్రీ లీల ఇందులో బాలయ్య కూతురుగా నటించింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రం 2023లో అత్యధిక కలెక్షన్స్ వసూలు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.. ఇకపోతే ఈ సినిమా విడుదలై నేటితో మూడేళ్లు కావడంతో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఈ సినిమా విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ లో సుమారుగా రూ.70 నుండి రూ.75 కోట్ల వరకు రాబట్టి బాలకృష్ణ కెరియర్ లోనే ఒక రికార్డును నమోదు చేసుకుంది. ఇక ట్రైలర్ రాకముందే.. సినిమా విడుదలకు రెండు నెలల ముందే మేజర్ బిజినెస్ డీల్స్ క్లోజ్ కావడం విశేషం. ఇకపోతే ఈ సినిమా విడుదలైన కేవలం 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 104 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి, భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు ఈ సినిమా పలు కేంద్రాలలో 50 రోజుల ప్రదర్శన పూర్తిచేసుకుని విజయవంతంగా ప్రదర్శించబడింది కూడా..

71వ జాతీయ చలనచత్ర పురస్కారాలలో ఉత్తమ తెలుగు చలనచిత్రంగా ఈ సినిమా నిలిచింది. అలాగే తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డులలో తృతీయ ఉత్తమ చలన చిత్ర పురస్కారాన్ని కూడా సొంతం చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కూడా ఈ చిత్రం ద్వారా విలన్ గా తొలిసారి తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. బాలయ్య కెరియర్లో 108వ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సాహూ గారపాటి , హరీష్ పెద్ది నిర్మించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో హరీష్ పెద్దికి ఇదే చివరి సినిమా కావడం గమనార్హం.

సాధారణంగా బాలకృష్ణ నటించిన సినిమాలలో కేవలం మాస్ యాక్షన్ మాత్రమే కాకుండా అమ్మాయిలను ధైర్యంగా పెంచాలి. ఆర్మీలోకి పంపాలి అనే బలమైన మహిళా సాధికారత కోణాన్ని ఇందులో చూపించారు. మొదటిరోజు ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా మొత్తం మీద 104 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఈ చిత్రానికి సంగీతాన్ని తమన్ అందించారు.

Tags:    

Similar News