గ్యాంగ్ స్ట‌ర్ల బెదిరింపు కాల్పుల‌కు లొంగ‌ని రియ‌ల్ హీరో.. టైగ‌ర్ ష్రాఫ్ ధైర్యంపై ప్ర‌శంస‌లు!

ముంబైలోని జుహూ ప్రాంతంలో ఉన్న పుష్పా పార్క్ సమీపంలో జరిగిన కాల్పుల ఘటన బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర కలకలాన్ని రేపిన సంగ‌తి తెలిసిందే.

Update: 2026-10-19 03:58 GMT

ముంబైలోని జుహూ ప్రాంతంలో ఉన్న పుష్పా పార్క్ సమీపంలో జరిగిన కాల్పుల ఘటన బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర కలకలాన్ని రేపిన సంగ‌తి తెలిసిందే. ఆదివారం సాయంత్రం ఈ ఘ‌ట‌న అనంత‌రం ముంబై పోలీసులు హై అలెర్ట్ ప్ర‌క‌టించారు. ఫుట్‌బాల్ మ్యాచ్ ముగించుకుని తిరిగి వస్తున్న బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారును లక్ష్యంగా చేసుకుని బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఊహించని దాడిలో ఆయన కారు దెబ్బతిని, డ్రైవర్ ఫిర్దోజ్ చేతికి తీవ్ర గాయమైంది. జనసమ్మద్దం మధ్య జరిగిన ఈ ఘటన అందరినీ భయాందోళనకు గురిచేసింది.

ఆపద సమయంలో టైగర్ ష్రాఫ్ చూపిన ధైర్యం:

కాల్పుల శబ్దాలతో నలుదిశలా గందరగోళం నెలకొన్నా.. ఆ స‌మ‌యంలో టైగర్ ష్రాఫ్ ఏమాత్రం సంకోచించకుండా అత్యంత ధైర్యంగా వ్యవహరించారు. పోలీసుల రాక కోసం ఎదురుచూడకుండా క్షణాల వ్యవధిలో స్పందించి, గాయపడిన తన డ్రైవర్‌ను కాపాడేందుకు స్వయంగా కారు నడుపుతూ ఆసుపత్రికి తరలించారు. ఈ అత్యవసర పరిస్థితుల్లో అత‌డు చూపిన చొరవ, మానవత్వం అందరి ప్రశంసలను అందుకున్నాయి. రీల్ స్రీన్‌పైనే కాకుండా నిజ జీవితంలోనూ తాను అసలు సిసలు హీరో అనిపించుకున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు.

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే పరామర్శ:

ఈ దారుణ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత గంభీరంగా స్పందించింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే నేరుగా టైగర్ ష్రాఫ్ నివాసానికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా నటుడి ఛాతి - ఎడమ చేతికి గాయాలు, కట్లు క‌నిపించాయి. అయితే ప్రారంభ వార్త‌ల్లో టైగ‌ర్ కి ఎలాంటి గాయాలు కాలేద‌ని వినిపించినా.. డిప్యూటీ ముఖ్య‌మంత్రి ప‌రామ‌ర్శ స‌మ‌యంలో అత‌డి ఛాతిపై క‌ట్టు క‌నిపించ‌డం అభిమానుల్లో ఆందోళ‌న‌కు కార‌ణ‌మైంది. ఇక ఇదే సమయంలో నటి దిశా పటాని కూడా టైగర్ ష్రాఫ్ నివాసానికి చేరుకుని పరామర్శించారు.

ప్రభుత్వ హెచ్చరిక - ఉక్కుపాదం మోపుతామని ప్రకటన:

కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండించిన డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే, ముంబై పోలీస్ కమిషనర్‌తో మాట్లాడి తక్షణ దర్యాప్తుకు ఆదేశించారు. నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. వారు ఏ భాషలో మాట్లాడితే అదే భాషలో సమాధానం చెబుతామని హెచ్చరించారు. 90ల నాటి గ్యాంగ్ వార్లను ముంబై పోలీసులు అణచివేసినట్టే ఇప్పుడు కూడా ఏ గ్యాంగ్ కనుసన్నల్లో జరిగే నేరాలను సహించేది లేదని స్పష్టం చేశారు. ముంబై ప్రజల భద్రత తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని.. సెలబ్రిటీల భద్రతను కూడా మరింత కట్టుదిట్టం చేస్తామని హామీనిచ్చారు.

పెరుగుతున్న గ్యాంగ్ బెదిరింపులు - రాజకీయ విమర్శలు:

ఈ దాడి వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం ఉందని సోషల్ మీడియా వేదికగా వారు బాధ్యత వహించిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. గత కొన్ని నెలలుగా బాలీవుడ్ నటులను లక్ష్యంగా చేసుకుని వరుస బెదిరింపులు, దాడులు జరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గతంలో బాబా సిద్దిఖీని కోల్పోయిన ఎన్సీపీ నాయకుడు జీషాన్ సిద్దిఖీ ఈ ఘటనపై స్పందిస్తూ.. ఇది ముంబై పోలీసుల ఇంటెలిజెన్స్ వైఫల్యమని మండిపడ్డారు. సెలబ్రిటీలపై పెరుగుతున్న దాడులను అరికట్టడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.





Tags:    

Similar News