అన్‌స్టాపబుల్ కాంబో: NBK - చరణ్ రేర్ మల్టీస్టారర్ పాజిబులేనా?
ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా పాన్ ఇండియా రేసులో తన సత్తా చాటుకోవాల్సిన కీలక సమయంలో ఉన్నారు.
టాలీవుడ్‌లో నందమూరి, మెగా కుటుంబాల కలయిక అంటేనే అది ఒక భారీ సంచలనం. ఆమధ్య పాపులర్ ఓటీటీ టాక్ షో `అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే` వేదికగా నందమూరి బాలకృష్ణ (NBK), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల మధ్య సాగిన కెమిస్ట్రీ - సంభాషణలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. వారిద్దరి మధ్య ఉన్న పరస్పర గౌరవం, ఆత్మీయ అనుబంధం చూసిన తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ కేవలం ఒకే వేదికపై లేదా ఒకే ఫ్రేమ్‌లోనే కాకుండా.. ఒకే సినిమాలో కలిసి నటిస్తే చూడాలనే బలమైన కోరిక అభిమానుల్లో మొదలైంది.
ఈ ఆసక్తికరమైన తరుణంలో ఇండస్ట్రీ వర్గాలలో ఒక సరికొత్త సమీకరణం తెరపైకి వచ్చింది. రామ్ చరణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం `పెద్ది` నిర్మిస్తున్న వృద్ధి సినిమాస్ అధినేత వెంకట సతీష్ తన తదుపరి భారీ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నిర్మించబోతున్నారు. ఒకే నిర్మాణ సంస్థతో ఈ ఇద్దరు స్టార్ హీరోలు ముడిపడి ఉండటంతో త్వరలోనే జరగబోయే `పెద్ది` ప్రీ-రిలీజ్ వేడుకకు బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరవుతారనే గుసగుసలు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తున్నాయి. ఈ వేడుకే భవిష్యత్తులో ఒక అరుదైన మల్టీస్టారర్ కాంబినేషన్‌కు గట్టి పునాది కానుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. వృద్ధి సినిమాస్ బ్యానర్‌లో బాలకృష్ణతో సినిమా చేయబోతున్న దర్శకుడు గోపీచంద్ మలినేనికి మెగాస్టార్ చిరంజీవి, చరణ్‌తోనూ అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికే చిరంజీవితో ఒక భారీ ప్రాజెక్ట్ కోసం గోపీచంద్ చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో అటు మెగా కుటుంబానికి, ఇటు నందమూరి హీరోకు అత్యంత ఆప్తుడిగా మారిన గోపీచంద్ మలినేని.. అంతా అనుకూలించి, బలమైన కంటెంట్ సెట్ అయితే బాలకృష్ణ - రామ్ చరణ్‌లను కలిపి ఒక మ్యాసివ్ మల్టీస్టారర్ స్క్రిప్ట్‌ను ఎందుకు సిద్ధం చేయకూడదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా పాన్ ఇండియా రేసులో తన సత్తా చాటుకోవాల్సిన కీలక సమయంలో ఉన్నారు. ఇలాంటి తరుణంలో గ్లోబల్ స్టార్‌గా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్‌ను, మాస్ ఆడియన్స్‌లో తిరుగులేని క్రేజ్ ఉన్న నందమూరి బాలకృష్ణతో కలిపి ఒక హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను ప్లాన్ చేస్తే అది ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కిస్తుందనడంలో సందేహం లేదు. టాలీవుడ్‌లో దశాబ్దాలుగా నడుస్తున్న సాంప్రదాయక సమీకరణాలను బ్రేక్ చేస్తూ.. ఎవరూ ఊహించని సరికొత్త సంచలనాలకు ఈ కాంబో సెట్టవ్వాలని ఇండస్ట్రీ ఆశిస్తోంది. కేవలం ఇది ఒక అందమైన కలగానే మిగిలిపోకుండా ఆచరణలోకి రావాలని ఇండస్ట్రీ పెద్దలు సైతం కోరుకుంటున్నారు.
ప్రస్తుతానికి NBK - రామ్ చరణ్ రేర్ మల్టీస్టారర్ అనేది ఒక క్రేజీ థాట్ ప్రాసెస్ అయినా.. భవిష్యత్తులో ఇది నిజమైతే తెలుగు సినీ రంగంలో ఒక సరికొత్త అధ్యాయానికి తెరతీసినట్టవుతుంది. గతంలో RRR సినిమాతో మెగా-నందమూరి (చరణ్-ఎన్టీఆర్) హీరోల మధ్య ఉన్న ఆరోగ్యకరమైన అనుబంధం బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో అందరూ చూశారు. ఇప్పుడు బాలయ్య-చరణ్ కాంబో గనుక సెట్ అయితే అది అటు అభిమానులను ఉర్రూతలూగించడమే కాకుండా.. ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉన్న `మెగా వర్సెస్ నందమూరి` క్లాషెస్‌కు శాశ్వతంగా ఎండ్ కార్డ్ పలికినట్లు అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.