గంట మోగించిన బాలయ్య.. ఖాతాలో మరో ఘనత..
టాలీవుడ్ సీనియర్ హీరో, నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా మరో ఘనత అందుకున్నారు.;
టాలీవుడ్ సీనియర్ హీరో, నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా మరో ఘనత అందుకున్నారు. ముంబయిలోని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో ట్రేడింగ్ గంటను మోగించిన మొదటి దక్షిణ భారత నటుడిగా నిలిచారు. అయితే ఎన్ఎస్ఈ అధికారుల ఆహ్వానం మేరకు బాలయ్య ఇటీవల సందర్శించగా, ఆయనకు ఘన స్వాగతం లభించింది.
ఆ తర్వాత అధికారుల విజ్ఞప్తి మేరకు అక్కడ ఏర్పాటు చేసిన గంటను మోగించారు. అయితే విశిష్ట అతిథులు, చారిత్రాత్మక సందర్భాలకు సంబంధించిన గౌరవం అది. ఇప్పుడు దాన్ని స్వీకరించిన బాలయ్య, ప్రత్యేక ఘనత సాధించారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి చక్కర్లు కొడుతున్నాయి.
ఇప్పుడు నెట్టింట బాలకృష్ణ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ సందడి చేస్తున్నారు. తమ అభిమాన హీరోకు అరుదైన గౌరవం దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. గర్వంగా ఉందని కూడా చెబుతున్నారు. అయితే కొంతకాలంగా బాలయ్యకు వరుసగా ఘనతలు, రికార్డులు, గౌరవాలు దక్కుతున్న.. అందుతున్న విషయం తెలిసిందే.
కొన్ని రోజుల క్రితమే ఆయనకు ప్రతిష్టాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకుని ఇప్పటికీ హీరోగా కొనసాగుతున్న సందర్భంగా.. ఆయన పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ లో చేరింది. ఇటీవల హైదరాబాద్ లో ఘనంగా జరిగిన కార్యక్రమంలో ఆ పురస్కారాన్ని స్వీకరించారు బాలయ్య.
అంతకుముందు జాతీయ చలన చిత్ర అవార్డులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా.. బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమా సత్తా చాటింది. టాలీవుడ్ కు సంబంధించి ఉత్తమ చిత్రంగా నిలిచింది. అక్కడికి కొద్ది రోజుల ముందు.. సినీ ఇండస్ట్రీకి బాలయ్య చేసిన సేవలకు గాను పద్మభూషణ్ ను కేంద్రం ప్రకటించి.. పురస్కారాన్ని అందించింది.
దీంతో బాలయ్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆయన సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం నటసింహం అఖండ-2 మూవీ చేస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. డిసెంబర్ లో థియేటర్స్ లో సందడి చేయనున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారనే అంచనాలు ఆడియన్స్ లో ఉన్నాయి. మరేం జరుగుతుందో వేచి చూడాలి.