బాలయ్య- మలినేని.. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే?
నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో మాస్ ప్రాజెక్ట్ మళ్లీ ట్రాక్ లోకి వచ్చింది.;
నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో మాస్ ప్రాజెక్ట్ మళ్లీ ట్రాక్ లోకి వచ్చింది. నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద హై వోల్టేజ్ ఎంటర్టైన్మెంట్ కు హామీ అన్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన వీరసింహారెడ్డి భారీ విజయాన్ని సాధించిన తర్వాత, ఆ కాంబో రిపీట్ అవుతుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రస్తుతం కొత్త సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఏప్రిల్ మూడో వారంలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఆ షెడ్యూల్ ను హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆ షెడ్యూల్ లో బాలకృష్ణపై ఓ పవర్ ఫుల్ సాంగ్ ను చిత్రీకరించనున్నారు. అదే సమయంలో ఓ యాక్షన్ ఎపిసోడ్ ను కూడా చిత్రీకరించేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో బాలయ్య అభిమానులు స్పందిస్తున్నారు. సినిమా కోసం ఎంతో వెయిట్ చేస్తున్నట్లు కామెంట్లు పెడుతున్నారు. యాక్షన్ ఎపిసోడ్ తో పాటు పవర్ ఫుల్ సాంగ్ కోసం ఫుల్ గా ఎదురు చూస్తున్నామని చెబుతున్నారు. సాంగ్ కు సంబంధించిన చిన్న గ్లింప్స్ త్వరగా రిలీజ్ చేయండని కూడా కోరుతున్నారు. మొత్తానికి మలినేని కొత్త షెడ్యూల్ ప్లాన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇక సినిమా విషయానికొస్తే.. బాలయ్య సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆ జంటకు ఇప్పటికే ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన సింహా, శ్రీరామరాజ్యం, జై సింహా చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. అందుకే మరోసారి ఈ హిట్ జోడీ తెరపై కనిపించబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
ప్రాజెక్ట్ కు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్ర బృందం త్వరలో అధికారికంగా ప్రకటించనుంది. ఏదేమైనా గోపీచంద్ మలినేని ప్రత్యేకమైన మాస్ మేకింగ్, బాలకృష్ణ ఎనర్జీ కలిస్తే థియేటర్లలో భారీ రెస్పాన్స్ రావడం ఖాయమని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా యాక్షన్ ఎలిమెంట్స్ కు ప్రాధాన్యత ఇస్తూ కథను దర్శకుడు గోపీచంద్ సిద్ధం చేసినట్లు సమాచారం.
అభిమానులు ఆశించే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ను యాడ్ చేస్తూ కథనం రూపొందించారట. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయొచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. సతీష్ కిలారు నిర్మిస్తున్న ఆ ప్రాజెక్టుకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే బాలయ్య సినిమాల్లో ఆయన మ్యూజిక్ కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో ఇప్పుడు కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. ఏదేమైనా బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబో మరోసారి మాస్ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించేందుకు సిద్ధమవుతోంది. షూటింగ్ తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానున్న వేళ.. సోషల్ మీడియాలో అభిమానుల హడావుడి ఇప్పటికే మొదలైంది.