'బలగం' నటుడికి తీవ్ర అస్వస్థత.. సాయం కోసం ఎదురు చూపులు!

బలగం సినిమాలో కీలక పాత్రలో నటించిన జీవీ బాబు ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడు.;

Update: 2025-05-06 05:26 GMT

తెలంగాణ గ్రామీణ వాతావరణం నేపథ్యంలో రూపొంది 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బలగం సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దిల్‌ రాజు సమర్పణలో ఆయన ఫ్యామిలీ మెంబర్స్ నిర్మించిన బలగం సినిమాతో కమెడియన్‌ వేణు దర్శకత్వం వహించాడు. ఆ సినిమాతో ఎంతో మంది పల్లె కళాకారులను తెలుగు ప్రేక్షకులకు వేణు పరిచయం చేసిన విషయం తెల్సిందే. బలగం సినిమా సూపర్ హిట్‌ కావడంతో ఇద్దరు ముగ్గురు బిజీ అయ్యారు. కానీ ఇతర నటీ నటులు మాత్రం పెద్దగా ఆఫర్లు లేకపోవడంతో అలాగే ఉండి పోయారు. అవకాశాల కోసం ఇంకా ఎదురు చూస్తూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు.

బలగం సినిమాలో కీలక పాత్రలో నటించిన జీవీ బాబు ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడు. సినిమాలో ముఖ్య పాత్రలో నటించిన కొమురయ్య పాత్రకు సోదరుడి పాత్రలో నటించిన జీవీ బాబు గుర్తింపు దక్కించుకున్నాడు. ఆ తర్వాత రెండు మూడు అదే తరహా పాత్రలు చేశాడు. కానీ అవి బలగం స్థాయిలో గుర్తింపు దక్కించుకోలేదు, పైగా ఆ సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. దాంతో బలగం తర్వాత ఆయన పెద్దగా నిలదొక్కుకున్న దాఖలాలు లేవు. బలగం కొమురయ్య పాత్రలో నటించిన సుధాకర్‌ మాత్రం మంచి పాత్రలు, సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. జీవీ బాబు మాత్రం ఆఫర్లు లేకపోవడంతో పాటు, అనారోగ్య సమస్యలతో పోరాటం చేస్తున్నాడు.

జీవీ బాబు ప్రస్తుతం మూత్రపిండాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నాడు. వరంగల్‌ జిల్లాలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో జీవీ బాబుకు కుటుంబ సభ్యులు చికిత్స అందిస్తున్నారు. జీవీ బాబు ఆరోగ్యం కుదుట పడాలంటే సుదీర్ఘమైన చికిత్స అవసరం అని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. అందుకోసం భారీ మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుందని, తమ వద్ద అంత డబ్బు లేదని జీవీ బాబు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినిమాల ద్వారా వచ్చిన డబ్బు ఏమీ లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవీ బాబును ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని, ప్రభుత్వం, నాటక రంగంకు చెందిన వారు, ఇండస్ట్రీ వారు సహాయం చేయాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

వరంగల్‌ జిల్లా రామన్న పేటకు చెందిన జీవీ బాబు సుదీర్ఘ కాలంగా రంగస్థల కళాకారుడు. ఎన్నో స్టేజ్‌ కార్యక్రమాల్లో నటించాడు, నాటకాలు వేసేవాడు. అందుకే బలగం సినిమాలో అంజన్న పాత్రకు గాను దర్శకుడు వేణు ఎంపిక చేసుకున్నాడు. నిజ జీవితంలో ఉండే పాత్ర తరహాలోనే చాలా నేచురల్‌గా బాబు నటించి మెప్పించాడు. ఒకానొక సీన్‌లో అంజన్న నటనకు కన్నీళ్లు వస్తాయి. అలాంటి మంచి నటుడికి సాయంగా ఇండస్ట్రీ వారు నిలబడాలి. బలగం మేకర్స్‌, ఇతర నటీనటులు సాయం చేయాలని కొందరు విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags:    

Similar News