బాహుబలి 3 టీజర్: బాహుబలి- భళ్లాల దేవ `స్పైడర్‌మేన్` వేషాలు
బాహుబలి - ది బిగినింగ్, బాహుబలి- ది కన్ క్లూజన్ చిత్రాలతో చరిత్ర లిఖించాడు ఎస్.ఎస్.రాజమౌళి.;
బాహుబలి - ది బిగినింగ్, బాహుబలి- ది కన్ క్లూజన్ చిత్రాలతో చరిత్ర లిఖించాడు ఎస్.ఎస్.రాజమౌళి. అయితే `ది కన్ క్లూజన్`తో ఇక బాహుబలి కథకు ముగింపు పలికినట్టేనని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా ఆలోచించిన నిర్మాత శోభు యార్లగడ్డ బాహుబలి కథలను మరిన్ని క్రియేట్ చేయాలని భావించినట్టు తెలిసింది.
నిజానికి రాజమౌళి `బాహుబలి- 3` తెరకెక్కించే ఆలోచన లేదని ఇంతకుముందే వెల్లడించారు. కానీ ఇప్పుడు బాహుబలి ఫ్రాంఛైజీ నుంచి కొత్త సినిమా వస్తోంది. ఇది పూర్తిగా యానిమేటెడ్ సినిమా. కానీ కథాంశం మాత్రం తొలి రెండు భాగాలను కలుపుతూ ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకుని వెళుతుంది. బాహుబలి సినిమాటిక్ విశ్వంలో `బాహుబలి - ది ఎటర్నల్ వార్` యానిమేషన్ సినిమా టీజర్ ఇప్పుడు వైరల్ గా దూసుకెళుతోంది. ఈ టీజర్ లో బాహుబలి వర్సెస్ భళ్లాల దేవ వార్ పీక్స్ లో ఎలివేట్ చేయడం ఆసక్తికరం.
స్టార్ వార్స్- విజన్స్, ది బాండిట్స్ ఆఫ్ గోలక్ చిత్రాలను తెరకెక్కించిన ఇషాన్ శుక్లా ఈ మూడో భాగానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథాంశం గురించి ఎక్స్ ఖాతాలో టీమ్ రివీల్ చేసింది. ``అమరేంద్ర బాహుబలి మరణం అతడి ముగింపు కాదు.. శాశ్వతమైన ప్రారంభం`` అని ట్యాగ్ ని జోడించారు. ఈ టీజర్‌లో డార్లింగ్ ప్రభాస్ ని రెండు కోణాల్లో చూపుతుంది. స్పైడర్ మ్యాన్ తరహాలో సాలీడులా గాల్లో విన్యాసాలు చేసే పౌరాణిక కాలంలోని యువకుల మాదిరిగా ప్రభాస్, భళ్లాల దేవ ఇద్దరూ కనిపిస్తున్నారు. ఇది బాహుబలి ప్రపంచానికి కొనసాగింపు. 2డి వెర్షన్ ని అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో విడుదల చేసాము.. 3డి యానిమేషన్ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తామని తెలిపారు.
యువ ప్రతిభావంతుడు, యానిమేటర్ ఇషాన్ శుక్లా బాహుబలి కథను విస్తరించడంలో పాత్రలను రీక్రియేట్ చేయడంలో చేసిన కృషిని రాజమౌళి అభినందిస్తున్నారు. అవే పాత్రలతో వేరే కోణంలో కథాంశం రన్ అవుతుంది. నాకు ఆ ఆలోచన నిజంగా నచ్చింది. దాదాపు రెండున్నర సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్‌పై పని చేస్తున్నారని తెలిపారు. ఇప్పుడు సినిమా బడ్జెట్ దాదాపు రూ. 120 కోట్లకు చేరుకుందని అంచనా. బాహుబలి ది బిగినింగ్ కి అయినంత బడ్జెట్ దీనికి ఖర్చయిందట. బాహుబలి- ది ఎటర్నల్ వార్ గురించి మునుముందు మరిన్ని వివరాలు వెల్లడిస్తారు.