బాహుబలి ఎపిక్‌కు హక్కులే విలన్ అయ్యాయా?

దాదాపు 3 గంటల 44 నిమిషాల నిడివితో రూపొందించిన ఈ ప్రత్యేక వెర్షన్ థియేటర్లలో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. రెండు భాగాల కథను ఒకే సినిమాలో చూడడం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించింది.

Update: 2026-06-13 08:32 GMT

భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రభావం చూపిన సినిమాల్లో బాహుబలి సిరీస్‌కు ప్రత్యేక స్థానం ఉంది. డైరెక్ట‌ర్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్‌క్లూజన్ సినిమాలు కలిపి గతేడాది బాహుబలి: ది ఎపిక్ పేరుతో ఒకే సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 3 గంటల 44 నిమిషాల నిడివితో రూపొందించిన ఈ ప్రత్యేక వెర్షన్ థియేటర్లలో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. రెండు భాగాల కథను ఒకే సినిమాలో చూడడం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించింది.

అయితే థియేటర్లలో ప్రశంసలు అందుకున్న ఈ ఎపిక్ వెర్షన్ ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో మాత్రం కనిపించకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు ఇది మరింత నిరాశ కలిగించే అంశంగా మారింది. ఎందుకంటే బాహుబలి ది ఎపిక్ ప్రస్తుతం ప్రధాన ఓటీటీ వేదికల్లో తెలుగు వెర్షన్‌లో అందుబాటులో లేదు. కొంతమంది ప్రేక్షకులు ఇది త్వరలో వస్తుందని భావించినా, ఈ సినిమా రిలీజై ఎనిమిది నెలలు దాటిపోయినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. ఇక్కడే మరో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. భారతదేశంలో డిజిటల్ రిలీజ్ లేకపోయినా, జపాన్ మార్కెట్‌లో మాత్రం బాహుబలి ది ఎపిక్ బ్లూరే రూపంలో విడుదలైంది. అంతేకాదు, మెయిన్ మూవీతో పాటూ స్పెష‌ల్ మేకింగ్ వీడియోల‌ను కూడా అందులో చేర్చినట్లు సమాచారం. తెలుగు ఆడియో ట్రాక్‌తో కూడిన ఈ ఎడిషన్ ఇప్పటికే అక్కడి ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. దీంతో జ‌పాన్ కు దొరికిన బాహుబ‌లి మ‌న తెలుగు వారికి ఎందుకు దొర‌క‌డం లేద‌నే ప్ర‌శ్న సోష‌ల్ మీడియాలో త‌ర‌చూ వినిపిస్తోంది.

ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా డిజిటల్, శాటిలైట్ రైట్స్ కు సంబంధించిన ఒప్పందాలే అనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో సాగుతోంది. బాహుబలి రెండు భాగాలకు వేర్వేరు కాలాల్లో జరిగిన రైట్స్ డీల్స్, అనంతరం రూపొందిన ఎపిక్ వెర్షన్‌కు సంబంధించిన కొత్త హక్కుల వ్యవహారాలు కలిసి సాంకేతికంగా చిక్కులు సృష్టించి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకే కథను కొత్తగా ఎడిట్ చేసి రిలీజ్ చేసినప్పటికీ, దాని డిజిటల్ పంపిణీకి సంబంధించిన ప‌ర్మిష‌న్స్, భాగస్వామ్య సంస్థల మధ్య ఒప్పందాలు ఇంకా పూర్తిగా క్లియర్ కాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇదిలా ఉండగా, బాహుబలి ది ఎపిక్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. థియేటర్లలో చూడలేకపోయినవారు, మళ్లీ ఆస్వాదించాలని కోరుకునే అభిమానులు, ఫ్యామిలీతో కలిసి ఓటీటీలో చూడాలనుకునే ప్రేక్షకులు ఇప్పటికీ ఈ వెర్షన్ కోసం ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో తరచూ దీనిపై పోస్టులు కనిపిస్తుండటం కూడా అదే విషయాన్ని సూచిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమాలకు కొత్త మార్కెట్లు తెరుచుకుంటున్న సమయంలో, విదేశాల్లో బ్లూరే రూపంలో అందుబాటులో ఉన్న బాహుబలి ది ఎపిక్ స్వదేశీ ఆడియ‌న్స్ కు అందకుండా ఉండటం నిజంగా విస్మయకరమే. ఈ గందరగోళం ఎప్పుడు ముగుస్తుందో, ఎపిక్ వెర్షన్ ఎప్పుడు ఓటీటీకి వస్తుందో చూడాలి మ‌రి. ప్రస్తుతం అయితే బాహుబ‌లి ఎపిక్ కోసం ప్రేక్షకుల ఎదురుచూపులే కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News