ఆస్కార్‌ కమిటీలోకి మన స్టార్‌కి ఆహ్వానం..!

బాలీవుడ్‌లో ఎన్నో విభిన్నమైన సినిమాలను చేసిన ఆయుష్మాన్ ఖురానా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు.;

Update: 2025-06-28 23:30 GMT

ప్రతి సినీ కళాకారుడు, టెక్నీషియన్‌ ఏదో ఒక సమయంలో ఆస్కార్‌ కల కంటాడు. అలాంటి ఆస్కార్‌ను అందించే కమిటీలో చోటు దక్కడం అంటే మామూలు విషయం కాదు. ఆస్కార్‌ అవార్డులకు నటీనటులను ఎంపిక చేసే కమిటీలో ఉండే వారు ఎంతటి గొప్ప కళాకారులు, గొప్ప వ్యక్తులో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డుల అకాడమీ ఆఫ్‌ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్‌ సైన్సెస్‌లో చేరమని ఇండియన్‌ నటుడికి ఆహ్వానం రావడం జరిగింది. ఇండియాలోని గొప్ప నటీనటులకు ఈ అవకాశం లభించడం మనం చూస్తూ ఉంటాం. ఈ సారికి గాను బాలీవుడ్‌ స్టార్‌ నటుడు ఆయుష్మాన్‌ ఖురానాకు ఆహ్వానం దక్కింది. ఈ విషయాన్ని అకాడమీ అధికారికంగా ప్రకటించింది.

బాలీవుడ్‌లో ఎన్నో విభిన్నమైన సినిమాలను చేసిన ఆయుష్మాన్ ఖురానా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. నటుడిగానే కాకుండా తన సినిమాల ఎంపిక ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాడు. ఆయన చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నా.. చేసుకోకున్నా ఇండస్ట్రీలో ఆ సినిమా గురించి చర్చ జరగడం, ఆ సినిమా గురించి ప్రేక్షకుల్లో, విమర్శకుల్లో చర్చ జరగడం అనేది చాలా కామన్‌గా జరుగుతూ ఉంటుంది. అలాంటి సినిమాలు చేసినందుకు గాను ఆయనకు ఈ ప్రతిష్టాత్మక గౌరవం దక్కింది. ఆయన నటుడిగా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను సైతం అందుకున్నాడు.

ఆస్కార్‌ వంటి ప్రతిష్టాత్మక అవార్డ్‌లను అందించే అకాడమీ ఆఫ్ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌లో ఎంట్రీకి ఆయుష్మాన్‌కి ఛాన్స్ లభించింది అంటే కచ్చితంగా ఇది ఇండియన్ సినిమాకు దక్కిన గౌరవం అనడంలో సందేహం లేదు. ఇండియాకు ఆస్కార్‌ అవార్డ్‌లు అందని ద్రాక్ష అయింది. చిన్న దేశాలు, పెద్దగా గుర్తింపు లేని భాషల సినిమాలు కూడా ఆస్కార్‌లను దక్కించుకుంటూ ఉంటే ఇండియన్‌ సినిమాకు మాత్రం ఆస్కార్‌ అనేది రావడం లేదు. అకాడమీకి చెందిన మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్‌ సైన్సెస్‌లో చేరే అవకాశం ప్రతి భాషకు చెందిన ఇండస్ట్రీ వారికి లభిస్తూ ఉంటుంది. బాలీవుడ్‌ నుంచి ఆయుష్మాన్‌ ఖురానాకు దక్కడం అభినందనీయం.

విక్కీ డోనర్‌ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఇతడు పలు కమర్షియల్‌ విజయాలను సొంతం చేసుకున్నాడు. పంజాబ్‌కు చెందిన ఇతడు కెరీర్‌ ఆరంభంలో చాలా ఇబ్బందులు పడ్డాడు. పంజాబ్‌ విశ్వవిద్యాలయం నుంచి మాస్ కమ్యూనికేషన్స్‌ లో మాస్టర్స్ డిగ్రీ పొందాడు. కాలేజ్ రోజుల్లో స్టేజ్ షో లు చేయడంతో పాటు, స్ట్రీట్‌ డ్రామా షో లు చేశాడు. ఐఐటీ బాంబేకు చెందిన మూడ్‌ ఇండిగో, బిర్లా ఇన్సిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌ వంటి చోట్ల కూడా స్టేజ్‌ షో లు చేయడం ద్వారా గుర్తింపు దక్కించుకున్నాడు. ధర్మవీర్‌ భారతి రాసిన అంధ యుగ్‌ నాటకంలోనూ అశ్వద్ధామ పాత్రను పోషించి బెస్ట్‌ యాక్టర్‌గా అవార్డ్‌ సొంతం చేసుకున్నాడు.

Tags:    

Similar News