స్టార్‌డమ్ కొందరికే గుత్తసొత్తు కాదు!
ఏ నటుడి కంటే కూడా శ్రేష్ఠమైన కథ, స్క్రిప్ట్ మాత్రమే అసలైన స్టార్ అని ఆయుష్మాన్ పునరుద్ఘాటించారు. `స్టార్‌డమ్‌కు అందరికీ సరిపోయే ఒకే రకమైన సూత్రం ఉండదు.
ఒకప్పుడు పరిశ్రమలో స్టార్‌డమ్ అనేది పరిమిత సంఖ్యలో ఉన్న నటులకే సొంతం. కానీ నేటి డిజిటల్ యుగంలో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని బాలీవుడ్ స్టార్ నటుడు ఆయుష్మాన్ ఖురానా అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు , డిజిటల్ క్రియేటర్ల రాకతో వినోద ప్రపంచం వికేంద్రీకరణ చెందిందని పేర్కొ న్నారు. ఓ కార్యాక్రమంలో పాల్గొన్న ఆయుష్మాన్ నేటి వినోద రంగంలో మారుతున్న సమీకరణాలు - స్టార్‌డమ్ నిర్వచనంపై ఇలాంటి వ్యాఖ్యలు చేసారు.
ప్రస్తుతం మనం అనేక సమాంతర వినోద ప్రపంచాలలో జీవిస్తున్నాం. ఒకప్పుడు వెండితెర నటులనే ప్రతి ఒక్కరూ స్టార్లుగా గుర్తించేవారని, కానీ నేడు డిజిటల్ మాధ్యమాల్లో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా అంతే స్థాయి స్టార్‌డమ్‌ను అనుభవిస్తున్నారని గుర్తు చేశారు. ఈ క్రమంలో స్టార్‌డమ్ అనేది ఎవరికీ ప్రత్యేకమైన హక్కు కాదని.. అది పూర్తిగా సాపేక్షమైనదిగా మారిపోయిందని స్పష్టం చేశారు.
ఏ నటుడి కంటే కూడా శ్రేష్ఠమైన కథ, స్క్రిప్ట్ మాత్రమే అసలైన స్టార్ అని ఆయుష్మాన్ పునరుద్ఘాటించారు. `స్టార్‌డమ్‌కు అందరికీ సరిపోయే ఒకే రకమైన సూత్రం ఉండదు. కొందరు నటులు మీడియాకు దూరంగా, ఆడంబరాలకు అతీతంగా తమ ప్రపంచంలో ఉంటారు. కానీ నేను మాత్రం రేడియో జానీగా, టీవీ ప్రజెంటర్‌గా నా కెరీర్ ప్రారంభించాను కాబట్టి నిత్యం ప్రజలతో మమేకం కావడానికే ప్రాధాన్యత ఇస్తాను` అని తెలిపారు.
రూటెడ్ కథలతో సినిమాలు చేసే తమలాంటి కళాకారులకు వేర్వేరు వర్గాల ప్రజలతో మాట్లాడటం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రస్తుతం అన్ని పరిశ్రమలు వేగంగా రూపాంతరం చెందుతున్నాయని, కంటెంట్ ఎంత ఎక్కువగా లభిస్తున్నా? దానికి ప్రామాణికమైన విలువ తోడైనప్పుడే ప్రేక్షకులు ఆదరిస్తారని ఆయుష్మాన్ అభిప్రాయపడ్డారు. అంతులేని స్క్రోలింగ్ మాత్రమే కాకుండా ప్రేక్షకులలో భావోద్వేగాలను, ఆలోచనలను రేకెత్తించే ప్రామాణికమైన కథలకే రాబోయే రోజుల్లో ఆదరణ ఉంటుందని వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయుష్మాన్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ ల గురించి రివీల్ చేసారు. మళ్ళీ తన సొంత జానర్‌లోకి, కథల ప్రామాణికత వైపు అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్‌లో విడుదల కానున్న `ఉడ్తా తీర్`చిత్రంతో పాటు నవంబర్‌లో రాబోతున్న `యే ప్రేమ్ మోల్ లియా` సినిమాలు ప్రత్యేకమైనవిగా నిలుస్తాయని ధీమా వ్యక్తం చేసారు. తమ బలాన్ని నమ్ముకుని చేసే సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకులను అలరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
సమాజంలోని వివిధ వర్గాల నుండి వస్తున్న సరికొత్త టాలెంట్‌కు, నూతన క్రియేటర్లకు పరిశ్రమలో గొప్ప అవకాశాలు లభిస్తున్నాయని ఆయుష్మాన్ కొనియాడారు. సాంకేతికత అందుబాటులోకి రావడంతో ప్రతి ఒక్కరూ ప్రతిభను చాటుకోవడానికి వేదిక దొరికిందని ఇది భారతీయ వినోద పరిశ్రమ మరింత విస్తరించడానికి, ఆరోగ్యకరమైన పోటీ నెలకొనడానికి ఎంతగానో దోహదపడుతుందని స్పష్టం చేశారు.