నా బయోపిక్ ఐడియా నాకే నచ్చలేదు!
అయితే కాలక్రమేణా తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న పోరాటాలు, విజయాలు ఎంతోమంది యువతకు స్ఫూర్తినిస్తాయని భావించి ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వివరించారు.
హాలీవుడ్ తెరపై బాక్సింగ్ రింగ్‌లో చరిత్ర సృష్టించి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న లెజెండరీ నటుడు సిల్వెస్టర్ స్టాలిన్ . ఆయన కెరీర్‌లో `రాకీ` ,`రాంబో` వంటి చిత్రాలు ఏ స్థాయి సంచలనాలు సృష్టించాయో? చెప్పాల్సిన లేదు. అయితే ఇటీవల ఆయన జీవితం ఆధారంగా బయోపిక్ తెరకెక్కించే సన్నాహాలు జరుగుతుండగా మొదట ఈ ప్రాజెక్ట్ ఆలోచన తనకు అంతగా నచ్చలేదని సిల్వెస్టర్ స్టాలిన్ స్వయంగా వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో పంచుకోవడం హాలీవుడ్ వర్గాల్లో చర్చనీ యాంశమైంది.
తన జీవితంలోని ఒడిదుడుకులను, `రాకీ` సినిమా కోసం తాను పడిన కష్టాలను వెండితెరపై బయోపిక్‌గా తీయాలనే ఆలోచనను చిత్ర యూనిట్ తన ముందుకు తీసుకొచ్చినప్పుడు తాను వెంటనే అంగీకరించలేదని స్టాలిన్ తెలిపారు. ఒక వ్యక్తి సొంత జీవిత కథను తెరపై చూసుకోవడం అనేది అంత సులువైన విషయం కాదని, మొదట ఈ కాన్సెప్ట్ పట్ల తనకు కొద్దిగా సంకోచం, అయిష్టత ఉండేనని పేర్కొన్నారు. తన జీవితాన్ని ఒక సినిమాగా మలచడం వల్ల ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనే దానిపై ప్రారంభంలో సందేహాలు వ్యక్తం చేశారు.
అయితే కాలక్రమేణా తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న పోరాటాలు, విజయాలు ఎంతోమంది యువతకు స్ఫూర్తినిస్తాయని భావించి ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వివరించారు. ముఖ్యంగా ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి పడిన కష్టాలు, తిరస్కరణలు ఎదుర్కొని గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన వైనాన్ని నేటి తరానికి చేరవేయడంలో ఈ బయోపిక్ మంచి వేదికవుతుందని అభిప్రాయపడ్డారు. తన నిజ జీవితంలోని ఎమోషన్స్, సంఘర్షణలు ప్రేక్షకులను కచ్చితంగా కదిలిస్తాయని ధీమా వ్యక్తం చేసారు.
సిల్వెస్టర్ స్టాలిన్ కెరీర్ ప్రారంభం ఎంత కఠినంగా సాగిందో? తెలిసిందే. తన వద్ద ఉన్న స్క్రిప్ట్ `రాకీ`ని అమ్మడం కోసం ఆయన పడిన అష్టకష్టాలు, తన వద్ద ఉన్న కుక్కను కూడా అమ్ముకోవాల్సిన దయనీయ పరిస్థితి నుంచి హాలీవుడ్ బాక్సాఫీస్ రారాజుగా ఎదిగే వరకు ఆయన ప్రయాణం గొప్ప స్ఫూర్తిదాయక గాథ. ఇప్పుడు అదే కథను వెండితెరపై మరో కోణంలో ఆవిష్కరించే ప్రయత్నం జరుగుతుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ బయోపిక్‌కు సంబంధించి నటీనటులు, దర్శకుడి ఎంపిక ప్రక్రియ వేగంగా జరుగుతున్నట్లు సమాచారం. స్టాలిన్ యవ వయసులో పడిన కష్టాలు, శారీరక దారుఢ్యం, బాక్సింగ్ రింగ్‌లో పడే తపనను సరిగ్గా తెరపైకి తీసుకొచ్చేందుకు మేకర్స్ పకడ్బందీ ప్రణాళికలు రచిస్తున్నారు. స్వయంగా స్టాలిన్ కూడా ప్రాజెక్ట్‌కి సంబంధించిన కొన్ని కీలకమైన సలహాలు, సూచనలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.