26/11 ఉగ్రదాడి తర్వాత కోర్టులో ఏం జరిగింది?
ఆయన జీవితం, ముఖ్యంగా కసాబ్ విచారణ నేపథ్యాన్ని ఆధారంగా బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావు కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం 'ప్రహార్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఉజ్వల్ నికమ్'.
2008 నవంబర్ 26న జరిగిన ముంబై ఉగ్రదాడులు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన సంచలన ఘట్టం. ఈ దాడిలో సజీవంగా చిక్కిన ఏకైక ఉగ్రవాది అజ్మల్ కసాబ్‌కు చట్టపరంగా శిక్ష పడేలా చేయడంలో ప్రముఖ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ అత్యంత కీలక పాత్ర పోషించారు. ఆయన జీవితం, ముఖ్యంగా కసాబ్ విచారణ నేపథ్యాన్ని ఆధారంగా బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావు కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం `ప్రహార్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఉజ్వల్ నికమ్`. ఈ సినిమా మేకింగ్ ..26/11 తదుపరి జరిగిన కోర్టు విచారణలపై ఉజ్వల్ నికమ్ తాజాగా ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
26/11 దాడుల అనంతరం కోర్టు గదిలో అజ్మల్ కసాబ్‌పై జరిగిన విచారణ ప్రక్రియలో అసలు ఏం జరిగిందనే యథార్థాలను ఈ చిత్రం అత్యంత ప్రామాణికంగా ఆవిష్కరిస్తుందని ఉజ్వల్ నికమ్ పేర్కొన్నారు. సినిమా కథను అనవసర నాటకీయత కోసం ఎలాంటి అవాస్తవాలను జోడించలేదని స్పష్టం చేశారు. దేశం మొత్తం ఎంతో ఉత్కంఠతో వేచి చూసిన ఆ రోజుల్లో, కోర్టు కాంప్లెక్స్ లోపల జరిగిన వాస్తవ పరిణామాలను ఉన్నది ఉన్నట్లుగా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నామన్నారు.
ఈ చిత్రంలో ఉజ్వల్ నికమ్ పాత్రను పోషించిన జాతీయ అవార్డు గ్రహీత రాజ్‌కుమార్ రావు అభినయంపై ప్రశంసల వర్షం కురిపించారు. రాజ్‌కుమార్ రావు తన మేనరిజమ్, వాదనలు వినిపించే శైలి నడకతీరును పరిశీలించి ఆవాహన చేసుకున్నారని కొనియాడారు. ఒక లాయర్‌గానే కాకుండా సుదీర్ఘ విచారణ సమయంలో తాను అనుభవించిన ఒంటరితనం, మానసిక ఒత్తిడి, కుటుంబ జీవితాన్ని సమతుల్యం చేసుకున్న తీరును కూడా తెరపై రాజ్‌కుమార్ ఎంతో ప్రతిభావంతంగా ఆవిష్కరించారని తెలిపారు.
కసాబ్ కేస్ విచారణ సమయంలో పోలీసు అధికారులు , న్యాయ వ్యవస్థ ప్రదర్శించిన నిబద్ధతను నికమ్ ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. కసాబ్‌ను సజీవంగా పట్టుకున్న సమయంలో ముంబై పోలీసు అధికారి గోవిల్కర్ `ఇతడిని చంపకండి` అని చెప్పారని, దానికి కారణం భారతదేశం చట్టాన్ని , న్యాయ సూత్రాలను గౌరవించే దేశం కావడమేనని వివరించారు. ఉగ్రవాదికి కూడా చట్టబద్ధమైన అవకాశాలు కల్పిస్తూనే నిష్పాక్షిక విచారణ ద్వారా అతడి నేరాన్ని నిరూపించి శిక్ష పడేలా చేయడం భారతదేశ న్యాయ రంగానికి లభించిన గొప్ప విజయమన్నారు.
అవినాష్ అరుణ్ దర్శకత్వంలో దినేష్ విజన్‌కు చెందిన మ్యాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందిన కోర్టు రూమ్ డ్రామాలో రాజ్‌కుమార్ రావుతో పాటు వామికా గాబ్బి, జైదీప్ అహ్లావత్ కీలక పాత్రలు పోషించారు. ఉగ్రవాది కసాబ్ పాత్రలో ప్రముఖ మరాఠీ నటుడు లలిత్ ప్రభాకర్ నటించారు. రాజ్‌కుమార్ రావు ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా 9-10 కిలోల బరువు పెరిగి ప్రాసిక్యూటర్ రూపంలోకి మారడం విశేషం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.