స్టాక్ మార్కెట్లో IPOకి వెళుతున్న అగ్ర నిర్మాణ సంస్థ?
| మైత్రీ మూవీ మేకర్స్ ఐపీఓకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తోందంటూ టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. రూ.3,500 కోట్ల వాల్యుయేషన్ లక్ష్యంగా పబ్లిక్ ఇష్యూకు వెళ్లాలని భావిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. హైదరాబాద్ శివార్లలో 260 ఎకరాల్లో భారీ ఫిల్మ్ స్టూడియో నిర్మాణం, భారీ సినిమాల నిర్మాణం కోసం నిధులు సమీకరించాలనేది సంస్థ ప్రణాళికగా ప్రచారం జరుగుతోంది.
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు (ఐపీవో) సన్నాహాలు చేస్తోందన్న వార్తలు ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు వ్యాపార వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నేతృత్వంలోని ఈ ప్రముఖ బ్యానర్ ఏకంగా 3,500 కోట్ల వాల్యుయేషన్‌ను లక్ష్యంగా చేసుకుని పబ్లిక్ ఇష్యూకు వెళ్లే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
2015లో `శ్రీమంతుడు` సినిమాతో ప్రస్థానం ప్రారంభించి రంగస్థలం, పుష్ప, పుష్ప 2 లాంటి ఇండస్ట్రీ హిట్లతో అగ్రస్థానానికి చేరుకున్న మైత్రీ ఇప్పుడు కార్పొరేట్ దిశగా వేస్తున్న ఈ భారీ అడుగుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్టాక్ మార్కెట్ నిబంధనల ప్రకారం పబ్లిక్ ఇష్యూకు వెళ్లాలంటే ముందుగా సంస్థాగత నిర్మాణంలో కీలక మార్పులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం `మైత్రీ మూవీ మేకర్స్ ఎల్‌ఎల్‌పీ`గా కొనసాగుతున్న ఈ సంస్థ సెబీ నిబంధనలకు అనుగుణంగా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారే ప్రక్రియపై అంతర్గతంగా కసరత్తు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
కేవలం సినిమాల నిర్మాణానికే పరిమితం కాకుండా.. నైజాం - ఆంధ్రప్రదేశ్‌లలో బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను.. వందలాది సింగిల్ స్క్రీన్ థియేటర్ల లీజు నిర్వహణను ఇప్పటికే తన గుప్పిట్లోకి తెచ్చుకున్న మైత్రీ.. ఈ కార్పొరేట్ మార్పుతో మరింత విస్తరించాలని భావిస్తున్నట్టు కథనాలొస్తున్నాయి. ఐపీఓ ద్వారా సమీకరించే భారీ నిధులను మౌలిక సదుపాయాల కల్పన.. భారీ చిత్రాల నిర్మాణానికి మళ్లించాలనేది సంస్థ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ శివార్లలో దాదాపు 260 ఎకరాల భూమిని సేకరించి.. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఒక భారీ ఫిల్మ్ స్టూడియోను నిర్మించాలని మైత్రీ ప్రణాళికలు రచిస్తోంది. అత్యాధునిక వీఎఫ్ఎక్స్, సౌండ్ రికార్డింగ్, డబ్బింగ్ వంటి అన్ని పోస్ట్-ప్రొడక్షన్ సదుపాయాలు ఒకే చోట ఉండేలా నిర్మించనున్న ఈ స్టూడియో.. భవిష్యత్తులో సంస్థకు స్థిరమైన ఆదాయ వనరుగా మారుతుందని అంచనా.
మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ చేతిలో ప్రస్తుతం టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత భారీ పాన్-వరల్డ్ లైనప్ సిద్ధంగా ఉంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న `ఫౌజీ` కోసం దాదాపు 400 కోట్లు వెచ్చించిందని కథనాలొస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న డ్రాగన్ కోసం దాదాపు 350 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తోంది. రామ్ చరణ్‌తో తదుపరి సినిమా కోసం దాదాపు 350 కోట్లు వెచ్చిస్తోంది. వందల కోట్ల విలువైన చిత్రాలు ఈ సంస్థ ఖాతాలో ఉన్నాయి. ఇటీవలే ఇరుముడితో బ్లాక్ బస్టర్ అందుకుని.. బాక్సాఫీస్ వద్ద తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.
ప్రస్తుతం పెట్టుబడులను సమీకరించే పనిలో ఉందని కథనాలొస్తున్నాయి. ప్రతిపాదిత 260 ఎకరాల స్టూడియో ఆస్తులు .. బలమైన థియేటర్ల నెట్‌వర్క్ కార్యరూపం దాల్చితే మైత్రీ ఐపీఓ టాలీవుడ్‌ను కొత్త కార్పొరేట్ శకంలోకి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
గతంలో ఇలాంటి ప్రయత్నం లేదు:
అయితే టాలీవుడ్ లో ఐదు దశాబ్ధాల చరిత్ర ఉన్న సురేష్ ప్రొడక్షన్స్ గానీ, గీతా ఆర్ట్స్ గానీ స్టాక్ మార్కెట్‌లో లిస్టెడ్ కంపెనీలు కావు.. అలాగే ఇవి ఇప్పటివరకు ఐపీవోకి కూడా వెళ్లలేదు. తెలుగు సినీ పరిశ్రమలో ఇవి అతిపెద్ద నిర్మాణ సంస్థలుగా.. పంపిణీ సంస్థలుగా పేరున్నా.. వీటి వ్యాపార నిర్వహణ ప్రధానంగా ప్రైవేట్ సంస్థలు..భాగస్వామ్య సంస్థల రూపంలోనే కొనసాగుతోంది. భారతదేశంలో చాలా ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు తమ సినిమాల విజయాలు.. బాక్సాఫీస్ వసూళ్లు.. రియల్ ఎస్టేట్ లేదా ఇతర అనుబంధ వ్యాపారాల ఆధారంగా పనిచేస్తాయి తప్ప పబ్లిక్ షేర్ల జారీ ద్వారా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ కావడం చాలా అరుదు.