చిరు పేరులో ఓ అక్షరం మాయం.. అసలు కథ ఇదే!
| హైదరాబాద్‌లో చిరంజీవి సిల్హౌట్‌తో ఏర్పాటు చేసిన హోర్డింగ్ ఆసక్తి రేపుతోంది. అందులో ‘CHIRANJEEVI’ పేరులో ‘N’ అక్షరాన్ని ఉద్దేశపూర్వకంగా తొలగించి ‘CHIRA_JEEVI’గా ముద్రించారు. ఇది నెట్‌ఫ్లిక్స్ రూపొందిస్తున్న ‘చిరంజీవీస్ మెగావర్స్’ టాక్ షో ప్రమోషన్‌గా తెలుస్తోంది. నవంబర్ 30న గ్రాండ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు ప్రచారం జరుగుతున్నా, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
హైదరాబాద్ లోని ఓ బిల్డింగ్ పై సెట్ చేసిన భారీ హోర్డింగ్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ తో పాటు దారిన వెళ్లే వాళ్లను కూడా ఎట్రాక్ట్ చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి వెనక్కి తిరిగి నిలబడి ఉన్న సిల్హౌట్ ఫొటో, పక్కనే పెద్ద అక్షరాలతో ఆయన పేరు ప్రింట్ చేసి ఉన్నాయి. కానీ ఆ పేరును కాస్త దగ్గరగా చూస్తే స్పెల్లింగ్ లో ఏదో తేడా కొడుతోంది. పోస్టర్ మీద సినిమా టైటిల్ లేదు, రిలీజ్ డేట్ అసలే లేదు.
నార్మల్ వ 'CHIRANJEEVI' అని ఉండాల్సిన చోట, మధ్యలో 'N' లేకుండా 'CHIRA_JEEVI' అని ఖాళీ వదిలేశారు. ఆ ఒక్క అక్షరాన్ని మాయం చేయడమే ఇక్కడ అసలు మ్యాజిక్. నెట్‌ఫ్లిక్స్ లోగో కూడా 'N' కావడంతో, ఆ ఓటీటీ సంస్థే ఈ వెరైటీ ప్రమోషన్ ప్లాన్ చేసిందని అనిపిస్తోంది. హోర్డింగ్ పై ఎక్కడా నెట్‌ఫ్లిక్స్ పేరు వాడకుండా, కేవలం ఒక్క అక్షరంతో క్యూరియాసిటీ పెంచడం ఆకట్టుకుంటోంది. అక్టోబర్ ఆఖర్లో నెట్‌ఫ్లిక్స్ అనౌన్స్ చేసిన 'చిరంజీవీస్ మెగావర్స్' షో కోసమే ఈ అవుట్ డోర్ క్యాంపెయిన్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
మెగాస్టార్ పేరుతో ఇలాంటి హడావుడి కనిపించగానే చాలామంది కొత్త సినిమా అప్డేట్ అనుకున్నారు. కానీ ఇది వెండితెర ప్రాజెక్ట్ కాదు, ఓటీటీ కోసం రెడీ అవుతున్న సెలబ్రిటీ టాక్ షో. టాలీవుడ్ లో తనతో కలిసి ప్రయాణం చేసిన నటులు, సినీ ప్రముఖులతో చిరంజీవి డైరెక్ట్ గా కూర్చుని ముచ్చటించనున్నారు. ఆనాటి షూటింగ్ జ్ఞాపకాలు, బయటకు తెలియని తెరవెనుక కబుర్లను ఈ షో ద్వారా ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు.
గతంలో చిరంజీవి 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షోకి హోస్ట్ గా చేసిన సంగతి తెలిసిందే. అయితే అది ప్రశ్నలు, ప్రైజ్ మనీ చుట్టూ తిరిగే గేమ్ షో. 'మెగావర్స్' మాత్రం పూర్తిగా సినీ ప్రముఖులతో సరదా సాగే చిట్ చాట్, ఎమోషనల్ జ్ఞాపకాలతో సాగే షో అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ షో షూటింగ్ మొదలవగా, బ్రహ్మానందం, సునీల్, సత్య పాల్గొన్న ఒక స్పెషల్ ఎపిసోడ్ చిత్రీకరణ కూడా పూర్తయినట్లు సమాచారం.
ఈ ప్రాజెక్ట్ ను గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్, ఆటమ్ మీడియా వెంచర్స్, సోల్ ప్రొడక్షన్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. మరోవైపు నవంబర్ 30న హైదరాబాద్ లో 'మెగావర్స్' గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిలింనగర్ లో ప్రచారం జరుగుతోంది. అదే రోజున షో ఫస్ట్ ప్రోమోతో పాటు స్ట్రీమింగ్ డేట్ ను కూడా ప్రకటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. షోలో పాల్గొనబోయే మిగతా గెస్ట్ లిస్ట్ ను కూడా టీమ్ సస్పెన్స్ లోనే ఉంచింది.