కెమెరాల మధ్య స్టేజ్‌పై ఏం జరిగింది?
| ముంబైలో జరిగిన ‘గ్లోబల్ పీస్ ఆనర్స్ 2026’ కార్యక్రమంలో షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే మధ్య ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. షారుఖ్ షూ దగ్గర ప్యాంటు చిక్కుకోవడంతో విక్రాంత్ వెంటనే వంగి దాన్ని సరిచేశారు. దీనికి స్పందించిన షారుఖ్ ఆప్యాయంగా విక్రాంత్‌ను దగ్గరకు తీసుకుని వీపు తట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వెండితెరపై కోట్లాది మందిని అలరించే స్టార్ హీరోలు బహిరంగ వేదికలపై తోటి నటులతో ఎంత సాధారణంగా ఆప్యాయంగా మెలుగుతారో చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి ఓ హృద్యమైన ఆత్మీయ సన్నివేశం తాజాగా ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా వేదికగా జరిగిన `గ్లోబల్ పీస్ ఆనర్స్ 2026` కార్యక్రమంలో ఆవిష్కృతమైంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ - విలక్షణ నటుడు విక్రాంత్ మాస్సే మధ్య కెమెరాల కళ్ల ముందు జరిగిన ఓ చిన్న ఘటన సోషల్ మీడియాలో అందరి హృదయాలను హత్తుకుంటుంది.
బోమన్ ఇరానీ ఆహ్వానంతో షారుఖ్ ఖాన్.. విక్రాంత్ మాస్సే ఇద్దరూ వేదికపైకి వచ్చి మాట్లాడేందుకు సిద్ధమ వుతున్నారు. సరిగ్గా ఆ సమయంలో షారుఖ్ ప్యాంటు కింది భాగం ఎడమ కాలి షూ దగ్గర చిక్కుకుని ఉండటాన్ని విక్రాంత్ గమనించారు. ఏమాత్రం తటపటాయించకుండా వెంటనే కిందకు వంగి ఎంతో గౌరవంగా జాగ్రత్తగా ఆ ప్యాంటు చిక్కును సరిచేశారు.
విక్రాంత్ చేసిన చిన్న సాయానికి షారుఖ్ ఖాన్ ముఖంలో చిరునవ్వు విరిసింది. వెంటనే విక్రాంత్‌ను ఒక చేత్తో ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని వీపు తడుతూ కృతజ్ఞత తెలిపారు. పక్కనే ఉన్న బోమన్ ఇరానీ కూడా ఈ దృశ్యాన్ని చూసి నవ్వుతూ కనిపించగా ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్‌ను చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇదే వేదికపై మరో ఆసక్తికర దృశ్యం కూడా చోటుచేసుకుంది. షారుఖ్ ఖాన్ సిగ్నేచర్ పోజ్‌ను విక్రాంత్ మాస్సే బోమన్ ఇరానీలకు నేర్పిస్తూ వేదికపై సందడి చేశారు. అలాగే తన ప్రసంగంలో 26/11 ముంబై దాడులు.. పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు నివాళులు అర్పించారు. హింస కంటే చర్చలే ముఖ్యమని సామాన్యుడి శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదని చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి.
షారుఖ్.. విక్రాంత్ మధ్య ఇంతటి సాన్నిహిత్యం ఉండటానికి మరో నేపథ్యం కూడా ఉంది. 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో `జవాన్` కోసం షారుఖ్ `12th ఫెయిల్` కోసం విక్రాంత్ ఉత్తమ నటులుగా నిలిచారు. అంతేకాక 2022లో వచ్చిన విక్రాంత్ సినిమా `లవ్ హాస్టల్‌ను` షారుఖ్‌కు చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన విషయం తెలిసిందే.
ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటిస్తోన్న యాక్షన్ చిత్రం `కింగ్` డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దానికి ముందు డిసెంబర్ 14న ట్రైలర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.