డ్యాన్స‌ర్స్ వివాదం :ఫెడ‌రేష‌న్ అధ్య‌క్షుడిపై జానీ మాస్ట‌ర్ వ‌ర్గం ప్ర‌తిదాడి!

గతంలో జరిగిన ఫెడరేషన్ ఎన్నికల ప్రక్రియను.. నిబంధనలను ఈ సందర్భంగా వారు ఉదహరించారు.

Update: 2026-09-30 09:51 GMT

టాలీవుడ్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు .. కార్మికుల సంఘాల మధ్య వివాదాలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని వ్యవహారశైలిని ..ఆయన నిర్ణయాలను తప్పుబడుతూ జానీ మాస్టర్ మద్దతుదారులు బహిరంగంగానే సవాళ్లు విసురుతుండ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఫిల్మ్ ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్ ఫెడరేషన్ నిబంధనలు, చిత్రపురి కాలనీలో జరుగుతున్న పరిపాలనపరమైన అంశాల నేపథ్యంలో ఈ వ్యతిరేకత మరింత ఊపందుకుంది. జానీ మాస్టార్ వ‌ర్సెస్ శేఖ‌ర్ మాస్టార్ వివాదంగా ప్ర‌చారంలో ఉన్న ఈ ఇష్యూ అంత‌కంత‌కు పెద్ద‌ద‌వుతుండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

జానీ మాస్టర్ సెట్లలో కొరియోగ్రఫీ చేయడంపై నాన్-కోఆపరేషన్ లేదా ఇతర ఆంక్షలు విధించే అధికారం ఎవరికీ లేదని ఆయన మద్దతుదారులు ప్ర‌తిదాడికి దిగారు. ఆ మేర‌కు ఫెడ‌రేష‌న్ అధ్యక్షుడి నిర్ణ‌యాల‌ను భేఖాతర్ చేయ‌డం చ‌ర్చ‌గా మారింది. చేతనైతే నేరుగా సెట్లకు వచ్చి ఆపుకోవాలని వారు ఫెడ‌రేష‌న్ అధ్య‌క్షుడు అనిల్ వల్లభనేనికి సవాల్ విసిరారు. జానీ మాస్టర్ తన ప్రతిభతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని.. ఆయనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

గతంలో జరిగిన ఫెడరేషన్ ఎన్నికల ప్రక్రియను.. నిబంధనలను ఈ సందర్భంగా వారు ఉదహరించారు. గత ఎన్నికల్లో అనిల్ వల్లభనేనికి వ్యతిరేకంగా పోటీ చేసిన చిట్టినేని కిషోర్ బాబుకు ఏకంగా 21 ఓట్లు వచ్చాయని గుర్తుచేశారు. నిబంధనల ప్రకారం ఎవరైనా వ్యక్తి 48 గంటలు లేదా నిర్దిష్ట కాలం జైలులో ఉంటేనే ఫెడరేషన్ అధ్యక్ష పదవికి అనర్హులవుతారనే నిబంధనలు బైలాలో ఉన్నాయని.. అలాంటిది సుదీర్ఘకాలం జైలు వాతావరణాన్ని ఎదుర్కొన్న వ్యక్తి ఆ పదవిలో ఎలా కొనసాగుతారని వారు తీవ్రంగా ప్రశ్నించారు.

మరోవైపు చిత్రపురి కాలనీకి సంబంధించిన అవకతవకలపై చిత్రపురి సాధన సమితి 24 క్రాఫ్ట్స్ కార్మికులు, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ.. తెలంగాణ సినిమా వేదిక ప్రతినిధులు సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో ఉన్న వేలాది కుటుంబాల సంక్షేమం, నిధుల నిర్వహణ.. రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌ల విషయంలో పారదర్శకత ఉండాలని డిమాండ్ చేస్తూ తెలుగు ఫిలిం ఛాంబర్ సెక్రెటరీ అశోక్ కుమార్‌కు అధికారికంగా మెమోరండం కూడా సమర్పించారు.

మొత్తంగా చూస్తే.. ఫెడరేషన్ నాయకత్వం అనుసరిస్తున్న తీరుపై కార్మిక వర్గాల నుంచి.. ప్రముఖ కొరియోగ్రాఫర్ మద్దతుదారుల నుంచి వ్యతిరేకత పెరుగుతుండ‌డంపై చ‌ర్చ సాగుతోంది. సంఘంలోని నిబంధనల అమలులో పక్షపాత ధోరణి వీడాలని.. అందరికీ సమానన్యాయం జరిగేలా పెద్దలు జోక్యం చేసుకుని ఈ వివాదాలకు శాశ్వత పరిష్కారాలు చూపాలని సినీ వర్గాలు కోరుతున్నాయి.

Tags:    

Similar News