అవతార్-3.. ప్రేక్షకులు భయపడుతున్నారా?
2009లో వచ్చిన ‘అవతార్’ సినిమా చూసి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.;
2009లో వచ్చిన ‘అవతార్’ సినిమా చూసి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. అప్పటిదాకా ఉన్న వరల్డ్ బాక్సాఫీస్ రికార్డులన్నీ ఆ సినిమా బద్దలు కొట్టేసింది. ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లి అద్భుతమైన అనుభూతిని పంచాడు జేమ్స్ కామెరూన్. ఆ సినిమాకు సంబంధించి ప్రతిదీ కొత్తగా అనిపించింది. విజువల్ మాయాజాలానికి తోడు.. హృదయాన్ని హత్తుకునే కథాంశంతో ప్రేక్షకులను కట్టిపడేశాడు కామెరూన్.
ఆ సినిమా సాధించిన విజయంతో ఉప్పొంగిపోయిన కామెరూన్ ఏకంగా నాలుగు సీక్వెల్స్ ప్రకటించాడు. ఇలా ఒక సినిమాకు ఒకేసారి నాలుగు సీక్వెల్స్ ప్రకటించడం.. వాటి రిలీజ్ డేట్లు కూడా ముందే ఇచ్చేయడం ప్రపంచ సినిమా చరిత్రలో అదే తొలిసారి. ఈ ఫ్రాంఛైజీలో భాగంగా అవతార్-2 మూడేళ్ల ముందు రిలీజైంది. కానీ అది అంచనాలను అందుకోలేకపోయింది. కథ, పాత్రలు కొత్తగా అనిపించలేదు. విజువల్‌గా కూడా ఆశ్చర్యం ఏమీ కలగలేదు. సుదీర్ఘ నిడివితో సాగిన సినిమా ప్రేక్షకులకు బోర్ కొట్టించింది.
‘అవతార్’ ఫ్రాంఛైజీలో రెండో సినిమా చూసేసరికే ప్రేక్షకులకు మొహం మొత్తేసినట్లు అనిపించింది. ఓవర్ డోస్ ఫీల్ కూడా వచ్చింది. అందుకేనేమో ‘అవతార్-3’ విషయంలో పెద్దగా ఎగ్జైట్మెంట్ కనిపించడం లేదు. బుకింగ్స్ చూస్తే ఆ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ‘అవతార్-2’ ట్రైలర్ అంత గొప్పగా లేకపోయినా.. రిలీజ్ టైంలో అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజిలో జరిగాయి. ఇండియాలో మంచి ఊపు కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా షోలు ముందే సోల్డ్ ఔట్ అయిపోయాయి.
కానీ ‘అవతార్-3’ విషయంలో ఆ జోరు కనిపించడం లేదు. రిలీజ్‌కు ఇంకో రెండు రోజులే గ్యాప్ ఉండగా.. హైదరాబాద్‌లో పరిమిత సంఖ్యలో ఉన్న ఇంగ్లిష్ 4డీ ఎక్స్ షోలు మాత్రమే సోల్డ్ ౌట్ అయ్యాయి. ఇంగ్లిష్ 3డీ షోలు కొన్నింటికి ఆక్యుపెన్సీలు బాగున్నాయి. ఇంగ్లిష్ 2డీ, తెలుగు 3డీ, 2డీ షోలకు స్పందన ఆశించిన స్థాయిలో లేదు.
‘అవతార్-2’కే జనాలకు ఒక రకమైన మొనాటనస్ ఫీలింగ్ కలగడం, సుదీర్ఘ నిడివిని తట్టుకోలేకపోవడం.. ఇంకోసారి అలాంటి కథనే మూడు గంటలకు పైగా నిడివితో చూడడానికి భయపడుతున్నట్లు కనిపిస్తోంది. పార్ట్-2తో పోలిస్తే పార్ట్-3 చాలా బాగుందనే టాక్ వస్తే.. విజువల్స్ అద్భుతమని టాక్ వస్తే అప్పుడు ‘అవతార్-3’ పుంజుకుంటుందేమో కానీ.. ప్రస్తుతమైన ప్రేక్షకుల్లో ఈ చిత్రం పట్ల అంతగా ఎగ్జైట్మెంట్ లేదని స్పష్టమవుతోంది. ‘అవతార్-3’కి భయపడి ఈ వారం తెలుగులో పేరున్న సినిమాలేవీ రిలీజ్ చేయకపోవడం పొరపాటే అనిపిస్తోంది.