కోలీవుడ్ టు టాలీవుడ్.. బార్డర్స్ చెరిపేస్తున్న డైరెక్టర్లు
టాలీవుడ్, కోలీవుడ్ మధ్య ఉన్న గీత ఎప్పుడో చెరిగిపోయింది. ఒకప్పుడు తమిళ డబ్బింగ్ సినిమాలు మాత్రమే మన దగ్గర ఆడేవి.;
టాలీవుడ్, కోలీవుడ్ మధ్య ఉన్న గీత ఎప్పుడో చెరిగిపోయింది. ఒకప్పుడు తమిళ డబ్బింగ్ సినిమాలు మాత్రమే మన దగ్గర ఆడేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. డైరెక్ట్ గా అక్కడి స్టార్ డైరెక్టర్లు మన హీరోలతో సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నారు. అదే సమయంలో మన దర్శకులు కూడా చెన్నైలో జెండా పాతేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ డైరెక్టర్ల షిఫ్టింగ్ వ్యవహారం ఇప్పుడు సౌత్ ఇండియాలో హాట్ టాపిక్.
ముఖ్యంగా దళపతి విజయ్ స్కూల్ నుంచి వచ్చిన ముగ్గురు క్రేజీ డైరెక్టర్లు ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్ ను టార్గెట్ చేశారు. అట్లీ, నెల్సన్, లోకేష్ కనకరాజ్.. ఈ పేర్లు వింటేనే మాస్ ఆడియన్స్ కు పూనకాలు వస్తాయి. ఇప్పుడు వీరంతా మన తెలుగు హీరోలతో భారీ ప్రాజెక్టులకు స్కెచ్ వేయడం ఇండస్ట్రీలో ఆసక్తికర పరిణామం. "మా డైరెక్టర్లు అందరూ వెళ్లిపోతే తమిళ సినిమా పరిస్థితి ఏంటి?" అని అక్కడి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అట్లీ ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇక 'జైలర్ 2' తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోవైపు లోకేష్ కనకరాజ్ ఏకంగా టాలీవుడ్ స్టార్స్ కోసం కథలు సిద్ధం చేస్తున్నాడట. గతంలో కమల్, రజినీలకు వినిపించిన కథలతోనే ఇక్కడ మన స్టార్స్ తో ప్రయోగాలు చేయబోతున్నాడని ఇండస్ట్రీ టాక్.
కానీ ఇది కేవలం వన్ వే ట్రాఫిక్ కాదు. మన తెలుగు డైరెక్టర్లు కూడా అక్కడ సత్తా చాటుతున్నారు. వెంకీ అట్లూరి, శేఖర్ కమ్ముల లాంటి వారు ధనుష్ తో సినిమాలు చేసి మెప్పించారు. గతంలో వంశీ పైడిపల్లి ఏకంగా దళపతి విజయ్ తో 'వారసుడు' తీసి హిట్టు కొట్టారు. ఒకప్పుడు మురుగదాస్, గౌతమ్ మీనన్ మన హీరోలతో చేసినట్లు.. ఇప్పుడు మన వాళ్ళు అక్కడ మార్కెట్ క్రియేట్ చేస్తున్నారు. నాగవంశీ లాంటి నిర్మాతలు కూడా కార్తీ, సూర్యలను మన డైరెక్టర్లతో లాక్ చేస్తున్నారు.
నిజానికి ఈ మార్పు పాన్ ఇండియా మార్కెట్ కు చాలా అవసరం. రొటీన్ కాంబినేషన్లు కాకుండా, ఇలా క్రాస్ ఓవర్ సినిమాలు వస్తేనే బిజినెస్ రేంజ్ పెరుగుతుంది. ధనుష్, సూర్య, కార్తీ లాంటి హీరోలు మన డైరెక్టర్ల ఎమోషన్స్ ను నమ్ముతుంటే.. మన స్టార్స్ తమిళ మాస్ డైరెక్టర్ల స్టైలిష్ టేకింగ్ కు ఫిదా అవుతున్నారు. రెండు వైపులా టాలెంట్ ఎక్స్ఛేంజ్ హెల్దీగా జరుగుతోంది.
మొత్తానికి భాషతో సంబంధం లేకుండా కంటెంట్ ఉన్నోడిదే రాజ్యం అని ఈ ట్రెండ్ నిరూపిస్తోంది. విజయ్ బాయ్స్ ఇక్కడ దుమ్ములేపడానికి వస్తుంటే, మన తెలుగు మేకర్స్ అక్కడ సత్తా చాటుతున్నారు. ఈ ఇచ్చిపుచ్చుకునే విధానం వల్ల రాబోయే రోజుల్లో సౌత్ సినిమా రేంజ్ మరింత పెరగడం ఖాయం.