ఇ- సిగరెట్లు కోలాలు తాగించే స్టార్లు ప్రమాదం
కింగ్ ఖాన్ షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన ది బా*** డ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్ విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే.;
కింగ్ ఖాన్ షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన ది బా*** డ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్ విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. నెట్ ఫ్లిక్స్ లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ కథాంశం ఆసక్తిని రేకెత్తించింది. బాలీవుడ్ సెలబ్రిటీలపై సెటైరికల్ కామెడీ కథతో ఆర్యన్ దీనిని అద్భుతంగా తెరకెక్కించాడని, ఒక డెబ్యూ దర్శకుడిగా పెద్ద సక్సెసయ్యాడని ప్రశంసలు కురుస్తున్నాయి.
అయితే ఇలాంటి సమయంలో ఊహించని ఒక వివాదం తెరపైకొచ్చింది. ఈ సిరీస్ లో ఒక సన్నివేశంలో రణబీర్ కపూర్ ఎటువంటి హెచ్చరిక లేదా నిరాకరణ లేకుండా ఇ-సిగరెట్ తాగుతున్నట్లు కనిపించిందని ఫిర్యాదు అందింది. ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ చట్టం, 2019కి విరుద్ధంగా ఇ-సిగరెట్ల ప్రకటనలో కనిపించినందుకు రణబీర్ కపూర్, వెబ్ షో నిర్మాతలు, నెట్‌ఫ్లిక్స్‌పైనా కేసు నమోదు చేయాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ముంబై పోలీసులను కోరింది.
ఇ- సిగరెట్లలో నిషేధిత పదార్థాల వాడకం ప్రమాదకరంగా పెరుగుతుందని, తద్వారా యువతరం చెడిపోతుందని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటువంటి బాధ్యతారహిత కంటెంట్ చట్టవిరుద్ధ కార్యకలాపాలను ప్రోత్సహిస్తుందని ప్రజారోగ్యానికి ముప్పు తెచ్చే అనైతిక ప్రచారమిదని ఫిర్యాదు దారు ఆందోళన వ్యక్తం చేసారు. యువతరాన్ని తప్పుగా ప్రభావితం చేసే అటువంటి కంటెంట్‌ను వెంటనే నిషేధించాలని, తగిన చర్యలు తీసుకోవాలని కమిషన్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శికి నోటీసు జారీ చేసింది. ఎలక్ట్రానిక్ సిగరెట్ల తయారీదారులు, దిగుమతిదారుల గుర్తింపు, కార్యకలాపాలపై దర్యాప్తు ప్రారంభించాలని ముంబై పోలీసు కమిషనర్‌ను కోరారు. రెండు వారాల్లోగా దీనిపై రిపోర్టులు పంపాలని కూడా కమీషనర్ గడువు విధించారు.
అయితే ఇ సిగరెట్ ముప్పును బాగానే పసిగట్టినా కానీ, కోలాల అమ్మకాలపై మాత్రం కట్టడి లేకపోవడాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కోలాల్లో పెస్టిసైడ్ వేయనిదే నిల్వ చేయలేని దుస్థితి. పెస్టిసైడ్ ప్రభావం మనుషులపై అంతా ఇంతా కాదు. అయినా యథేచ్ఛగా కోలా డ్రింకు అమ్మకాల్ని బహిరంగ మార్కెట్లో సాగిస్తున్నారు. దీనిపైనా ప్రభుత్వాలు దృష్టి సారించాలని కోరుకుంటున్నారు.