దీపావళి బరిలో యంగ్ హీరోలు.. రేసు నుంచి తప్పుకున్న పెద్ద హీరోలు..!

Update: 2021-10-12 15:30 GMT
కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల ప్రభావం తర్వాత వస్తున్న మొదటి పెద్ద పండుగ దసరా సీజన్ లో పెద్ద హీరోల సినిమాలు - పాన్ ఇండియా చిత్రాలు రిలీజ్ అవుతాయని అందరూ భావించారు. కానీ ఆల్ ఓవర్ ఇండియా థియేట్రికల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని భారీ ప్రాజెక్ట్స్ ఏవీ ముందుకు రాలేదు. దీన్ని కొన్ని క్రేజీ మూవీస్ క్యాష్ చేసుకోడానికి వస్తున్నాయి. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' 'మహా సముద్రం' 'పెళ్లి సందD' సినిమాలు దసరా కు సిద్ధం అయ్యాయి.

ఈ క్రమంలో రాబోయే దీపావళి పండుగకైనా పెద్ద హీరోల సినిమాలు థియేటర్లలోకి వస్తాయని ప్రేక్షకులు అనుకున్నారు. అయితే ప్రస్తుతానికి యువ హీరోలు మాత్రమే బరిలో దిగుతున్న తెలుస్తోంది. ఇన్నాళ్లూ భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అవుతాయని ప్రచారం జరిగినా.. ఇప్పుడు రేసు నుంచి స్టార్ హీరోలు తప్పుకున్నట్లు సూచనలు వస్తున్నాయి. దీపావళి కి వస్తానని చెప్పిన మెగా హీరో వరుణ్ తేజ్ 'గని' వాయిదా పడింది. దీంతో ఈసారి చిన్న మీడియం రేంజ్ సినిమాలే ప్రేక్షకులకు వినోదాన్ని అందించబోతున్నాయని అర్థం అవుతోంది.

ఇప్పటి వరకు 'మంచి రోజులు వచ్చాయి' 'రొమాంటిక్' వంటి చిత్రాలను మాత్రమే దీపావళి కి విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో 'ఏక్ మినీ కథ' ఫేమ్ సంతోష్ శోభన్ - 'ఎఫ్ 2' బ్యూటీ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ''మంచి రోజులు వచ్చాయి''. వాస్తవ సంఘటన ఆధారంగా ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ రూపొందుతోంది. యూవీ కాన్సెప్ట్స్ మరియు మాస్ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి సెల్యులాయిడ్ - SKN నిర్మాతలు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాని నవంబర్ 4న థియేట్రికల్ రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు.

అలానే పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటించిన ''రొమాంటిక్'' చిత్రాన్ని కూడా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఇటీవలే ప్రకటించారు. పూరీ శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి పూరీ కథ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించడం విశేషం. ఇందులో ఆకాశ్ కు జోడీగా కేతిక శర్మ నటించింది. పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ - పూరీ కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాధ్ - ఛార్మి కౌర్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం కరోనా కారణంగా ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తోంది. దీపావళి బరిలో పెద్ద హీరోల సినిమాలేవీ లేకపోవడంతో థియేటర్లలోకి రావడానికి సిద్ధం అయింది.

ఇప్పుడు ఈ రెండు సినిమాలతో పాటుగా యువ హీరో నాగ శౌర్య - రీతూ వర్మ జంటగా నటించిన ''వరుడు కావలెను'' సినిమా కూడా పండుగకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇంతకముందు మేకర్స్ ప్రకటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ చిత్రాన్ని దసరా రేసు నుంచి తప్పించే ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. దీపావళి బరిలో పెద్ద హీరోల సినిమాలు రాకపోతే.. నవంబర్ 4వ తేదీని ఈ మూవీ కోసం లాక్ చేయాలని చూస్తున్నారట.

ఒకవేళ నందమూరి బాలకృష్ణ 'అఖండ' - మాస్ మహారాజ రవితేజ 'ఖిలాడి' చిత్రాలు కానీ దీపావళి కి రావాలని చూస్తే అక్టోబర్ 29న నాగశౌర్య చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఈసారి ఫెస్టివల్ సీజన్ లో ఎక్కువ శాతం చిన్న మీడియం రేంజ్ సినిమాలే వస్తాయని తెలుస్తోంది. సంతోష్ శోభన్ - ఆకాష్ పూరీ - నాగశౌర్య వంటి టాలీవుడ్ కుర్ర హీరోలే బరిలో దిగనున్నారు. వీరితో పాటుగా 'అన్నాత్తే 'ఎనిమీ' 'ది లూప్' వంటి డబ్బింగ్ సినిమాలు కూడా నవంబర్ ఫస్ట్ వీక్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. త్వరలోనే దీపావళి సినిమాలపై స్పష్టత రానుంది.


Tags:    

Similar News