యూవీ గూటికి చేరిన 'యాత్ర' డైరెక్ట‌ర్..?

Update: 2020-11-13 14:10 GMT
ఇండస్ట్రీలోకి ప్రొడ్యూసర్ గా అడుగుపెట్టి డైరెక్టర్ అయిన వారిలో మహి వి రాఘవ్ ఒకరు. 'విలేజ్ లో వినాయకుడు' 'కుదిరితే కప్పు కాఫీ' వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన మహి వి రాఘవ.. 'పాఠశాల' అనే సినిమాతో డైరెక్టర్ గా మారాడు. ఆ తర్వాత హీరోయిన్ తాప్సి ప్రధాన పాత్రలో 'ఆనందో బ్రహ్మ' అనే హారర్ కామెడీ సినిమాని తెరకెక్కించి సక్సెస్ అందుకున్నాడు. ఇదే క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలోని పాదయాత్ర ఘట్టాన్ని ఆధారంగా చేసుకుని 'యాత్ర' అనే సినిమా రూపొందించి మరో హిట్ కొట్టాడు. అయితే ఈ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన రాఘవ్ తదుపరి సినిమాపై ఇంకా క్లారిటీ రాలేదు.

నిజానికి 'యాత్ర' సినిమా సక్సెస్ అయిన తర్వాత 'యాత్ర 2' కూడా తీస్తానని మహి వి రాఘవ్ ప్రకటించారు. రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్‌ మోహన్ రెడ్డి రాజకీయ ప్రయాణం నేపథ్యంలో ‘యాత్ర 2’ సినిమాను తెరకెక్కిస్తానని రాఘవ్ వెల్లడించారు. అయితే అది ఎప్పుడనేది చెప్పలేదు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తో మహి నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. అలానే కింగ్ అక్కినేని నాగార్జునతో తదుపరి సినిమా ఉంటుందని టాక్ వచ్చింది. కాకపోతే ఇంతవరకు వీటిపై ఎలాంటి అప్డేట్ లేదు. అయితే ఇప్పుడు మహి వి రాఘవ్ యూవీ క్రియేషన్స్ గూటికి చేరినట్లు సినీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఎలాగైతే హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ తో లింక్ పెట్టుకుని వారితోనే వ‌రుస సినిమాలు చేస్తున్నాడో.. ఇక పై మ‌హి వి రాఘ‌వ చేసే సినిమాలన్నీ యూవీ క్రియేష‌న్స్ వారే నిర్మించ‌బోతున్నారట. ముందుగా ఈ బ్యానర్ లో ఓ మ‌ల్టీస్టారర్ మూవీ చేయ‌డానికి 'యాత్ర' డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
Tags:    

Similar News