క్యాస్టింగ్ కౌచ్.. JD చెప్పిన ఆ నిర్మాత ఎవరు?
టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్, ఇండస్ట్రీలో ఎదురయ్యే చేదు అనుభవాల గురించి అప్పుడప్పుడు సెలబ్రిటీలు మాట్లాడుతుంటారు. తాజాగా నటుడు జేడీ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు మరోసారి ఆ అంశాన్ని చర్చకు తీసుకొచ్చాయి.;
టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్, ఇండస్ట్రీలో ఎదురయ్యే చేదు అనుభవాల గురించి అప్పుడప్పుడు సెలబ్రిటీలు మాట్లాడుతుంటారు. తాజాగా నటుడు జేడీ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు మరోసారి ఆ అంశాన్ని చర్చకు తీసుకొచ్చాయి. ఆయన ఒక ఇంటర్వ్యూలో గతంలో జరిగిన ఒక సంఘటన గుర్తుచేసుకుంటూ చెప్పిన వివరాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.
జేడీ చక్రవర్తి చెప్పిన ప్రకారం, ఒక సినిమా షూటింగ్ సమయంలో ఆయనతో కలిసి పనిచేస్తున్న ఓ నటి గెస్ట్ హౌస్ లో ఉండేదట. ఒక రోజు రాత్రి భోజనానికి ఆమె తనను, అలాగే నటుడు సురేష్ ను పిలిచిందని తెలిపారు. దీంతో ఇద్దరూ కలిసి ఆమె గదికి వెళ్లారు. ఆ సమయంలో సాధారణంగా సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారని చెప్పారు. రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో గది తలుపు తట్టిన శబ్దం వినిపించిందట.
మొదట అది భోజనం వచ్చిందేమో అనుకుని సాధారణంగానే భావించారని జేడీ తెలిపారు. అయితే ఆ నటి గదిలో ఉన్న అద్దం ద్వారా బయట ఎవరు ఉన్నారో చూసిందట. బయట ఉన్న వ్యక్తిని గుర్తించిన వెంటనే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని ఆయన గుర్తుచేశారు. ఆమె వెంటనే జేడీ చక్రవర్తి, సురేష్‌లను మంచం కింద దాక్కోమని చెప్పారట. ఏం జరుగుతుందో అర్థం కాకపోయినా, ఆమె చెప్పినట్టే ఇద్దరూ అలాగే చేశారని తెలిపారు.
కొద్దిసేపటికే గదిలోకి ఎక్కువ వయస్సు గల ఓ నిర్మాత ప్రవేశించారని చెప్పారు. ఆయన వయసు ఆ నటి తాతయ్య వయసుతో సమానంగా ఉంటుందని జేడీ వివరించారు. మొదట్లో మంచం కింద దాక్కున్న ఇద్దరికీ ఈ పరిస్థితి కొంచెం విచిత్రంగా అనిపించి నవ్వు కూడా వచ్చిందట. కానీ ఆ నిర్మాత ఆ నటితో మాట్లాడిన తీరు, ప్రవర్తించిన విధానం చూసిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పారు.
ఆ సంభాషణలో ఉన్న అసభ్యత, ఆమెను చూసిన విధానం చాలా బాధాకరంగా అనిపించిందని జేడీ తెలిపారు. కొంతసేపటి తర్వాత ఆ నిర్మాత వెళ్లిపోయాక, బయటకు వచ్చిన ఇద్దరూ ఆ నటితో మాట్లాడారట. ఆమె మాత్రం నవ్వుతూ పరిస్థితిని సర్దిచెప్పేందుకు ప్రయత్నించిందని చెప్పారు. అయితే ఆమె చెప్పిన మాటలు మాత్రం మరింత కలచివేశాయని జేడీ అన్నారు.
"ఏం చేస్తాం? ఆయన పెద్ద నిర్మాత. ఆయనను నొప్పించకుండా, ఎలాగైనా మాటల్లో మేనేజ్ చేస్తూ తప్పించుకోవాల్సిందే" అని ఆ నటి చెప్పిందని జేడీ వెల్లడించారు. ఆ మాటలు విన్న తర్వాత తమ కళ్లలో నీళ్లు వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ గా మారగా.. ఇండస్ట్రీలో కొందరు మహిళలు ఎదుర్కొనే పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉంటాయో అర్థమవుతుందని నెటిజన్లు అంటున్నారు.. అవకాశాల కోసం కొందరు నటీమణులు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోందనే చర్చ మళ్లీ మొదలైంది. అయితే జేడీ ఎక్కడా ఆ నిర్మాత పేరు వెల్లడించలేదు. దీంతో ఆ వ్యక్తి ఎవరన్నది ఇప్పుడు ఊహాగానాలకు దారితీస్తోంది. సోషల్ మీడియాలో కూడా పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.