మూవీ రివ్యూ : వరల్డ్ ఫేమస్ లవర్

Update: 2020-02-14 11:21 GMT
చిత్రం :  వరల్డ్ ఫేమస్ లవర్

నటీనటులు: విజయ్ దేవరకొండ-రాశి ఖన్నా-ఐశ్వర్యా రాజేష్-కేథరిన్ థ్రెసా-ఇజబెల్లా-ప్రియదర్శి-జయప్రకాష్ తదిరులు
సంగీతం: గోపీసుందర్
ఛాయాగ్రహణం: జయకృష్ణ గుమ్మడి
నిర్మాత: కె.ఎ.వల్లభ
రచన-దర్శకత్వం: క్రాంతిమాధవ్

ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి మంచి సినిమాలతో పేరు సంపాదించి.. ఆ తర్వాత ‘ఉంగరాల రాంబాబు’ లాంటి పేలవమైన సినిమాను అందించిన దర్శకుడు క్రాంతి మాధవ్. ఈసారి అతను మళ్లీ తన శైలిలోకి మారి.. యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ప్రేమకథ ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: గౌతమ్ (విజయ్ దేవరకొండ), యామిని (రాశి ఖన్నా) తొలి చూపులోనే ఒకరినొకరు ఇష్టపడి.. కాలేజీలో చదువుకుంటూ ప్రేమలో పడ్డ జంట. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాలు తెచ్చుకున్న వీళ్లిద్దరూ పెళ్లికి సిద్ధపడగా.. యామిని తండ్రి అడ్డం పడతాడు. దీంతో ఇద్దరూ సహజీవనం చేస్తూ జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంటారు. కొంత కాలం తర్వాత ఉద్యోగం మానేసి తనకెంతో ఇష్టమైన రైటింగ్ మీద గౌతమ్ దృష్టిసారించాలనుకుంటే.. యామిని అతడికి అండగా నిలుస్తుంది. కానీ ఆమె ప్రేమను అర్థం చేసుకోకుండా గౌతమ్ వృథాగా జీవితాన్ని గడిపేస్తుంటాడు. గౌతమ్ ప్రవర్తనకు విసిగిపోయిన యామిని అతణ్ని విడిచి వెళ్లిపోతుంది. ఈ స్థితిలో గౌతమ్ ఏం చేశాడు.. ఇక్కడి నుంచి అతడి జీవితం ఎలా మలుపు తిరిగింది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో మనం తెర మీద చూసే కథనే హీరో ఒక కథగా రాస్తాడు. ఆ కథ చదివి హీరో ఫ్రెండు కన్నీళ్లు పెట్టేసుకుంటాడు. ఆ ఫ్రెండుతో పాటు అతడి తండ్రి కూడా ఆ కథకు ఫిదా అయిపోతాడు. లక్షలు ఖర్చు పెట్టి పుస్తకం ప్రచురిస్తాడు. అది ఏకంగా 50 లక్షల కాపీలు అమ్ముడై రికార్డు సృష్టిస్తుంది. చదివిన ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురవుతారు. కన్నీళ్లు పెట్టేసుకుంటారు. ఈ కథ రాసిన రచయితకు లక్షల మంది అభిమానులు తయారవుతారు. అతడి కోసం పడి చచ్చిపోతుంటారు. క్లైమాక్స్ కూడా లేకుండానే ప్రచురితమైన అద్భుతమైన స్పందన తెచ్చుకున్న ఈ కథకు హీరో ఎలాంటి ముగింపునిస్తాడా అని ఉత్కంఠగా ఎదురు చూస్తుంటారు. కానీ వాళ్ల ఎగ్జైట్మెంట్ అంతా చూసి అసలు వీళ్లు ఈ కథతో ఇంతగా ఎలా కనెక్టయిపోయారు.. ఇందులో ఏమంత ఉద్వేగం ఉందని.. ఏం ప్రత్యేకత ఉందని అనే సందేహాలు ప్రేక్షకులకు కలుగుతాయి. తన కథ పట్ల క్రాంతి మాధవ్ అంత భావోద్వేగానికి గురైతే అయి ఉండొచ్చు కానీ.. ఒక దశా దిశా లేకుండా సాగిపోయే ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కథతో సగటు ప్రేక్షకుడు కెన్ట్ కావడం మాత్రం కష్టమే.

‘వరల్డ్ ఫేమస్ లవర్’లో మంచి మూమెంట్స్ లేవని కాదు. ముఖ్యంగా బొగ్గు గనుల నేపథ్యంలో సాగే ఒక ఎపిసోడ్ నడుస్తున్నంతసేపు ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ప్రత్యేకమైన సినిమాలాగే కనిపిస్తుంది. క్రాంతి మాధవ్ ఈ ఎపిసోడ్ వరకు రచయితగా, దర్శకుడిగా తన నైపుణ్యం చూపించాడు. మనసును తట్టే పాత్రలు, సన్నివేశాలు, భావోద్వేగాలతో ఆ ట్రాక్ వరకు ప్రేక్షకుల ఆసక్తిని నిలబెడుతుంది. ఇటు విజయ్ దేవరకొండ, అటు ఐశ్వర్యా రాజేష్ అద్భుతమైన నటనతో దీన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు. ఈ కథ.. ఇందులోని పాత్రలు.. సన్నివేశాల్లో ఒక స్వచ్ఛత కనిపిస్తుంది. తెలంగాణ నేటివ్ స్లాంగ్, ఇల్లెందు వాతావరణం కూడా దానికి మరింత అందం తీసుకొచ్చాయి. సినిమాలో హీరో ఊహలోంచి పుట్టుకొచ్చే కథ ఇది. కానీ ఆ ఊహ చాలా అందంగా అనిపిస్తుంది. ఈ ఉపకథ నడిచినింత అందంగా మిగతా సినిమా నడవకపోవడమే ‘వరల్డ్ ఫేమస్ లవర్’కు ఉన్న ప్రధాన బలహీనత.
4

‘వరల్డ్ ఫేమస్ లవర్’లో ఉపకథల్ని పక్కన పెడితే.. మిగతా కథలో ‘అర్జున్ రెడ్డి’ ఛాయలు కనిపిస్తాయి. ఇక్కడ కూడా హీరో ప్రేమలో చాలా లోతుకు కూరుకుపోయి.. దాని తాలూకు భావోద్వేగాల్లో కొట్టుమిట్టాడుతుంటాడు. కానీ ఇక్కడ హీరో ప్రవర్తన ఎందుకు దారి తప్పుతాడన్నదే అర్థం కాదు. అతడి బాధకు కారణం కనిపించదు. అతడి వేదనలో అర్థం ఉండదు. దీంతో అర్జున్ రెడ్డిలా గౌతమ్ బాధ ప్రేక్షకుల హృదయానికి తాకదు. అతడి ప్రవర్తన పైత్యంలా కనిపిస్తుంది తప్ప.. దాన్ని ఆడియన్స్ ఫీలయ్యేందుకు ఆస్కారమే లేకపోయింది. అసలు ఆరంభం నుంచే గౌతమ్-యామిని కథతో ప్రేక్షకులకు ఒక భావోద్వేగ బంధం ఏర్పరచడంలో దర్శకుడు విఫలమయ్యాడు. చాలా వరకు కృత్రిమంగా అనిపిస్తుంది ఆ కథ. ముందే డిస్కనెక్ట్ అయిపోవడం వల్ల ఒక దశ దాటాక ఈ కథ పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది. ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురు చూసేలా చేస్తుంది.

హీరో రాసే పుస్తకంలో భాగంగా అతడి ఊహల్లోంచి ఇందులో రెండు ఉపకథలు చెప్పారు. మొదటగా వచ్చే ఇల్లెందు ఉపకథ సినిమాకే హైలైట్‌ గా నిలిచింది. దాని వల్ల ప్రథమార్ధం మంచి ఫీలింగే ఇస్తుంది. కానీ ఇదే తరహాలో వచ్చే ప్యారిస్ ఉపకథ మాత్రం ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుంది. ఏమాత్రం కనెక్ట్ కాలేని ఈ కథ వల్ల ద్వితీయార్ధం భారంగా తయారైంది. ఈ కథ మొదలైన దగ్గరే ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ట్రాక్ తప్పుతుంది. ఇక మళ్లీ ఎక్కడా ట్రాక్ ఎక్కే ఛాన్సే తీసుకోలేదు క్రాంతి మాధవ్. విజయ్ దేవరకొండ డ్రైవింగ్ ఫోర్స్ లాగా నిలబడ్డప్పటికీ.. కనెక్ట్ కాలేని కథ, ప్రధాన పాత్రల మూలంగా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ప్రేక్షకులకు రుచించని విధంగా తయారైంది. కొన్ని మూమెంట్స్ బాగున్నప్పటికీ ఓవరాల్ గా ఈ సినిమా నిరాశపరుస్తుంది.

నటీనటులు: విజయ్ దేవరకొండ తానెంత గొప్ప పెర్ఫామరో మరోసారి రుజువు చేశాడు. సినిమాలో అతడి పాత్ర అనేక రకాలుగా కనిపిస్తుంది. లుక్స్ విషయంలోనే కాదు.. నటన పరంగానూ అతను వైవిధ్యం చూపించాడు. పూర్తి స్థాయి తేలంగాణ గ్రామీణ యాసతో సాగే శీనయ్య పాత్రలో విజయ్ చాలా కొత్తగా కనిపిస్తాడు. మిగతా చోట్ల కూడా విజయ్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. వర్తమానంలో అతడి పాత్ర చూస్తే వద్దన్నా అర్జున్ రెడ్డి గుర్తుకొస్తుంది. యామిని పాత్రలో రాశి ఖన్నా కూడా బాగా పెర్ఫామ్ చేసింది. ఆమె పాత్ర ఆశించిన స్థాయిలో లేకపోయినా. రాశి మాత్రం ఆకట్టుకుంది. ఐతే హీరోయిన్లలో బెస్ట్ పెర్ఫామర్ ఎవరంటే.. ఐశ్వర్యా రాజేష్ అనడంలో మరో మాట లేదు. ఆమెకు స్క్రీన్ టైం తక్కువే కానీ.. ఆ తక్కువలోనే అద్భుతంగా నటించి మెప్పించింది. ఈ పాత్రలో ఆమె గుర్తుండిపోతుంది. కేథరిన్ థ్రెసా, ఇజబెల్లా పాత్రలకు తగ్గట్లు నటించారు. ప్రియదర్శి, జయప్రకాష్ సహాయ పాత్రల్లో తమ ఉనికిని చాటుకున్నారు.

సాంకేతిక వర్గం: ప్రేమకథలకు సంగీతం పెద్ద బలమవ్వాలి. ఐతే లవ్ స్టోరీలకు మంచి ఫీల్ ఉన్న సంగీతం అందిస్తాడని పేరున్న గోపీసుందర్.. ‘వరల్డ్ ఫేమస్ లవర్’కు మాత్రం అన్యాయం చేశాడు. వినసొంపుగా ఉండే ఒక్క పాట కూడా ఇవ్వలేదు. థియేటర్ నుంచి బయటికొచ్చాక గుర్తుండే ఒక్క పాటా ఇందులో లేదు. సినిమాకు పాటలు పెద్ద బలహీనత అయ్యాయి. నేపథ్య సంగీతం కూడా సోసోగా అనిపిస్తుంది. జయకృష్ణ గుమ్మడి ఛాయాగ్రహణం ఓకే. క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థ నిర్మాణ విలువల విషయంలో రాజీ పడలేదు. తన స్థాయిని చాటుకుంటూ సినిమాకు అవసరమైనంత మేర ఖర్చు పెట్టింది. ఐతే దర్శకుడు క్రాంతి మాధవ్ కు అన్ని వనరులూ సమకూరినా ఉపయోగించుకోలేకపోయాడు. విజయ్ లాంటి పెర్ఫామర్ ను అతను సరిగా ఉపయోగించుకోలేదు. ఇల్లెందు ట్రాక్ లో చూపించిన పనితనాన్ని అతను.. సినిమా అంతటా చూపించి ఉంటే ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఒక క్లాసిక్ అయ్యేదే. ప్రేమలోని గాఢతను చెప్పే ప్రయత్నంలో అతను దారి తప్పి ఎక్కడికో వెళ్లిపోయాడు. నిలకడ లేని కథాకథనాలతో అతను ఉస్సూరుమనిపించాడు.

చివరగా: వరల్డ్ ఫేమస్ లవర్.. దారి తప్పాడు

రేటింగ్-2/5


Tags:    

Similar News