టాప్ స్టోరి: ద‌స‌రా బ‌రిలో పొట్టేళ్లు ఢీ అంటే ఢీ

Update: 2021-06-02 03:30 GMT
క‌రోనా సెకండ్ వేవ్ వ‌ల్ల విలువైన వేసవి వేస్ట్ అయ్యింది. ఈ సీజ‌న్ తెలుగు సినిమాలేవీ రిలీజ్ కాలేదు. త‌దుప‌రి రిలీజ్ తేదీ కోసం ఒక డ‌జ‌ను పైగానే క్రేజీ సినిమాలు వెయిటింగ్. అయితే జూలైలో రావాల్సిన కేజీఎఫ్ 2 ద‌స‌రా బ‌రిలో రిలీజ్ కి రెడీ అవుతోంద‌ని తెలిసింది. జూలై 16న రిలీజ్ తేదీపై ప్ర‌క‌ట‌న ఉండే ఛాన్సుంది. ఈ సినిమాకి అన్నిచోట్లా ఇప్ప‌టికే అసాధార‌ణ‌మైన హైప్ నెల‌కొంది. రాఖీ భాయ్ గా య‌ష్ న‌ట‌న ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌పై అపార‌మైన న‌మ్మ‌కం ఉన్న అభిమానులు కోలార్ బంగారు గ‌నుల వార్ ని తెర‌పై చూడాల‌ని ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు.

అయితే అంత‌టి క్రేజీ సినిమాతో అల్లు అర్జున్ పుష్ప పోటీప‌డ‌నుందా? అంటే అవున‌నే టాక్ వినిపిస్తోంది. పుష్ప రిలీజ్ తేదీ కూడా ఇప్ప‌టికే వాయిదా ప‌డింది. ప్ర‌స్తుతానికి ద‌స‌రా బ‌రిలో రిలీజ్ చేయాల‌న్న‌ది చిత్ర‌బృందం ఆలోచ‌న‌. ఇక ఈ సినిమాని రెండు భాగాలుగా తెర‌కెక్కిస్తున్నారు కాబ‌ట్టి పార్ట్ 1 కి లైన్ క్లియ‌ర్ చేసే ప్లాన్ లో  ఉన్నార‌ట‌. అయితే కేజీఎఫ్ 2 లాంటి భారీ చిత్రంతో పుష్ప పోటీకి దిగ‌డం కాస్త‌ ఆలోచించాల్సిన విష‌య‌మే. కేజీఎఫ్ 2 హైప్ ముందు ఇంకేదీ నిల‌వ‌ద‌న్న చ‌ర్చ ప‌రిశ్ర‌మ‌లో ఉంది. ఆ క్ర‌మంలోనే పుష్ప రిలీజ్ తేదీ విష‌యంలో ఆచితూచి అడుగులేస్తారనే చ‌ర్చా సాగుతోంది. ఇక పుష్ప టీజ‌ర్ తో మెప్పించింది. ట్రైల‌ర్ తో కాంపిటీట‌ర్ కి స‌రైన స‌మాధానం ఇచ్చేందుకు రెడీ అవుతారా? అన్న‌ది కూడా కాస్త వేచి చూడాలి.

మ‌రోవైపు ఎస్.ఎస్.రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ అక్టోబ‌ర్ లో రిలీజ్ కి వ‌చ్చే వీలుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ముందే ప్ర‌క‌టించిన తేదీకే జ‌క్క‌న్న క‌మిటై ఉన్నార‌న్న‌ది తాజా వార్త‌. 2021 మోస్ట్ అవైటెడ్ మూవీగా కేజీఎఫ్ 2 తో పాటు ఆర్.ఆర్.ఆర్ కి త‌గిన గుర్తింపు ఉంది. అంటే ద‌స‌రా బ‌రిలో మూడు క్రేజీ పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కి రానుండ‌డం నిజంగా అభిమానుల‌కు పండ‌గ లాంటి వార్తే. పొట్టేళ్లు ఢీ అంటే ఢీ అంటూ వ‌స్తుంటే అది ఇండ‌స్ట్రీకి ఉత్సాహం పెంచే విష‌య‌మే.

అయితే క‌రోనా సెకండ్ వేవ్ విల‌యం జూలై చివ‌రి నాటికి అయినా పూర్తిగా శాంతిస్తుంద‌న్న హోప్ తోనే ఈ ప్ర‌య‌త్నం అని తెలిసింది. దేశంలో 60ప‌ర్సంట్ వ్యాక్సినేష‌న్ ద‌స‌రా నాటికి పూర్త‌వుతుంద‌ని ఆశ‌. అప్ప‌టికి ప్ర‌జ‌ల్లో పూర్తి ధీమా వ‌చ్చి థియేట‌ర్ల‌కు వ‌స్తార‌ని ఆశిస్తున్నారు. మ‌రి అనుకున్న‌ట్టే అంతా స‌వ్యంగా జ‌ర‌గాల‌నే ఆశిద్దాం.
Tags:    

Similar News