టాప్ స్టోరి: హాళ్లు తెరిచినా జ‌నం రాక‌పోవ‌డానికి కార‌ణం?

Update: 2020-11-06 08:10 GMT
థియేట‌ర్లు మ‌ల్టీప్లెక్సులు తెరిచేస్తే జ‌నం ఎగ‌బ‌డి వ‌చ్చేస్తారా?  క‌రోనా భ‌యాలు పూర్తిగా తొలిగిపోయిన‌ట్టేనా?  ఈ రెండు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలిస్తే అస‌లు సినిమాల్ని థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయాలా? వ‌ద్దా? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం దొరికిన‌ట్టే. థియేట‌ర్లు తెరిచినా మునుప‌టిలా పాప్ కార్న్ కోక్ కొని తాగే ప‌రిస్థితి.. రెస్ట్ రూమ్ కి వెళ్లాల‌న్న ఆలోచ‌నా ఉంటుందా? అన‌్న‌ది కూడా ఎప్పుడూ మిలియ‌న్ డాల‌ర్ ప్ర‌శ్న‌గానే మిగిలింది.

ఏ ర‌కంగా చూసినా క‌రోనా వ‌ల్ల సినీరంగం పుట్టి మునిగింద‌నే చెప్పాలి. ప్ర‌భుత్వాలు అనుమ‌తులు ఇచ్చేశాక థియేట‌ర్లు తెరిచారు. కానీ రిజ‌ల్ట్ నిల్. అస‌లు వ్యాపారం ఎక్కడ ఉంది?  ఎగ్జిబిట‌ర్లు ఇలా అయితే బౌన్స్ బ్యాక్ అవ్వ‌డం అంత వీజీనా?

పైగా ఎంట‌ర్ టైన్ చేసే కొత్త కంటెంట్ స‌రిప‌డినంతా లేదు.  కొంత‌వ‌ర‌కూ వేరే భాషా సినిమాల‌తో న‌డిపించారు. వైరస్ భయాల న‌డుమ సినిమా అనుభవాన్ని కొంత‌వ‌ర‌కూ జ‌నం ఎదుర్కొనే ప్ర‌య‌త్నం చేశారు. కానీ థియేటర్ యజమానులు చాలా వ‌ర‌కూ ఖాళీ సీట్లతో షోలను నడుపుతున్నారు.

ఉత్త‌రాదిన దిల్లీ స‌హా ప‌లు రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్ల‌ను తిరిగి ప్రారంభించారు. మహారాష్ట్ర ప్రభుత్వం అనుమ‌తులిచ్చింది. కానీ ఎక్క‌డా వాణిజ్యానికి సానుకూల సంకేతాలు అయితే క‌నిపించ‌లేదు. థియేట‌ర్లు కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా ప్రజలను తిరిగి థియేటర్లలోకి రప్పించడం క‌ష్ట‌త‌రంగా మారింది. భద్రతాపరమైన ఆందోళనలు.. ఆక్యుపెన్సీ పరిమితులకు సంబంధించిన నిబంధనలు .. క్రొత్త కంటెంట్ లేకపోవడం వల్ల ప్రారంభ ప్రతిస్పందన నెమ్మదిగా ఉంది. అయితే కొంత‌వ‌ర‌కూ ట్రెండీ ఎంట‌ర్ టైన‌ర్ల‌కు కొత్త‌ద‌నానికి సినీప్రియులు ప‌ట్టంగ‌ట్టార‌న్న టాక్ వినిపించ‌డం కొంత‌లో కొంత మేలు.

అలాగే ఎగ్జిబిట‌ర్లు చేపట్టిన భద్రతా చర్యలపై జ‌నంలో కొంత‌వ‌ర‌కూ విశ్వాసం పెరిగింది. ఇక‌పై ఆక్యుపెన్సీ ప‌రిమితుల్లో మార్పులొస్తాయ‌న్న ఆశాభావం కూడా వ్య‌క్త‌మ‌వుతోంది‌. మహారాష్ట్ర- తమిళనాడు- పంజాబ్  సహా చాలా ముఖ్యమైన సినిమా ప్రాంతాలు ఇప్పుడు పెద్ద తెరపై ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుండటంతో అన్నిచోట్లా ఎలా ఉండ‌నుందోన‌న్న విశ్లేష‌ణ సాగుతోంది. మునుముందు భారతదేశం అంతటా సినిమాలు తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నాయి. అయితే పాత సినిమాలు తిరిగి విడుదల కావడంతో ఆక్యుపెన్సీ 10 శాతం మాత్ర‌మే ఉంద‌ని తెలుస్తోంది. ప్రజలను థియేటర్లలోకి తీసుకురావడానికి కొత్త సినిమాలు విడుదల కావాలి అని అంచ‌నా వేశారు ఓ అన‌లిస్ట్.

ఇంకా ప్ర‌జ‌ల్లో భ‌యం అలానే ఉంది. అంతేకాదు క‌రోనా కేసులు అంత‌కంత‌కు పెరుగుతున్నాయన్న‌ది కూడా మనందరికీ తెలుసు.
ప్రస్తుతం సినిమా పరిశ్రమ ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో చిక్కుకుంది, ఇక్కడ కొత్త కంటెంట్ లేకపోవడం వల్ల అది ప్రభావితమవుతోంది. సినిమా కంటెంట్ ఒక వైపు.. మార్గదర్శకాల సడలింపు వరకు కొత్త సినిమాలను విడుదల చేయడానికి నిర్మాతలు ఇష్టపడకపోవడం .. భారతదేశం అంతటా సినిమా థియేటర్లను తిరిగి తెరవక‌పోవ‌డం వ‌గైరా స‌మ‌స్య‌లు ఎగ్జిబిష‌న్ రంగానికి తూట్లు పొడుస్తున్నాయి.
Tags:    

Similar News