ప్రపంచ వ్యాప్తంగా పారితోషికంలో అతడే టాప్!
ఈ భారీ ఒప్పందంతో టామ్ క్రూజ్ హాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నారు.;
హాలీవుడ్ యాక్షన్ స్టార్ టామ్ క్రూజ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన `టాప్ గన్` ఫ్రాంచైజీలో మూడవ భాగానికి రంగం సిద్దమవుతోంది. తాజాగా ఈ సినిమా కోసం టామ్ క్రూజ్ అందుకుంటోన్న పారితోషికం ఎంతో తెలిస్తే? సినీ ప్రపంచం విస్తుపోవడం ఖాయం. `టాప్ గన్ 3` కోసం టామ్ క్రూజ్ ఏకంగా 100 మిలియన్ పౌండ్ల (భారతీయ కరెన్సీలో 1070 కోట్లు) భారీ మొత్తాన్ని అందుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలొస్తున్నాయి.
ఈ భారీ ఒప్పందంతో టామ్ క్రూజ్ హాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నారు. గతంలో రాబర్ట్ డౌనీ జూనియర్, ర్యాన్ రేనాల్డ్స్ వంటి స్టార్ హీరోలు కొన్ని ప్రతిష్టాత్మక చిత్రాల కోసం అందుకున్న రికార్డు రెమ్యూనరేషన్లను ఈ డీల్ తుడిచిపెట్టేయబోతోంది. 60 ఏళ్లు దాటినా కూడా డూప్ లేకుండా సాహసోపేతమైన విమాన విన్యాసాలు చేసే టామ్ క్రూజ్ అంకితభావమే ఈ స్థాయికి తీసుకొచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది కేవలం `టాప్ గన్ 3` కోసం తీసుకుంటోన్న పారితోషికం మాత్రమే.
అదనంగా సినిమా లాభాల్లో వాటా కూడా అందుకుంటారు. నిర్మాణ సంస్థలతో ఆ రకంగానే టామ్ క్రూజ్ ఒప్పందం చేసుకున్నట్లు కథనాలొస్తున్నాయి. హాలీవుడ్ ట్రెండ్ ప్రకారం అకర్కడ అగ్ర తారలంతా సినిమా వసూళ్లలో పర్సంటేజ్ తీసుకుంటారు. `టాప్ గన్: మావెరిక్` ప్రపంచవ్యాప్తంగా 1.5 బిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టడంతో మూడవ భాగంపై నిర్మాతలు అంతటి భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్నారు. అందుకే టామ్ క్రూజ్ డిమాండ్ చేసిన మొత్తాన్ని ఇవ్వడానికి పారామౌంట్ పిక్చర్స్ వెనుకాడటం లేదని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో హాలీవుడ్ టాప్ ఎర్నర్స్ క్లబ్‌లో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. రాబర్ట్ డౌనీ జూనియర్ మార్వెల్ చిత్రాలతో, ర్యాన్ రేనాల్డ్స్ `రెడ్ నోటీస్, `డెడ్‌పూల్` వంటి చిత్రాలతో సృష్టించిన రికార్డులను టామ్ క్రూజ్ తాజాగా అధిగమించబోతున్నాడు. ఒక నటుడికి 100 మిలియన్ పౌండ్లు ఇవ్వడం అనేది సినిమా బడ్జెట్ పై ప్రభావం చూపినప్పటికీ టామ్ క్రూజ్ బ్రాండ్ ఇమేజ్ వల్ల వచ్చే గ్యారెంటీ వసూళ్లు ఆ రిస్క్ తీసుకునేలా చేస్తున్నాయన్ని కాదనలేని నిజం. ప్రస్తుతం `టాప్ గన్ 3` స్క్రిప్ట్ పనులు తుది దశలో ఉన్నాయి. త్వరలోనే దర్శకుడు జోసెఫ్ కోసిన్స్కీ ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారని సమాచారం.
టామ్ క్రూజ్ తో పాటు గత భాగంలో నటించిన మైల్స్ టెల్లర్, గ్లెన్ పావెల్ కూడా ఈ క్రేజీ సీక్వెల్ లో భాగం కానున్నారు. విమాన విన్యాసాల్లో సరికొత్త సాంకేతికతను జోడించి, ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందించాలని చిత్ర బృందం పట్టుదలతో పని చేస్తోంది. టామ్ క్రూజ్ `మిషన్ ఇంపాజిబుల్` సిరీస్, మరోవైపు `టాప్ గన్` వంటి చిత్రాలతో హాలీవుడ్ ఆర్థిక ముఖచిత్రాన్నే మార్చేసారు. ఈ భారీ పారితోషికం వార్త హాలీవుడ్ హీరోల రెమ్యూనరేషన్ మార్కెట్‌ను కొత్త పుంతలు తొక్కించడం ఖాయం. రాబోయే భారీ బడ్జెట్ చిత్రాలకు ఈ పారితోషికం ఓ బెంచ్ మార్క్‌గా నిలవనుంది.