వేదిక‌పై రితీష్- జెనీలియా క‌న్నీళ్లు.. భావోద్వేగానికి అస‌లు కార‌ణం?

మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వీరగాథను వెండితెరపై ఆవిష్కరిస్తూ తెరకెక్కిన చారిత్రక చిత్రం `రాజా శివాజీ`. ఇటీవల ముంబైలో జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక అత్యంత వైభవంగా సాగింది.;

Update: 2026-04-20 17:26 GMT

మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వీరగాథను వెండితెరపై ఆవిష్కరిస్తూ తెరకెక్కిన చారిత్రక చిత్రం `రాజా శివాజీ`. ఇటీవల ముంబైలో జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక అత్యంత వైభవంగా సాగింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి నటుడు రితీష్ దేశ్‌ముఖ్ దర్శకత్వం వహించడమే కాకుండా.. స్వయంగా కథా రచనలోనూ భాగస్వామి అయ్యారు. శివాజీ మహారాజ్ జీవితాన్ని ప్రపంచవ్యాప్త ప్రేక్షకులకు అత్యంత ప్రభావవంతంగా చేరవేయాలనే లక్ష్యంతో రితీష్ ఈ భారీ ప్రాజెక్టును పట్టాలెక్కించారు.

ట్రైలర్ లాంచ్ సందర్భంగా రితీష్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ.. ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. తన తండ్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత విలాస్‌రావు దేశ్‌ముఖ్‌ను గుర్తుచేసుకుంటూ ఆయన స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ దృశ్యం అక్కడి వారిని కలచివేసింది. రితీష్‌తో పాటు అత‌డి భార్య జెనీలియా కూడా ఎమోషనల్ అయ్యారు. తన చిరకాల స్వప్నాన్ని నిజం చేయడంలో వెన్నంటి నిలిచిన జెనీలియాకు రితీష్ మీడియా సాక్షిగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రితీష్ ఆవేదనను చూసి వేదికపై ఉన్న సీనియర్ నటుడు సంజయ్ దత్ కు కూడా కళ్లు చెమర్చడాన్ని అహూతులు చూసారు.

ఈ వేడుకలో వెల్ల‌డించిన సినిమా సంగ‌తులు ఆస‌క్తిని క‌లిగించాయి. ఈ చిత్రంలో శివాజీ మహారాజ్ వీర యోధుడు `జీవా మహాలా` పాత్రను బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పోషించినట్లు వెల్లడించారు. సల్మాన్‌తో పాటు సచిన్ ఖేడేకర్, ఫర్దీన్ ఖాన్, జితేంద్ర జోషి వంటి హేమాహేమీలు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని మరాఠీ - హిందీ భాషల్లో ఏకకాలంలో అత్యున్నత సాంకేతికత‌.. భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చారిత్రక చిత్రాన్ని వీక్షించేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ముంబైలో జరిగిన ఈ వేడుకకు బాలీవుడ్ దిగ్గజాలు అభిషేక్ బచ్చన్, విద్యాబాలన్, మహేష్ మంజ్రేకర్, భాగ్యశ్రీ తదితరులు హాజరై చిత్ర యూనిట్‌ను అభినందించారు. రితీష్ తన తండ్రిని తలచుకుని ఏడుస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ``ఎంత ఎదిగినా తండ్రి తోడు, ప్రేమ ప్రతి ఒక్కరికీ అవసరం! అంటూ నెటిజన్లు రితీష్‌కు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. తండ్రిపై రితేష్ దేశ్ ముఖ్ కి ఉన్న‌ అపారమైన గౌరవం, అనురాగం అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

`రాజా శివాజీ` వచ్చే ఏడాది మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రత్యేకించి మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండటం విశేషం. శివాజీ మహారాజ్ వైభవాన్ని.. మరాఠా వీరత్వాన్ని చాటిచెప్పే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను సృష్టిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.



Tags:    

Similar News