లాంగ్ గ్యాప్ హీరోల మార్కెట్ స్థిరత్వానికి ముప్పా?
అంతర్జాతీయ స్థాయిలో ఇమేజ్ పెరిగినప్పుడు ఆ గ్యాప్ అనేది ఒక ఇన్వెస్ట్‌మెంట్‌లా మారుతుంది. సినిమా క్వాలిటీ అద్భుతంగా ఉంటే ప్రేక్షకులు ఎంత కాలమైనా?;
ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర హీరోలంతా పాన్ ఇండియా బాట పట్టారు. ఈ క్రమంలో ఒక సినిమా పూర్తి చేయడానికి మూడేళ్ల నుంచి నాలుగేళ్ల సమయం పడుతోంది. `గేమ్ ఛేంజర్` తర్వాత తర్వాత రామ్ చరణ్, `దేవర` తర్వాత ఎన్టీఆర్ , `పుష్ప2` తర్వాత అల్లు అర్జున్, రాజమౌళి ప్రాజెక్ట్ కోసం మహేష్ ఇలా అంతా కొత్త సినిమా రిలీజ్ కోసం సుదీర్ఘ విరామం తీసు కుంటున్నారు. ఈ భారీ గ్యాప్ వల్ల వారి మార్కెట్ స్థిరత్వంపై ప్రభావం పడుతుందా? లేక ఒక్క గ్లోబల్ హిట్ అన్నింటినీ సెట్ చేస్తుందా? అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఒకప్పుడు స్టార్ హీరోలు ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేసేవారు.
దీంతో బాక్సాఫీస్ వద్ద వారి బ్రాండ్ వాల్యూ నిరంతరం పెరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్ కోసం చేస్తున్న ప్రయత్నాల్లో సినిమా స్కేల్ అమాంతం పెరిగింది. విజువల్ ఎఫెక్ట్స్, భారీ యాక్షన్ సీక్వెన్సుల కోసం ఏళ్ల తరబడి షూటింగ్ చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో ప్రేక్షకులు తమ అభిమాన హీరోని వెండి తెరపై చూసి చాలా కాలం గడిచిపోతోంది. ఇది థియేట్రికల్ బిజినెస్ పంపిణీదారులకు కొంత ఆందోళన కలిగించే విషయమే.సుదీర్ఘ విరామం వల్ల కలిగే ప్రధాన ముప్పు ఏమిటంటే? ప్రేక్షకుల అభిరుచులు మారుతూ ఉండటం.
మూడేళ్ల క్రితం ఉన్న ట్రెండ్ ఇప్పుడు ఉండకపోవచ్చు. సినిమా విడుదలయ్యే సమయానికి కథ పాతబడే ప్రమాదం కూడా ఉంది. అలాగే కొత్త తరం హీరోలు వేగంగా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద తమ స్థానాన్ని పదిల పరుచుకుంటారు. అగ్ర హీరోలు గ్యాప్ తీసుకోవడం వల్ల వారి మార్కెట్ వాటా కొంత మేర కొత్త నటుల వైపు మళ్లే అవకాశం లేకపోలేదు. మరో కోణంలో చూస్తే.. `ఒక్క భారీ హిట్ వేయి తప్పులను కప్పిపుచ్చుతుంది` అనే సామెత సినిమా ఇండస్ట్రీకి పక్కాగా సరిపోతుంది. `ఆర్ఆర్ఆర్` కోసం ఎన్టీఆర్, చరణ్ ఏళ్లు కేటాయించినా ఆ సినిమా సాధించిన విజయం వారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది.
అంతర్జాతీయ స్థాయిలో ఇమేజ్ పెరిగినప్పుడు ఆ గ్యాప్ అనేది ఒక ఇన్వెస్ట్‌మెంట్‌లా మారుతుంది. సినిమా క్వాలిటీ అద్భుతంగా ఉంటే ప్రేక్షకులు ఎంత కాలమైనా? నిరీక్షించడానికి సిద్ధంగా ఉంటారని `బాహుబలి`, `కేజీఎఫ్` వంటి చిత్రాలు నిరూపించాయి. ఈ గ్యాప్ వల్ల హీరోల మార్కెట్ స్థిరత్వం దెబ్బతినకుండా ఉండాలంటే వారంతా సోషల్ మీడియా , ఇతర మార్గాల ద్వారా నిరంతరం ప్రేక్షకులతో టచ్‌లో ఉండాల్సి వస్తోంది. అలాగే ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తూనే మధ్యలో చిన్న విరామాల్లో ఏదైనా ఫాస్ట్ ట్రాక్ సినిమాలు చేస్తే బాగుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ప్రస్తుత స్టార్ హీరోలు మాత్రం క్వాలిటీ ఈజ్ కింగ్ అనే సూత్రాన్ని నమ్మి సమయం ఎక్కువైనా సరే పక్కా అవుట్‌పుట్ కోసం మొగ్గు చూపుతున్నారు.
అయితే భారీ గ్యాప్ తీసుకోవడం అనేది రెండంచుల కత్తి లాంటిది. సినిమా హిట్ అయితే అది చరిత్ర సృష్టిస్తుంది. కానీ ఫలితం తేడా వస్తే మాత్రం ఆ ఇన్నేళ్ల కష్టం వృధా అవ్వడమే కాక మార్కెట్ విలువను భారీగా తగ్గిస్తుంది. అందుకే పాన్ ఇండియా ఇమేజ్ కోసం ప్రాకులాడే క్రమంలో కనీసం రెండు ఏళ్లకు ఒక్క సినిమా అయినా వచ్చేలా ప్లాన్ చేసుకోవడం స్టార్ హీరోల మార్కెట్ స్థిరత్వానికి శ్రేయస్కరంగా నిపుణులు భావిస్తున్నారు.